నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తాం
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర రైతు వేదికలో మంగపేట గ్రామానికి చెందిన నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు సంబంధించిన పనులు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయంలోనే డెబ్బై శాతం పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు. ఆతర్వాత జరిగిన పరిణామాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు, వారికి ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు, రిజర్వాయర్లో తట్టెడు మట్టిని కూడా తీయలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తాను నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించిన సమయంలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీని మర్చిపోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఇరవై మూడున్నర కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట, నారాయణపూర్, చర్లపల్లి, ఇస్తారిపల్లి గ్రామాల్లో నిన్ను కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామని ఈసందర్భంగా భరోసా ఇచ్చారు.
