Farmer Development is Govt Priority
రైతుల అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
గీసుగొండ మండలం కోనాయిమాకులలో రైతు వారోత్సవం”
నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:
వివిధ రైతు సంక్షేమ పథకాలతో రైతుల అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం ముందుకెళ్తున్నదని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గీసుగొండ మండలం కోనాయిమాకుల గ్రామంలోని రైతు వేదికలో ‘రైతు వారోత్సవం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని రైతు వారోత్సవాలను మే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల అభివృద్ధియే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులను రైతులు అందిపుచ్చుకోవాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ సూచించారు. రైతు వేదికలు రైతులకు నిరంతర సమాచార మార్పిడి కేంద్రాలుగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షా పత్రం ఆధారంగానే ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచించారు.అనంతరం ప్రధాన శాస్త్రవేత్త ఎ. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు యూరియాను సిఫారసు మేరకు మాత్రమే వాడాలని మరియు పచ్చిరొట్ట ఎరువుల వినియోగాన్ని పెంచి భూమిని సంరక్షించుకోవాలని కోరారు.

శాస్త్రవేత్త బి. మాధవి వరి రకాల ఎంపిక, సాగు నీటి పొదుపు పద్ధతులు మరియు పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు వివరించారు.వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అనురాధ మాట్లాడుతూ, రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులను విచక్షణారహితంగా వాడకుండా సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు.రైతు వారోత్సవ కార్యక్రమంలో డి సి ఓ నీరజ, హార్టికల్చర్ శ్రీనివాసరావు, గీసుకొండ తాసిల్దార్ రియాజుద్దీన్, జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి డాక్టర్ ఎం. బాలకృష్ణ, జిల్లా మత్స్యశాఖ అధికారి పి. శ్రీపతి, ఇరిగేషన్ ఈ.ఈ. ప్రశాంతి, సంబంధిత శాఖఅధికారులు,మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్, విఏఎస్ శ్రీనివాస్, కోనాయిమాకుల సర్పంచ్ వి. రాజు, మరియపురం సర్పంచ్ అర్పిత, బి.ఎస్.సి అగ్రికల్చర్ విద్యార్థులు తన్మయి, షేక్ తస్లీమా మరియు అధిక సంఖ్యలో అభ్యుదయ రైతులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
