విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు..

విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు

రోడ్డు భద్రతపై అవగాహనతో భవిష్యత్‌కు బాటలు

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో “అరైవ్ & అలైవ్” పేరుతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని జైపూర్ సీఐ నవీన్, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల జోన్ డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు చూపుతున్న క్రమశిక్షణను అభినందించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలను నేర్చుకుని పాటించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్,సీట్ బెల్ట్ వినియోగం అత్యవసరమని సూచించారు.ఈ నియమాలను మనమే కాకుండా కుటుంబ సభ్యులు,స్నేహితులకు కూడా తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతను వివరించి, నియమాలను గౌరవిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ట్రాఫిక్ నియమాలపై చిత్రలేఖనం చేశారు.సీపీ,డీసీపీలు వాటిని పరిశీలించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.అదేవిధంగా ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు పోస్ట్ కార్డు ద్వారా హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు.చివరగా విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ,తమ కుటుంబ సభ్యులతో కూడా పాటింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

జైపూర్ పోలీసుల రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై ప్రయాణికులకు అవగాహన

జైపూర్,నేటి ధాత్రి:

 

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జైపూర్ పోలీసులు పేర్కొన్నారు.శనివారం స్థానిక పిఎస్ పరిధిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతా నియమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ హబీబ్ మాట్లాడుతూ ఈ నెల 01 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భద్రతా నియమాలను వివిధ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని,కార్ల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని,పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వకూడదని,వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, పరిమితికి మించిన వేగంతో వెళ్లకూడదని, శబ్ద కాలుష్యానికి కారణం కాకూడదని వాహనదారులకు సూచించారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

నేరస్తునికి వారెంట్ జారి-జామీను వ్యక్తికి జైలు శిక్ష..

నేరస్తునికి వారెంట్ జారి-జామీను వ్యక్తికి జైలు శిక్ష

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో చెన్నూర్ కోర్టు నుండి నేరస్తునికి వారెంట్ జారీ చేస్తూ,జామీను వ్యక్తికి జైలు శిక్ష విధించారని జైపూర్ పోలీసులు తెలిపారు.2020లో రామారావు పేట గ్రామానికి చెందిన రేగుంట రాజలింగు తో పాటు కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి దుబాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న కేసులో స్థానిక పోలీస్ స్టేషన్ లో మురళి పై కేసు నమోదు అయినట్లు స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపారు.నేరస్తుడు కోర్టు పేషీలకు హాజరు కాకపోగా వారెంట్ జారీ చేశారన్నారు.బెల్లంపల్లి మండలం గురజాలకు చెందిన ఎండి నసీర్ మురళికి షూరిటీ ఇచ్చినందుకు చెన్నూర్ కోర్టు జడ్జి రవి రెండు నెలలు జైలు శిక్ష విధించారని వివరాలు వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version