రా…రమ్మని పిలుపులు?

-తెలంగాణలో రాజకీయ పేరంటాలు…

– నమ్మకం లేని వైచిత్య బంధాలు.

-మనసులొక చోట…

-నేతలొక చోట…

-కలవలేరు…కలుసుకోలేరు..

-కలవరపాటు నాయకత్వం..

-ఆలోచన లేని పార్టీల ప్రయాణం.

-మాదంటే మాదే గెలుపంటున్నారు.

-మా పక్కన చేరితే చాలంటున్నారు.

-ఎవరొస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు?

-ఇంతకీ మనం గెలుస్తామా? అని మధనపడుతున్నారు.

-పార్టీలు మారిన వారు తలలు పట్టుకుంటున్నారు.

-కొత్త వారిని కలవరపెడుతున్నారు.

-మేం మాత్రమే మునిగితే చాలదనుకుంటున్నారు.

-మునిగే నావలో అందరినీ నింపాలనుకుంటున్నారు.

-మొత్తానికి ఒకరినొకరు నిండా ముంచుకుంటున్నారు.                                       

హైదరబాద్‌,నేటిధాత్రి:   

 

రా..రమ్మని పిలుపులు..ఎవరొస్తారో అని ఎదురుచూపులు..ఎవరిని లాగేద్దామా? అని ఆలోచనలు. ఎవరైనా వస్తారా? అంటూ సమాలోచనలు..పుసుక్కున ఏ పార్టీలోనైనా అసంతృప్తులు ఎవరైనా వున్నారన్న సంగతి తెలిస్తే చాలు వెంటనే సంప్రదింపులు..ఎంత దూరమైనా వెళ్లి మంతనాలు….ఒకటికి నాలుగుసార్లు సమాలోచనలు…పైకి ఇష్టం లేకపోయినా రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటాలు..వున్న పార్టీలలో ఎవరికీ లేని ఇష్టాలు..అయినా తప్పని మనగడలు..రెండు ప్రతిపక్ష పార్టీలు..అధికార పార్టీని కొట్టేది మేమే అంటూ కబుర్లు..అధికార పార్టీ నుంచి అదిగో ..ఇదిగో నాయకులు వచ్చే అంటే ప్రకటనలు..చేరికలు జరిగిపోయినట్లే కలలు.. ఇవన్నీ ఏడాది కాలంగా సాగుతున్నా ఒక్కరూ వచ్చింది లేదు. ఎవరూ వెళ్లింది లేదు. వెళ్లిన వాళ్లంతా ఎప్పుడో వెళ్లిన వారే తప్ప, ప్రతిపక్షాలు బలోపేతమైంది లేదు. అధికార బిఆర్‌ఎస్‌ తామే పోటీ అని గట్టిగా చెప్పేంత దైర్యం ఇప్పుడు ఏ పార్టీకి లేదు. కాని పైకి మాత్రం చెప్పుకోకపోతే వున్న పరువు పోతుందని, ఇచ్చిన మర్యాద కాపాడుకోవడం కష్టమౌతుందని మధనపడుతున్నారు. పాపం…బిజేపిలో మొదలైన కలవరం చూస్తుంటే కలత నిద్రలు తప్ప వారికి మరేం కనిపించడం లేనట్లు వుంది. అటు కాంగ్రెస్‌, ఇటు బిజేపి రెండూ రెండో స్ధానంలో మేమేంటే మేమే అంటున్నారో..మెదటి స్ధానానికి వెళ్లేది మేమే అంటున్నారో వారికే అర్ధం కావడంలేదు. ఎది ఏమైనా మళ్లీ ప్రతిపక్షాలలో అసంతృప్తులు చిగురిస్తున్నాయి. ఒకే పార్టీలో వున్న నేతులు ఆ పార్టీలోనే చిచ్చులు పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారు.

 

తాజా రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే బిజేపిలో ఎవరో ఒకరుచేరాలి. లేకుంటే చేరికల కమిటీకి విలువ లేకుండాపోతోంది. దాంతో ఈటెల రాజేందర్‌ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది. లేకపోతే అంధకారమౌతుంది. ఏది ఏమైనా సరే బ్రతిమిలాడో..బామాడో…ఏదో రకంగా ఎంతోకొంతమందిని బిజేపిలో చేర్పిస్తే తప్ప తన మాట చెట్లబాటయ్యే పరిస్ధితి కనిపించడం లేదన్న మధనం ఈటెల రాజేందర్‌లో ఎక్కువైంది. అందుకే ఇటీవల అనేకసార్లు ఖమ్మం జిల్లాకు వెళ్తూ వస్తున్నారు. బిఆర్‌ఎస్‌ నుంచి వెలివేయబడడ్డ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మా పార్టీలో అంటే …మా పార్టీలో చేరుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు అనేక ప్రకటనలు చేస్తూ వచ్చాయి. పొంగులేటి మాత్రం ఆచి తూచి అడుగేయాలన్న ఆలోచనతో వున్నారు. కాని ప్రతిపక్షాలు ఆయనను ఎలా బుట్టలో వేసుకోవాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. కాని ఆయన ఎటు వైపు మొగ్గు చూపలేదు. ఎప్పుడైతే శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ తరిమేసిందో అప్పటి నుంచి ఆయన కూడలిలో నిలబడ్డానన్న సంగతిని తెలుసుకున్నారు. ఎటు చూసినా అంధకారమే కనిపిస్తోంది. కాకపోతే మేకపోతు గాంభీర్యం ప్రదిర్శిస్తూ వస్తున్నారు. అందుకే తానుమాత్రమే బలవంతుడినని ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. మొదట్లో ఆయన నాకు పది సీట్లు ఎవరిస్తే వాళ్లు వైపు వస్తానన్న మాట అందరికీ గట్టిగా చెప్పుకున్నాడు. దాంతో కాంగ్రెస్‌లో కదలిక వస్తుందనుకున్నారు. కానీ ఖమ్మంలో కాంగ్రెస్‌ ఎంతో కొంత బలంగానే వుంది. ఆ బలం శ్రీనివాస్‌రెడ్డికి ఉపయోగపడితే, మిగతా సీనియర్‌ కాంగ్రెస్‌నేతలు ఆగమౌతారు. అందుకే కాంగ్రెస్‌ పెద్దలు ఎవరూ ముందుకు రాలేదు. శ్రీనివాస్‌రెడ్డితో మంతనాలు జరపలేదు. సందిట్లో సడేమియా అన్నట్లు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటితో జతకట్టడంతో వారి బలం కొంత పెరిగినట్లు బిజేపికి కనిపించింది. దాంతో ఈటెల పెద్ద సైన్యాన్నే వేసుకొని ఖమ్మం వెళ్లి, సంప్రదింపులకు తెరలేపాడు. ఇంతలోనే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మీడియాతో ఈటెల రాజేందర్‌ ఖమ్మం వెళ్లినసంగతి తెలియదన్నాడు. అంతే..ఒక్కసారిగా బిజేపి వాతావరణం వేడెక్కింది. అంతా గందరగోళం. ఇది కూడా శ్రీనివాస్‌రెడ్డికి బాగా కలిసివచ్చింది. 

బిజేపి నేతల మొహం మాడిపోయింది.నాకు కొంత సమయం కావాలంటూ పొంగులేటి తప్పించుకునేందుకు మార్గం దొరికింది. అయినా చాలా మంది శ్రీనివాస్‌రెడ్డి బిజేపి వైపే వెళ్తాడంటూ జోస్యం కూడా చెప్పుకొచ్చారు. కాని ఇంతలో జరిగిన కర్నాకట ఎన్నికలు మళ్లీ శ్రీనివాస్‌రెడ్డిని కూడలిలోకి తెచ్చిపెట్టాయి. ఈటెలను అంతర్మధనంలోకి నెట్టేశాయి. బండి సంజయ్‌ ఆశలు గల్లంతయ్యేలా చేశాయి. నిన్నటిదాకా ఇక మాకు తెలంగాణలో తిరుగులేదు. మళ్లీ కర్నాటకలో మాకు ఎదురు లేదని చెప్పుకున్న బిజేపికి కన్ను బాగా లొట్టపోయింది. అక్కడి ప్రజలిచ్చిన తీర్పు తెలంగాణ బిజేపికి బాగానే తగిలింది. ఇదే సమయంలో బిజేపిలో అసంతృప్త నేతలుగా చెప్పబడుతున్న వాళ్లంతా ఒక జట్టుకట్టారన్న ప్రచారం బాగానే సాగుతోంది. వాళ్లలలో వాళ్లు కలిసినట్లు కనిపిస్తున్నా, అవకాశం నాకు కాకపోతే మరెవరికీ వస్తుందన్న ఆశలో వున్నారు. ముందు బండిని దించితే చాలు..ఆ తర్వాత ఏం జరిగుతుందో చూద్దామన్న ఆలోచనకు వచ్చారు. ఇటీవల ఈటెల రాజేందర్‌ డిల్లీ బాట పట్టారని, కేంద్ర పెద్దలకు ఏదో రిపోర్టు ఇచ్చారని బైటకు లీకులొచ్చాయి. బిజేపిలో మళ్లీ కుదుపులు మొదలయ్యాయి. ఒకరిమీద ఒకరు కత్తులు నూరుకునేదాక పరిస్ధితి వెళ్తేందనేది జరుగుతున్న ప్రచారం. ఇంతలో పార్టీ లైన్‌ ఎవరు తప్పినా క్షమించేది లేదంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంసతృప్త నేతలుగా ముద్రపడిన ఈటెల అండ్‌ కోకు బండి ఇది స్ట్రాంగ్‌ వార్నింగే అంటున్నారు.

