రైతమ్మలకు జేజేలు
మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే… ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది.
మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే… ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ఇది ప్రపంచ వ్యవసాయ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. పొలాల్లో విత్తనాలు చల్లటం నుంచి, కుటుంబాన్ని నడిపించే దాకా… వ్యవసాయ రంగాన్ని నిశ్శబ్దంగా మోస్తున్న ఎందరో రైతమ్మల కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపు ఇది. నేడు (మార్చి 8) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా కొందరు మహిళా రైతుల విజయగాథలకు నీరాజనాలు పలుకుదాం…
ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు మండలం సొవ్వ, కరకవలస గ్రామాల్లో 45 మంది మహిళా రైతులు… 13 పురాతన దేశీయ వరి రకాలను సాగు చేయడంతో పాటు, కరకవలస గ్రామంలో గెడ్డ వాగు వరదలకు మునిగిపోకుండా తట్టుకునే 4 నుంచి 6 అడుగుల వరకు పెరిగే దేశీయ వరిని సాగు చేస్తున్నారు. ఇక్కడి కుటుంబాలకు ఎకరం నుంచి రెండు ఎకరాలకు మించి ఉండదు. ‘‘ఇవి దేవుడు ఇచ్చిన ధాన్యపు రకాలు అని మా నమ్మకం. బస్నా సోప్పూర్, బుడమ ధాన్యం, దేశీ పెద్దధాన్యం, దేశీ రాజముడి, ఎర్ర ధాన్యం, గుడుం ధాన్యం, ఇసుకరవ్వలు, జోజోర్కి ధాన్యం, మాస్టర్ ధాన్యం, నల్ల ధాన్యం, పసుపు సన్నాలు, సోర్ ధాన్యం, తేటం ధాన్యం ఇలా 13 రకాలు పండిస్తున్నాం.
