జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము
ఇది మీడియా స్వేచ్ఛపై నేరుగా దాడి
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యూజే-ఐ)
భూపాలపల్లి నేటిధాత్రి
సీనియర్ జర్నలిస్టులైన దొంతు రమేష్,చారి,సుధీర్లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్.యూజే-ఐ) తీవ్రంగా ఖండిస్తుందని టిఎస్ జేయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడుక సుధాకర్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు తెలిపారు.బుధవారం వారు మాట్లాడుతూ
ఈ అరెస్టులు మీడియా స్వేచ్ఛను హరించే చర్యలని అన్నారు.ఈ అరెస్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం,వీడియో స్వేచ్ఛగా రాయొద్దు,ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు,అధికారంలో ఉన్నవారి మీద కథనాలు రాస్తే జైలు తప్పదు అని చెప్పాలనుకుంటున్నట్టుగా ఈ చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.ఒక పత్రికలో లేదా మీడియాలో ఒక అంశంపై కథనం వచ్చినప్పుడు,అందులోని నిజానిజాలపై అధికారులు విచారణ జరిపించాలి.కానీ ఆ అంశాన్ని బయటికి తీసుకొచ్చిన జర్నలిస్టుల మీదే కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా సమంజసం కాదన్నారు.అనేక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే కథనాలు తయారవుతాయన్నారు.ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులు, అధికారులు మీద ఆరోపణలు వస్తే,ఆ ఆరోపణల నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వం,తప్పు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కానీ ఆ పని చేయకుండా,జర్నలిస్టుల మీద పడి కేసులు పెట్టడం అంటే,ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేసినా చెల్లుతుందనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడమేనని చెప్పారు.ఏ వ్యక్తిగత ఫిర్యాదు లేకుండా,ఆ కేసులో పేర్లు లేకున్న కేవలం ఒక సంఘం ఫిర్యాదును ఆధారం చేసుకొని జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పూర్తిగా తప్పని, ఇది చట్టం కాదనీ ,ఇది భయపెట్టే ప్రయత్నం అన్నారు.ప్రభుత్వం ఈ కేసు ను వెంటనే ఎత్తివేసి,జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.మీడియా స్వేచ్ఛపై దాడులు ఆపకపోతే పెద్ద జర్నలిస్ట్ ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్,సంయుక్త కార్యదర్శులు కడపాక రవి,పల్నాటి రాజు, మారపేల్లి చంద్ర మౌళి, భూపాల్,జగన్, కారుకూరి సతీష్ హేందర్ తదితరులు పాల్గొన్నారు.
