నిమ్జ్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభం……

నిమ్జ్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభం……

జహీరాబాద్, నేటి ధాత్రి:

ఝరాసంగం: నిమ్జ్ జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి అనేది తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఒక కీలకమైన ప్రాజెక్ట్ ఇది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ వద్ద ఏర్పాటు సుమారు 12,635 ఎకరాల్లో విస్తరించాలని 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంతో కొంతమేరకు భూసేకరణ ఆలస్యమైంది. ప్రస్తుతం ఝరాసంగం మండలంలో బర్దిపూర్, ఎల్గోయి, చిల్లపల్లి, చిల్లపల్లి తండా గ్రామాల్లో సుమారుగా 3,245 ఎకరాల భూమిలో వివిధ పరిశ్రమల స్థాపన కోసం ఫస్ట్ ఫేజ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి పనులు ప్రారంభం కావడంతో 14 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లు అనిపిస్తుంది.దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమల ఉత్పాదకతను పెంచేందుకు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో నిమ్డ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సుమారు 13 నిమ్స్ ప్రాజెక్టులను ప్రతిపాదించగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు ప్రాజెక్టులు కేటాయించారు.

 

వాటిలో ఒకటి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత, రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ సమస్యల కారణంగా నిమ్ ప్రాజెక్టు పనులు చాలా సంవత్సరాలుగా ముందుకు సాగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత మేర భూసేకరణ చేపట్టింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల స్థాపన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో అధికారులు నిమ్డ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీంతో నిజ్జా ప్రాంతంలో మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు పరిశ్రమల స్థాపనకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

పలు పరిశ్రమలకు భూముల కేటాయింపు….

నిమ్డ్ పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వచ్చిన పలు పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ఈవీఎం టెక్నాలజీ సంస్థకు 511 ఎకరాలు కేటాయించింది. ఈ సంస్థ రూ. వెయ్యి కోట్ల రూపాయలతో పరిశ్రమలు స్థాపించనున్నది. ఈ సంస్థకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే శంకుస్థాపన చేసింది. భారీ ప్రహరీ గోడ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్ రూ. 2,100 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందం కుదిరించుకుంది. హ్యుందాయ్ మోటార్ కంపెనీ (ఈవీ ఆటోమోటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) కంపెనీకి 675 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా ఈ సంస్థ సుమారుగా రూ. 8,528 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇటీవలనే స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 4,276 మంది స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుందని భావిస్తున్నారు. త్వరలో ఈ కంపెనీకి సంబంధించి శంకుస్థాపన జరుగనున్నట్లు ప్రచారం కొనసాగుతోంది.

మౌలిక వసతుల కల్పనలో ముందుకు…..

మొదటి విడతగా సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టనున్నారు. దాదాపు రూ. 2,369 కోట్ల వ్యయంతో నిమ్డ్ ప్రాజెక్టు కోసం మొదటి విడతగా సేకరించిన 3,245 ఎకరాల భూముల్లో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి.

జోరుగా కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం…

నిమ్డ్ పలు పరిశ్రమల నిర్మాణం కోసం ఉండేందుకు కార్మికుల కోసం దాదాపు 100 షెడ్ల నిర్మాణం జోరుగా కొనసాగుతోంది. 24/7 పనులు సాగేందుకు వీలుగా విద్యుత్, నీటి సరఫరా, వైద్యం, భోజనశాలలు, డ్రైనేజీ, భద్రత ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. మొత్తానికి 14 సంవత్సరాల నిరీక్షణకు పరిశ్రమల స్థాపన కోసం ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలతో తెరపడినట్లు కనిపిస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version