   ఇదిలా వుంటే కాంగ్రెస్‌ మా గాంధీ భవన్‌ ద్వారాలు తెరిచే వున్నాయి.

 మీ కోసం పది మెట్లు దిగడానికి నేను సిద్దంగా వున్నాను అంటూ రేవంత్‌రెడ్డి రాజకీయ సందేశం పంపారు…మళ్లీ మన గూటికి చేరండి అంటూ మీడియా ముఖంగా ఆహ్వానాలు పంపాడు. ఇక్కడ మొదలైంది అసలు రాజకీయం. దాంతో పొంగులేటి సంగతి కాసేపు పక్కన పెడితే జూపల్లికి బహిరంగ రాయభారం చేరినట్లైంది. బిజేపిలో చేరిన కోమటి రెడ్డి లాంటి వారికి గాలమేసినట్లైంది. వివేక్‌ వెంకటస్వామికి ఆశ కలిగేలా చేసింది. ఈటెల రాజేందర్‌కు కూడా ఆశలు రేకెత్తించేలా చేసింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమటంటే కాంగ్రెస్‌ నుంచి బైటకొచ్చిన రాజగోపాల్‌రెడ్డి బిజేపిలో చేరి బాగుపడిరది లేదు. ఆ పార్టీకి ప్రెసిడెంటు అయ్యింది లేదు. భవిష్యత్తులో అవుతారన్న నమ్మకం అసలే లేదు. రాష్ట్రంలో కనీసం బిజేపి అధికారంలోకి వస్తున్న ఆశలు కలగడం లేదు. మళ్లీకాంగ్రెస్‌ గూటికి చేరినా ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యేది లేదు. ఇక ఈటెల రాజేందర్‌ పరిస్ధితి ఇంతకు మించి కొత్తగా ఏమీ వుండదు. బిజేపిలో వున్నా అంతే…కాంగ్రెస్‌లో వున్నా అంతే..కాకపోతే బిజేపిలో వుంటే ఈసారి ఈటెల కూడా గెలవడమే కష్టమన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇక వివేక్‌ వెంకటస్వామి అదే కాంగ్రెస్‌లో వుంటే ఆయనకు వుండే విలువ మరింత రెట్టింపయ్యేది. ఒక వేళ ఆయన బిజేపిని వదిలి, కాంగ్రెస్‌లోకి వచ్చినా, పుట్టింటికి చేరినట్లే వుంటుంది కాని, అక్కడ పచ్చడి మెతుకులు తప్ప మరేం అందకపోవచ్చు. పొంగులేటి, జూపల్లి లాంటి వారిని బిజేపిలోకి తీసుకురావాలిని చూస్తున్న ఈటెల రాజేందర్‌ లాంటి వారి మదిలో మరో ఆలోచన కూడా వుందంటూ జోరుగా చర్చ సాగుతోంది. పొంగులేటి ఒక వేళ ధైర్యం చేసి పార్టీపెడితే ఈ బ్యాచ్‌ అంతా ఆయా పార్టీలకు జెల్లకొట్టే అవకాశం కూడా వున్నాయంటున్నారు. ఇంత కాలం రాజకీయం చేసి, తన మీద తమకు నమ్మకంలేని నాయకులు, పొంగులేటికి లేని బలాన్ని నమ్మి నిండా మునుగుతారా? లేక కొత్త రాజకీయ ముఖచిత్రంలో వేధికౌతారా? సమిధలౌతారా? అన్నది వేచి చూడాల్సిందే..? కాకపోతే ఎక్కడికెళ్లినా, ఇక్కడే వున్నా వాళ్లెవరూ పార్టీలను నడిపేంత ఉద్దండులు కాదు. కాలేరు..? ఇదీ మ్యాటరు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *