దళిత బంధు లో దగా.. దగా!

`దళితుల సొమ్ముకు ఎర!

`పథకం అమలుకు అధికారుల పొగ?

` అటు అధికారులు…ఇటు ట్రేడర్లు!

`కారుకు షోరూం కొటేషన్‌ లక్షన్నర అదనం…

`ట్రాక్టర్ల్‌ కు కూడా అంతే లక్షన్నర…

`మధ్య వర్తులంతా షోరూమ్‌ యజమానులే…

`వాటాల పంపకాలు వారి చేతుల మీదుగానే!

`ఇటు ఇస్తున్నారు…అటు అమ్ముకునే దారి చూపిస్తున్నారు.

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు?

`దళిత బంధును పక్కదారి పట్టిస్తున్నారు?

`పథకాన్ని నీరుగారుస్తున్నారు?

`సెంట్రింగ్‌ యూనిట్‌ లో రెండు లక్షలు కమీషన్‌…

` ప్రతి ఫైలుపై సంతకానికి ఎస్సీ కార్పొరేషన్‌ అధికారికి రూ. 30 వేలు.

`ప్రతి వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ కు ఆర్టీవోకు రూ. 13 వేలు.

` రాత్రికి రాత్రే లీడర్ల ట్రేడిరగ్‌ లైసెన్స్‌…

`దళిత బంధు అమలుపై ఇంటలిజెన్స్‌ ఆరా…

` రెండో విడతలో అధికారులు ఏది చెబితే అదే తీసుకోవాలి?

`మొదటి విడతలో తీసుకోని వారు వాహనాలే తీసుకోవాలి?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సమాజం ఎటుపోతోంది? దళితుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరిస్తోంది? ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రారంభించినా, ఆచరించి, అమలు చేయాల్సిన ఉద్యోగ వ్యవస్ధలో కొందరి వల్ల లక్ష్యం ఎందుకు నిర్వీర్యమౌతోంది? అన్న ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి? అసలు దళిత బంధు సొమ్ముకు అధికారులు ఆశపడడం ఏమిటి? దళారులు కాజేయాలని చూడడమేమిటి? ఎవరికి వారు తమ సొమ్మే అన్నట్లు వాటాలు వేసుకోవడమేమిటి? సంతకాలు పెట్టాలంటే ఇంత ఇవ్వాలని అధికారులు షరతులు పెట్టడమేమిటి? లంచం ఇస్తే తప్ప సంతకం పెట్టమన్నంత ధోరణి ప్రదర్శించడమేమిటి? మొత్తంగా దళిత బంధు లాంటి గొప్ప పథకం అమలో ఇంత దోపిడేంది? పైలెట్‌ ప్రాజెక్టన్న భయం కూడా అధికారుల్లో లేకపోవడం ఏమిటి?  

 సహజంగా ప్రైవేటు వ్యక్తులు షోరూంలలో కారు, ట్రాకర్‌, ఏ వాహనం కొన్నా, ప్రభుత్వ వర్గాలు కార్లు కొన్నా ఒకటే రేటు వుండాలి. 

అందుకు అవసరమైన కొటేషనే వేసి ఇవ్వాలి. ఒక వేళ తేడా ఏమైనా వుంటే అది వెయ్యో…రెండు వేలో తేడా వుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అంతే కాదు పెద్దఎత్తున కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్న సమయంలో మరింత తగ్గించి ఇవ్వాలి. ఇంతకు తగ్గించి ఇస్తేనే మేం కార్లు, ట్రాక్టర్లు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులే షరతులు విధించాలి. అది కాకుండా షోరూం లెందుకు రేట్లు పెంచి కొటేషన్లు ఇస్తున్నాయన్న అనుమానం అందరికీ వస్తుంది? కాని అసలు తిరకాసు ఇక్కడే వుంది? ఇది అధికారులు ఆడుతున్న డ్రామా అన్నది అందరికీ తెలిసిందే…కాని అడిగిన వారు లేదు? ప్రశ్నించిన వారు లేదు? అధికార వ్యవస్ధలో కింది నుంచి పై స్ధాయి దాకా అందరికీ తెలిసి జరగుతుందే? అయినా ఇంత దోపిడా? ఒక వాహనం మీద సుమారు రూ.లక్షన్నర ఎక్కువ చెల్లించడం అంటే లబ్ధిదారుడిని దోపిడీ చేయడం. ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదా? ఇది చట్టరిత్యా నేరం కాదా? అయినా ఇంతగా అధికారులు ఎలా భరితెగిస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమంటే కూడా భయం లేకుండాపోయిందా? ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తుందన్న ఆలోచన కూడ లేదా? జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయం కూడా లేదా? ఉద్యోగాలు పోయినా ఫరవాలేదన్న ధైర్యమా? ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారులే ప్రభుత్వ ధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారు. ఇందులో తమపాత్ర కనిపించంకుండా షోరూం యజమానులు, అక్కడ పనిచేసే ఉద్యోగులను మధ్యవర్తులుగా మార్చి సొమ్మును పంచుకుంటున్నారు. డైరెక్టుగా అంత పెద్ద అమౌంటు తీసుకుంటున్నట్లు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయలను నొక్కేస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సమారు 4వేల కార్లు, 4వేల ట్రాక్టర్లకు లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో మెజార్టీ లబ్ధిదారులకు వాహనాలు అందించారు. ఆ వాహనాల మీద అదనంగా వేసిన కొటేషన్‌ సొమ్మును అధికారుల పంచుకున్నారు. ఇంత భహిరంగంగా దోపిడీ సాగిస్తున్నారు. ఇదిలా వుంటే ఇక రెండు జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ప్రతి అప్లికేషన్‌ అప్రూవల్‌కు లబ్దిదారుల నుంచి రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. లబ్ధిదారుల్లో ఉన్నత విద్యావంతులున్నారు. అమాయకులైన లబ్ధిదారులనుంచే కాదు…ఉన్నత విద్యావంతులైన వారి నుంచి కూడా ముక్కుపిండి వసూలు చేసినట్లు రూ.30వేలు వసూలు చేశారని తెలుస్తోంది. అంటే తమ సంతకానికి వున్న పవర్‌ అని చెప్పకనే చెబుతున్నట్లు లెక్క. 

ఇక ఆ వాహనాల రిజిస్రేషన్‌ అన్నది ఆర్టీవో ఉచితంగానే చేయాలి.

 కాని ఆయనేం తక్కువ తిన్నారా? ఆయన కూడా ప్రతి వాహనానికి రూ.13వేలు వసూలు చేశారని లబ్ధిదారులు చెతున్నారు. పైగా ఎవరైనా లబ్ధిదారులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే, పుణ్యానికి వస్తేనే ఇలా మాట్లాడుతున్నావ్‌…కష్టపడితే ఏం మాట్లాడతావో? అంటూ బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. సరే అన్ని అవాంతరాలు దాటుకొని వాహనాలు తెచ్చుకున్నా ప్రతి వాడి కన్నూ ఆ వాహానాల మీదే…ఎలాగైనా వారి దగ్గరనుంచి ఆ వాహనాలు లేకుండా చేశారు..పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌ లోని వివిధ జిల్లాల నుంచి వచ్చి ట్రాక్టర్లు, కార్లు కొనుగోలు చేశారు. లబ్ధిదారులకు రెండు, మూడు లక్షలు చెతిలో పెట్టి వాహానాలు లేకుండా చేశారు. లబ్ధిదారుల బలహీనతలను ఆసరా చేసుకొని లీడర్లు, అధికారులు చేసిన పని వల్ల దళిత బంధురాకముందు దళితుల పరిస్దితి ఎలావుందో…ఇప్పుడూ అదే పరిస్దితి వుంది. అసలు దళిత బంధు వాహనాలు అమ్మొద్దు…ఎవరూ ఇతరులు వారి వద్ద నుంచి కొనుగోల చేయెద్దు. మరి ఎలా ఈ తతంగం అంతా జరుగుతోంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టిపెట్టాలి. లబ్దిదారులకు నగదు ఆశ చూపించి, సొమ్ము చేసుకున్న వారి వద్దనుంచి వాహనాలు వసూలు చేసి తిరిగి, లబ్ధిదారులకు అందించాలి. అప్పుడుగాని ఇలా ప్రభుత్వ పథకాల దుర్వినియోగానికి ఎవరూ పాల్పడరు…

   ఇక సెంట్రింగ్‌ యూనిట్‌ విషయంలో మరీ ఘోరం…

సెంట్రింగ్‌ పేరు మీద రూ.8లక్షలు డ్రా చేయించి తీసుకుంటున్న ట్రేడర్లు, లబ్ధిదారులకు రూ.6లక్షలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి లబ్ధిదారుని వద్ద నుంచి రూ.2లక్షలు కాజేస్తున్నారు. అధికారులకు వాటాలు పంచేస్తున్నారు. ఇదేనా ట్రేడర్ల ముసుగులో నాయకులు అడుతున్న నాటకం. అటు నాయకులు మోసం చేసి, ఇటు అధికారుల మోసం చేసి, దళితులకు న్యాయంగా అందాల్సిన సొమ్మును మాయంచేయడం ఎంత దుర్మార్గం. లబ్ధిదారులకు సెంట్రింగ్‌ యూనిట్‌ రూ.8లక్షల విలువ చూపించాల్సిందిపోయి, రూ.6లక్షలు చేతిలో పెట్టడమేమిటి? రూ.2 లక్షలు తీసుకోవడమేమిటి? ఇంత దర్జాగా దళిత బంధు సొమ్ము నొక్కేయడమేమిటి? మొదటి విడతలో దండుకోవాల్సినంత దండుకొని కోట్లు కొల్లగొట్టిన అధికారులు, రెండో విడతలో ఎలా నొక్కాలి? ఎంత నొక్కాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా మొదటి విడతలో ఎలాంటి లబ్ధి పొందని వారి నుంచి ఎలా వసూలు చేయాలన్నదానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఓ మండలంలో లబ్ధిదారురాలైన ఓ మహిళ తనకు కెమెరా కావాలని, తాను ఫోటోగ్రఫీ వృత్తిని నిర్వహించుకుంటానని అధికారుల దృష్టికి తీసుకెళ్తే, కారు తీసుకో..అని ఉచిత సలహా ఇచ్చారట. అంతే కాదు కారు తీసుకుంటామంటేనే సంతకం చేస్తామని కూడా చెప్పారట. అంటే ఫోటో కెమెరా విషయంలో ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. అదే కారు తీసుకుంటే షోరూం నుంచి నేరుగా వాటా అందే అవకాశం వుంది. ఇప్పటికే దళిత బంధులో దోచుకోవాల్సినంత దోచుకున్నారు…ఇంకా అడుగు బొడుగు వున్నవాటిని కూడా వదలమని తెగించి చెప్పేస్తున్నంత పని చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *