ఫెడరల్‌ ఫ్రంట్‌పై సీఎం కేసిఆర్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? : విజయశాంతి

ఫెడరల్‌ ఫ్రంట్‌పై సీఎం కేసిఆర్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?

ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానని చెప్పి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ప్రధాన పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో అంతుబట్టడం లేదని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. తమిళనాడుకు వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్‌ ఇప్పుడు అక్కడ జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఆ పార్టీ తరపున ప్రచారం చేసి, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను అక్కడి ప్రజలకు వివరించి ఉండొచ్చు కాదా అని అన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కలిసి ఆ రాష్ట్రంలో కూడా ప్రచారం చేస్తే, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పే విషయంపై క్లారిటీ వచ్చేదని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు తాను మద్దతు తెలపడంతోపాటూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను జేడీఎస్‌ కాపీ కొట్టడం వల్లే కుమారస్వామి సీఎం అయ్యారని కేసీఆర్‌ ప్రచారం చేసుకున్నారని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పక్క నుండి కుమారస్వామిని గెలిపించానని చెప్పుకున్న కేసీఆర్‌, పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటక వైపు ఎందుకు ఒకసారి కూడా చూడలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిందని ఎద్దేవా చేశారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి, కొందరు ప్రాంతీయ నేతల మద్దతు కూడగడతానని హడావుడి చేసిన కేసీఆర్‌ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. గతంలో తాను కలిసిన నేతల తరపున పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి విముఖత చూపారంటే, దాని అర్ధం కేసీఆర్‌ మాట ఫెడరల్‌ ఫ్రంట్‌ వైపు, మనిషి మాత్రం మోడీ నేతత్వంలోని బీజేపీ వైపు ఉన్నారనే విషయంపై తెలంగాణ ప్రజలకు స్పష్టత వచ్చిందని అన్నారు. కొన్ని విషయాలను ఎంత దాచాలన్నా దాగవని తెలిపారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *