రికాంలేని రిజిస్ట్రార్ల ఆమ్దానీ` ‘2’

` మధుమాయ…స్టాంపు పేపర్లు కిదర్‌ గయా..?
` మూడు లక్షల విలువైన పేపర్ల మూడేళ్ల కింద మాయం?
` జరిగింది నిజమే కాని అంత కాదు…అంటున్న క్లర్కు?
` అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లే కదా..?
` అయినా ఇప్పటి వరకు దిక్కూదివానం లేని పర్యవేక్షణ?
` అధికారులు పట్టించుకోరు…విచారణ చేయరు
` లెక్కలు చూసింది లేదు? తేల్చింది లేదు?
` ఇదంతా జరుగుతున్నా శాఖలో ఉలుకు లేదు? పలుకు లేదు??
` అంతా పైవాడు చూసుకుంటాడన్న నమ్మకమా..?
` సుబ్బారావు చెంతనుండగా…చింతెందుకు అనుకుంటున్నారట?
` క్లర్కు కాళ్లు మొక్కిండని అధికారులు వదిలేశారట?
` ప్రజాధనం కొల్లగొట్టి దయాగుణం చూపెట్టిన అధికారులు భలే…భలే…?
హైదరాబాద్‌ , నేటిధాత్రి :
తాడి చెట్టుకిందకు ఎందుకు వెళ్లావంటే దూడ గడ్డి కోసమని ఎవరైనా సమాధనం చెబితే ఎలా వుంటుంది. సరిగ్గా వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయ క్లర్కు మధు చెప్పే, చెప్పించే సమాధానాలు సరిగ్గా అలాగే వున్నాయి. మూడేళ్ల క్రితం మీ ఆఫీసులో ఏం జరిగిందని నేటి ధాత్రి ప్రశ్నిస్తే…నాకు గుండె జబ్బు వుందన్న సమాధానం చెప్పించాడు. రెవిన్యూ స్టాంపులు మాయమైనట్లు మాకు సమాచారం వుందని అంటే నా గుండెలో మిషన్‌ ఏర్పాటు చేశారు. సౌండ్‌ బైటకు కూడా వినిపిస్తుంటున్నాడు. అసలు స్టాంపు పేపర్లు ఎలా మాయమయ్యాయని అడుతుంటే అప్పుడు వేరే రిజిస్ట్రార్‌ వుండేవారంటారు…అదేంటి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మేం అడుగుతున్నదేమిటి? మీరు చెబుతున్నదేమిటి? అని అంటే శివకుమార్‌ అనే స్టాంపు వెండర్‌ రూ.50వేల రూపాయల చలాన్‌ తర్వాత చెల్లించేశాడని అంటున్నారు. అసలు ఎక్కడైనా ప్రశ్నకు, సమాధానానికి పొంతన వుందా? అందుకే తాడిచెట్టు సామెత చెప్పాల్సివచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే సరిగ్గా మూడేళ్ల క్రితం వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయం నుంచి రూ.3 లక్షల రూపాయల విలవైన స్టాంపు పేపర్లు మాయం అయ్యాయి. అందుకు కార్యాలయ క్లర్కు మధు కారణం అంటున్నారు. అబ్బే జరిగింది అంత కాదు. కేవలం రూ. 50 వేల స్టాంపు పేపర్లే కాని, ఆ తర్వాత సంబంధిత స్టాంపు వెండర్‌ శివకుమార్‌ ఛలాన చెల్లించేశాడు. కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు. ఇదీ క్లర్కు మధు వివరణ. అంటే జరిగింది వాస్తవమే కాని, జరిగింది 3 లక్షలు కాదు…అని ఒప్పుకున్నట్లు కాదా? ఇప్పటికైనా పై అధికారులు పట్టించుకుంటారా లేదా? ఎలా జరిగిందన్నది విచారిస్తారా లేదా? క్లర్కు తన మాటల్లోనే అంత కాదు, ఇంత అనే విషయాన్ని ఒప్పుకున్న విషయం మీకు తెలియంది కాదా? ఆలస్యమైనా సరే…తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తారా? దయాగుణం చూపించి వదిలేశారా? లేక ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని సైలెంటు అయ్యారా? ఇంత కాలం బైటక పొక్కకుండా దాచేశారా?
సహజంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సంబంధిత సూపరెండెంటు, సెక్షన్‌ ఇన్‌ఛార్జిలు బాధ్యత వహించాలి. చేసింది క్లర్కు అయినా చేయించిన వాళ్లు వెనుక ఎవరున్నారు? అవి ఎవరు ఎవరికివ్వమన్నారు? ఎవరికిచ్చారు? ఎవరు వాటిని వాడేసుకున్నారు? అన్న సంగతి కార్యాలయం మొత్తానికి తెలియకుండా జరుగుతుందా? కాని ఎవరూ కిమ్మనలేదు. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ ఎలా జరిగిందని ఆరా తీయలేదు. సరికదా…లక్షలాది రూపాయల ప్రజా ధనం వృధా చేసిన వ్యక్తులకు అండగా నిలుస్తున్నారు. అంటే అర్ధమేమిటి? ఆఖరుకు మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్లర్కు ఉన్నతాధికారుల కాళ్లు మొక్కాడని వదిలేశారట. ఎంత భలేగా వుంది కదా! అధికారులది ఎంత జాలి గుండెనో…ప్రభుత్వ ధనం లూటీ చేసిన వారిని కూడా క్షమించేంత దయా గుణం వారికే సొంతం. పోయింది వారి సొమ్ము కాదు కదా? రాజుల సొమ్ము రాళ్ల పాలు అది గతం. ప్రజల సొమ్ము అధికారులపాలు అని మార్చినట్లున్నారు.
అసలు ప్రభుత్వ కార్యాలయం అంటే ఎలా వుంటుంది? గుండు పిన్ను కొన్నా లెక్కుండాలి. ఒక్క కాగితం వాడినా లెక్కరాయాలి. ఇదీ సర్కారు లెక్కల సంగతి. కాని ఏకంగా మూడు లక్షల రూపాయల స్టాంపు పేపర్లు మాయమైతే లెక్కలు లేవా? రాయలేదా? ప్రజాధనం లూటీ చేశారా? మన్నుతిన్న పాములా సైలెంటుగా వున్నారా? అంటే ఔననే సమాధానం మాత్రం నర్మగర్భంగానే ఊ…అంటూ వస్తూనే…రూ.50వేలు కట్టేశారంటున్నారు. ఇదీ అధికారుల తీరు…ఆఖరుకు క్లర్కు మధు అసలు సంగతిని చెప్పకనే చెప్పేశాడు. అయితే లాజిక్‌ లేని సమాధానం చెబుతున్నానని అనుకోలేదు. రసీదులు లేకుండా రిజిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయం నుంచి స్టాంపు పేపర్‌ ఒక్కటి కూడా బైటకు వెళ్లే అవకాశం లేదు. సంబంధితం స్టాంపు వెండర్‌ ఎవరైనా సరే ముందు అవసరమైన మేరకు ఛలనా తీయాలి. దాన్ని అధికారలు డీ పాస్‌ చేయాలి. అప్పుడు గాని వాటిని ఇవ్వడానికి వీలు లేదు. కాని ఏకంగా రూ. 3లక్షల రూపాయల విలువైన పేపర్లు మాయం కావడమేమిటి? వాటికి సంబంధించిన రూ.50వేల ఛాలన్‌ తర్వాత చెల్లించడమేమిటి? అలా నమ్మకంతో కూడా స్టాంపు పేపర్లను ఒక స్టాంపు వెండర్‌కు అందించే అధికారం క్లర్కుకు వుంటుందా? అధికారుల సంతకం లేకుండానే బైటకు వెళ్తాయా? స్టాంపు పేపర్లు అంటే అంత ఆషామాషీ వ్యవహరమైపోయిందా? అంతా గందరగోళంగానే వుంది…
