Women Quota Puzzle: Modi’s Master Plan?
మహిళా బిల్లులో చిక్కులేంటి మోదీ ‘మాస్టర్ ప్లాన్’ ఇదేనా!
మహిళా రిజర్వేషన్ల చట్టం ఇప్పుడు భారత రాజకీయాల్లో ఒక అంతుచిక్కని పజిల్‌గా మారింది. “అసలు ఈ చట్టం అమలు అయ్యే పని కాదని కేంద్రానికి తెలిసినా, కేవలం ఎన్నికల స్టంట్‌గానే దీన్ని తీసుకొచ్చారు” అని రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే, మరోవైపు కేంద్రం మాత్రం 2029 లక్ష్యంగా చక్రం తిప్పుతోంది. ఈ నేపథ్యంలో మహిళా కోటా చుట్టూ నడుస్తున్న అసలు ‘పొలిటికల్ గేమ్’ ఏంటి? జరిగిందేదో జరిగిపోయింది.. మరి జరగాల్సిందేంటి? ఇప్పుడు అందరిలోనూ ఇదే క్వశ్చన్.
అసలు మహిళా కోటా చుట్టూ ఉన్న చిక్కులేంటో చూద్దాం. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం 2023 సెప్టెంబర్ 20న లోక్‌సభలో ఆమోదం పొందింది. అదే ఏడాది సెప్టెంబర్ 21న రాజ్యసభలోనూ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సెప్టెంబర్ 29న రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అయితే అమలు విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. అధిక మెజారిటీతో పాస్ అయినా అమలు ఆలస్యం చేశారు. ఈ చట్టం అమలును జనగణనకు, డీలిమిటేషన్ కు లింకు పెట్టడంతో సమస్య పెరిగింది. ఆ లెక్కన 2034 నుంచి అమలు చేసేలా నిబంధనలు ఉన్నాయి. కోటా బిల్లు చట్టమైనా అమలు మాత్రం 2034 నుంచే. అయితే కేంద్రం మాత్రం ఎందుకోగానీ ఆల్ ఆఫ్ సడెన్ గా గేర్ మార్చి స్పీడ్ పెంచాలనుకుంది. 2029 ఎన్నికల నుంచే కోటా అమలు కోసం ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది.
2023లో ఆమోదం పొందిన 106వ రాజ్యాంగ సవరణలోని అంశాల ప్రకారం 2026 జనాభా లెక్కలు వచ్చాక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయొచ్చు. సో కొత్త జనాభా లెక్కల ప్రకారం అదే సమయంలో ఎవరూ నష్టపోకుండా మరో ఫార్ములాను మిక్స్ చేసి సీట్ల సంఖ్య పెంచి కోటా అమలు చేసే అవకాశం ఉంది. అలాగే చేస్తే అప్పుడు అప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే డీలిమిటేషన్ బిల్లు సభలో ప్రవేశపెట్టి సాధారణ మెజార్టీతో ఆమోదింపజేయవచ్చు. టూ బై థర్డ్ మెజారిటీ అవసరం లేదు. ఈ విషయంలో ఎన్డీఏ ఈజీగా నెగ్గుతుంది.
బిల్లు నెగ్గితే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 2029 ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయొచ్చు. ఒక ఆరు నెలల టైంలో ఈ కసరత్తు ఓ కొలిక్కి తేవొచ్చు అన్న పాయింట్ ను చాలా మంది వినిపిస్తున్నారు. పెరిగిన సీట్లలో 33% సీట్లను మహిళలకు రిజర్వు చేయవచ్చని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడున్న సీట్లపై 2001లో విధించిన రూల్ ఈ ఏడాదితో తొలగిపోతుంది కాబట్టి ఇప్పుడు జరగబోయే జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అంతా జనగణన చుట్టే ఆధారపడి ఉంది. 2027 మార్చి 1 లోపు జనగణన పూర్తవుతుంది. అప్పుడే అసలు గేమ్ మొదలు కావొచ్చు.
అసలు మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి కేంద్రం ఎందుకు ఆల్ ఆఫ్ సడెన్ గా ఉత్సాహం చూపిందో ఇంటర్నల్ విషయాలు, ప్రతిపక్షాల విమర్శల ఆధారంగా డీకోడ్ చేసి చూద్దాం. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా కోటాను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మ్యాజిక్ చేయాలని అనుకుందా అన్న డౌట్లు ఉన్నాయ్. ఇప్పటికే మోడీ సర్కార్ మూడు టర్ములు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో కొద్దిలో గట్టెక్కింది.
ఇప్పుడు జేడీయూ, టీడీపీ ఈ రెండు పార్టీల సపోర్ట్ తోనే ఎన్డీఏ ప్రభుత్వం బండి నడుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల నాటికి మరింత సహజ ప్రజావ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యతిరేకతను కౌంటర్ చేసేందుకు మహిళా కోటా అమలును కేంద్రం ఎత్తుకుందన్న వాదన కూడా ఉంది. డీలిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. మహిళా కోటా విషయంలో ఇతర అంశాలను ఎందుకు కలుపుతున్నారని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. దమ్ముంటే 2023 నాటి మహిళా బిల్లునే మరోసారి పెట్టాలని సవాల్ విసిరారు.
నిజానికి ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కూడా అంత ఈజీగా సాగలేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు దీనిపై వరుస ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తే 2023లో అవి ఫలించాయి. ఇప్పుడు అమలు విషయంలో అలాంటి సంఘర్షణే కంటిన్యూ అవుతోంది. మహిళా రిజర్వేషన్లు అయినా, డీలిమిటేషన్ అయినా ఇవన్నీ సెన్సిటివ్ సబ్జెక్ట్స్. వీటికి రాజ్యాంగ సవరణలు చేయాలంటే మరీ సెన్సిటివ్. అందుకే అందరినీ ఒప్పించి, మెప్పించాకే ముందుకెళ్లాలి. అదే సక్సెస్ ఫార్ములా అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ గేమ్ అయితే నడుస్తోంది.
