వైభవంగా గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస పూజలు ముగింపు

వైభవంగా గోదాదేవి అమ్మవారి కల్యాణం

ముగిసిన ధనుర్మాస పూజలు

మంగపేట, నేటి ధాత్రి

 

ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమా ల్లో భాగంగా నిర్వహించే గోదాదేవి అమ్మవారి కల్యాణ మహోత్సవం బుధవారం కమలాపురం శ్రీ సితారామ చంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకుల వేదమంత్రోచ్ఛాణల మధ్య వైభవంగా జరిగింది. స్వామివారిని కల్యాణం చేసుకునేందుకు గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలో నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో స్వామివారిని తిరుప్పావై పారాయణంతో మేల్కొలిపి పూజించి ప్రసన్నం చేసుకుంటుందని ఆలయ పండితులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీకుమారాచార్యులు తెలిపారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజే వేంకటేశ్వరుడితో గోదాదేవి పరిణయాన్ని చూసే భాగ్యం కలుగుతుందని.. గోదాదేవి కల్యాణోత్సవం సాక్షాత్తు తిరుమలలో జరుగుతున్నట్లుగా అనుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొన్నారు. భక్తులు అమ్మవారికి, స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణోత్సవంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మార్మోగింది.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి.

నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం భరోసా

నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తాం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర రైతు వేదికలో మంగపేట గ్రామానికి చెందిన నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు సంబంధించిన పనులు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయంలోనే డెబ్బై శాతం పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు. ఆతర్వాత జరిగిన పరిణామాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు, వారికి ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు, రిజర్వాయర్లో తట్టెడు మట్టిని కూడా తీయలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తాను నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించిన సమయంలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీని మర్చిపోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఇరవై మూడున్నర కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట, నారాయణపూర్, చర్లపల్లి, ఇస్తారిపల్లి గ్రామాల్లో నిన్ను కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామని ఈసందర్భంగా భరోసా ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version