మూడేళ్ల క్రితం స్టాంపు పేపర్లు మాయమైతే ఇప్పటి వరకు చర్యలు లేకపోవడం ఆశ్యర్యమేస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పుడు మంత్రిగా వున్న కృష్ణ యాదవ్‌ను మహరాష్ట్రకు చెందిన పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. కేవలం లక్ష రూపాయల విలువైన నకిలీ స్టాంపు పేపర్ల తయారీ, సరఫరా సహకరించాన్న సమాచారం మేరకు ఆరేళ్లపాటు జైలు జీవితం అనుభవించారు. ఎందుకంటే స్టాంపు పేపర్ల వ్యవహారం అంత సీరియస్‌. క్యాబినేట్‌ మంత్రిగా వున్న వ్యక్తిని కనీసం నాడు స్పీకర్‌కు కూడా చెప్పకుండా, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలియకుండా, ఎలాంటి బెయిల్‌ మంజూరు చేయకుండా, ఆరేళ్లపాటు రిమాండ్‌ ఖైదీగానే జైలులో వుంచారు….కాని వరంగల్‌ జిల్లా రిజిస్ట్రేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో 3 లక్షల రూపాయల విలువైన పేపర్లు మాయమైతే ఇంత నిర్లిప్తతా…అసలు నాడు ఆ మంత్రిమీద కేవలం అనుమానం మాత్రమే…ఆ అనుమానంతో ఆరేళ్లపాటు ఎలాంటి బెయిల్‌ ఇవ్వకుండా ఖైదు చేశారు. మూడేళ్లు గడుస్తున్నా…వరంగల్‌లో జరిగిన ఈ విషయాన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటి మాయం వెనకు ఎవరెవరున్నారన్నరదానిపై రకరకాల చర్చ జరుగుతోంది. అయితే దీనితోపాటు రాష్ట్రంలోని అనేక రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న లీలలు అంతా ఇంతా కాదు. అయితే వారందరినీ కాపాడుతూ వారికి అభయంగా వుంటూ ఓ సుబ్బారావు అనే పెద్ద మనిషి వున్నాడని భహిరంగగానే చెప్పుకుంటున్నారు. ఎంతటి అవినీతి చేసినా సరే…నేను చూసుకుంటానన్నంత భరోసా ఇస్తూ కాపాడుతున్నాడట. అసలు స్టాంపు పేపర్‌ మాయం అన్నది దేశద్రోహానికి చెందినంత కేసు అన్నది తెలిసే చేస్తున్నారా? లేక దొరలేదు కదా? అనుకుంటున్నారా? ప్రభుత్వ రాజముద్రతో కూడుకున్న స్టాంపు డ్యూటీని అధికారులు ఇంత సింపుల్‌గా చేతులు మార్చుతున్నారా? వరంగల్‌ ఘటన ఇందుకు సాక్ష్యం. సహజంగా పుండు అన్నది ఒక్క దగ్గర మొదలైతే దాని చుట్టూ పుళ్లు పడడం కామన్‌. శరీరమైనా, సమాజమైనా ఒక్కటే…ఇలాంటివి ఎక్కడెక్కడ, ఏ కార్యాలయాలలో ఎంతెంత జరుగుతోందన్నదానిపై నేటిధాత్రి తన పరిశోధన చేపట్టింది. విస్తుపోయే నిజాలు తెలిసి ఆశ్చర్యపోయింది. ఈ విషయాలు ప్రజలు తెలియాలి. బాధితులు ఎంత మంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో ప్రపంచానికి తెలియాలి. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఎలా మోసాలు జరుగుతున్నాయో ప్రజలకు తెలియాలి. ఇదే మా అక్షర యజ్ఞం…మీ కోసం… సమాజం కోసం…పరిరక్షణ కోసం…మాతో మీరూ కలిసిరండి…బాధితులు మమ్మల్ని సంప్రదించండి. ఇంతకీ ఇప్పటికైనా వరంగల్‌లో జరిగిన సంఘటనపై దర్యాపు జరిపిస్తారో…లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *