బుషెహర్, సౌత్‌పార్స్ చమురు క్షేత్రాలపై దాడి
ఇరాన్ చుట్టూ 78 ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు
150 టార్గెట్లపై దాడులు 78 మంది మృతి
ఆర్మీ, ఎమర్జెన్సీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల దుర్మరణం
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడిలో ముగ్గురి మృతి
టెల్‌అవీవ్/న్యూఢిల్లీ, జూన్ 14:
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లో భారీ విధ్వంసం జరుగుతోంది. శనివారం తెల్లవారుజాము వరకు ఇరాన్ క్షిపణి కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్.
సాయంత్రం తొలిసారి ఆర్థిక మూలాలపై విరుచుకుపడింది. బుషెహర్ చమురు క్షేత్రాలు (ఇక్కడే అణు విద్యుత్తు కేంద్రం ఉంది), సౌత్ పార్స్ న్యాచురల్ గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేసింది.
ఆ ప్రాంతాల్లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని ఇరాన్ అధికారిక వార్తాసంస్థ తస్నీమ్ న్యూస్ పేర్కొంది.
ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ ఇంటికి సమీపంలోనూ క్షిపణులు పడ్డాయని వెల్లడించింది.
ఐక్య రాజ్య సమితి(ఐరాస) అణు విభాగం చీఫ్ రాఫెల్ గ్రోసీ కూడా ఓ ప్రకటన ద్వారా ఇరాన్‌లోని నటాంజ్(షాహిద్ అహ్మదీ రోషన్) అణు కేంద్రం ధ్వంసమైనట్లు నిర్ధారించారు.
ఇరాన్ మొత్తం తమ టార్గెట్‌లో ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించగా..
ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 9 మంది కీలక సైంటిస్టులు, 16 మంది మిలటరీ జనరళ్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) వెల్లడించింది.
వీరిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ముఖ్య సలహాదారు షంఖానీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఇరానియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మహమ్మద్ బఘేరీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ చీఫ్ గులామ్ అలీ రషీద్, ఇంటెలిజెన్స్ చీఫ్ గులామ్-అల్-మర్హాబ్, ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) కమాండర్ హుస్సేన్ సలామీ, ఐఆర్‌జీసీ ఎయిర్ కమాండర్ ఆమిర్ అలీ హాజీజాదే,డ్రోన్ల విభాగం కమాండర్ తాహెర్ పుర్, ఎయిర్ డిఫెన్స్ కమాండర్ దావూద్ షిహ్యాన్, క్షిపణి విభాగం కమాండర్ మహమ్మద్ బఘేరీ ఉన్నారు.
దీంతో ఇరాన్ త్రివిధ దళాలు పెద్దదిక్కులను కోల్పోయినట్లయింది.
ఆర్మీ కమాండర్ ఆమిర్ మౌసావీ, ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ మహమ్మద్ పాక్‌పౌర్, ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖ్వానీ, ఐఆర్‌జీసీ నేవీ కమాండర్ అలీరెజా తంగ్సీరి మాత్రమే ఇరాన్ సెక్యూరిటీ చైన్‌లో సజీవ కమాండర్లుగా ఉన్నట్లు తెలిపింది.
శనివారం సాయంత్రం నెతన్యాహు మాట్లాడుతూ.
మరో 90 నిమిషాల్లో ఇరాన్‌కు పెద్ద దెబ్బ తగులుతుందని ప్రకటించారు.
ఆయన ప్రకటన వెలువడిన 90వ నిమిషం నుంచి ఇజ్రాయెల్ వైమానిక దళం క్షిపణులతో ఇరాన్‌పై విరుచుకుపడడం గమనార్హం..! 150 టార్గెట్లను ఛేదించామని పేర్కొంటూ.
అందుకు సంబంధించిన ఫుటేజీని ఐడీఎఫ్ తన అధికారిక టెలిగ్రామ్ చానల్‌లో విడుదల చేసింది. శుక్ర, శనివారాల్లో జరిపిన దాడుల్లో చనిపోయిన ఇరాన్ శాస్త్రవేత్తల వివరాలను ప్రకటించింది.
ఆ జాబితాలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ నిపుణులు ఫ్రెదోన్ అబ్బాసీ, అహ్మద్ రజా దరియానీ, ఫిజిక్స్ నిపుణులు మహమ్మద్ మెహ్దీ తెహ్రాన్షీ, ఆమిర్ హసన్ ఫఖీ, అబ్దుల్లామిద్ మినుష్షర్, మన్సూర్ అస్ఘరీ, మెకానిక్స్ నిపుణుడు అలీ బౌఖాయ్ ఖత్రిమీ, కెమికల్ ఇంజనీరింగ్ నిపుణుడు అక్బర్ మతాలిజాదా, మెటీరియల్స్ ఇంజనీరింగ్ నిపుణుడు సయీద్ బార్జీ ఉన్నట్లు తెలిపింది.
ఇరాన్ మీడియా కూడా ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది మరణించారని, 320 మంది గాయపడ్డారని పేర్కొంది.
ఇజ్రాయెల్ ముప్పేట దాడులతో ఇరాన్‌లోని ప్రముఖులు రష్యాకు పారిపోతున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా స్పష్టం చేస్తోంది. సుప్రీం లీడర్ ఖమేనీ ఇంటి సమీపంలోనూ క్షిపణి దాడులు జరగడం.
ఆయన ముఖ్య సలహాదారు సహా, ఆర్మీ అధికారులు చనిపోవడంతో వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ జెట్లు పెద్ద సంఖ్యలో రష్యాకు చేరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ వార్తాసంస్థ ‘వైనెట్’ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇందులో ఓ విమానం ట్రాకింగ్ మధ్యలో కనుమరుగైందని, అందులో ఖమేనీలాంటి ప్రముఖ వ్యక్తి ఉండి ఉంటాడని పేర్కొంది.
రష్యా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న ప్రముఖులు కూడా ప్రైవేట్ జెట్లలో దేశాన్ని వీడుతున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు, ఇజ్రాయెల్ దాడుల పట్ల ఇరాన్‌లోనే పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘‘ప్రతీ 47 ఏళ్లకు ఇరాన్‌కు స్వాతంత్య్రం వస్తుందనుకుంటా. ఇప్పుడు కూడా సుప్రీంలీడర్ పాలన నుంచి విముక్తి దొరుకుతుందని భావిస్తున్నా’’ అంటూ ఓయువతి పేర్కొంది.
ఎస్‌సీవో ప్రకటనకు భారత్ దూరం:
ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులను షాంఘై సహకార సంస్థ(ఎ్‌ససీవో) తీవ్రంగా ఖండించింది. అయితే.. ఎస్‌సీవో ప్రకటనకు భారత్ దూరంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) స్పష్టం చేసింది.
ఈ అంశంపై ఎస్‌ఈఏ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ భారత్ పాల్గొనలేదని వివరించింది.
చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తాము ఇరు దేశాలను కోరుతున్నట్లు తెలిపింది.
కాగా… పాలస్తీనాలో నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని బయట తిరగొద్దని సూచించింది.
ఇక అమెరికాతో చర్చలు అర్థరహితం:
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణుచర్చలు జరపడం అర్థరహితమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికారి అబ్బాస్ అరగ్చి అంతర్జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఆదివారం ఒమన్‌లో అణు చర్చలు జరగాల్సి ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇదే విషయాన్ని ఆయన ఐరోపా సమాఖ్య రాయబారి ఖాజా కల్లా్‌సకు తెలిపానని వెల్లడించారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా ప్రత్యక్ష మద్దతు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
నెతన్యాహు కుమారుడి పెళ్లి వాయిదా:
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుమారుడు అవ్నర్ నెతన్యాహు వివాహం వాయిదా పడింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెతన్యాహు కుటుంబం ప్రకటించింది.
అవ్నర్ పెళ్లి సోమవారం అమిత్ యార్డెనీతో జరగాల్సి ఉంది. వాయిదా పడ్డ పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారని సమాచారం.
ఇజ్రాయెల్‌లో ముగ్గురి మృతి:
శుక్రవారం రాత్రి ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో టెల్‌అవీవ్ శివార్లలోని రామత్‌గన్‌లో కోహెన్ ఏంజెల్(87), రిషోన్‌యెజిలోన్‌లో ఇజ్రాయెల్ అలోనీ(67), ఎట్టీ అనే మహిళలు చనిపోయారని, ఏడుగురు సైనికులు సహా 80 మందికి గాయాలైనట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
క్షతగాత్రుల్లో 34 మంది పారామెడికల్ బృందాలకు చెందినవారని తెలిపింది.
టెల్‌అవీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం బెన్ గురియన్ వద్ద పేలుడు సంభవించినట్లు ఇరాన్ వార్తాసంస్థలు చెబుతుండగా.
యుద్ధం ప్రారంభానికి ముందు నుంచి ముందుజాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను నిషేధించామని ఐడీఎఫ్ పేర్కొంది.
ఇరాన్ దాడుల్లో రామత్‌గన్, రిషోన్‌యెజిలోన్ నగరాల్లో నివాస గృహాలు, వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. అయితే.. పౌరులను ముందుగానే బంకర్లకు తరలించడం వల్ల ప్రాణనష్టం తప్పిందని ఐడీఎఫ్ చెబుతోంది.