ఏ భూమికైనా ఎన్వోసిలిచ్చే జమ్మికుంట ఎమ్మార్వో?

`లక్షలు కొట్టు..ఎన్‌వోసిలు పట్టు!

`విశ్వేశ్వర స్వామికే శఠగోపం!

`జమ్మికుంటలో దేవుని మాన్యానికే దిక్కులేదు.

`జమ్మికుంట ఎమ్మార్వో మాయ జాలం.

`కబ్జాదారులకు అండగా ఎమ్మార్వో నిర్వాకం

`ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన ఎమ్మార్వో!

`ఎమ్మార్వో వ్యవహారంపై సిసిఎల్‌లో పిర్యాదు.

`కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ ‘‘ఎన్‌వోసి’’ల జారీ వైనం.

`‘‘ఎన్‌వోసి’’ల అంశంపై సమాచారం లేదంటున్న ఆర్డీవో.

`వివరాలు పంపమంటూ నేటిధాత్రి తో ఆర్డీవో.

`అన్నీ తెలిసినా తెలియదంటున్న ఆర్డీవోపై జనం ఆగ్రహం.

`దేవాలయ భూములు ఆక్రమణ జరగడం లేదంటున్న ఆయల ఈవో.

`ఎన్‌వోసిల జారీ సమాచారం లేదంటూ దాటవేత.

`గుడి స్థలంలో నిర్మాణాలెలా సాగుతున్నాయంటే నీళ్లు నములుతున్న ఈవో.

`నాలుగు రోజులు కొలువు చేసుకొని వెళ్లే వాడినంటూ ఈవో నిట్టూర్పు.

`జమ్మికుంటలో హట్‌ కేకులాంటి భూములను కట్‌ చేసి పంచుకుంటున్నారు.

`రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారు.

`స్మశాన స్థలాలను కూడా వదలడం లేదు.

`ఎమ్మార్వో ఎన్వోసిలిచ్చాక మేమేం చేయాలంటున్న రిజిస్ట్రేషన్‌ అధికారులు.

`అందరూ కలిసి విశ్వేశ్వర స్వామికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అక్రమాలు చేయాలనుకుంటే ఆధికారులకు అడ్డేముందనడానికి జమ్మికుంట దేవుని మాన్యం భూముల వ్యవహారమే నిదర్శనం. దేవాలయానికి చెందిన భూములలో పాగా వేసిన కొంతమందికి జమ్మికుంట ఎమ్మార్వో ఆశీస్సులు అందిస్తున్నారు. ఆ భూముల లోని స్థలాలపై కన్నేసిన వారికి ఎమ్మార్వో రమేశ్‌ దర్జాగా ఎన్వోసిలు రాసిచ్చేస్తున్నారు. ఇప్పటికే వందల మందికి అలా ఎన్వోసీలు జారీ చేశారు. లక్షలు కొట్టు..ఎన్‌వోసిలు పట్టు! అన్నట్లు దేవాలయ భూమిలో పాగా వేయాలనుకుంటున్న వారికి టోకు లెక్కన ఎమ్మార్వో ఎన్వోసిలు జారీ చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి విచిత్రమని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతా గప్‌ చుప్‌గా ఎమ్మార్వో వ్యవహారం సాగిస్తున్నారు. జమ్మికుంట పట్టణంలో ఆ భూముల విలువ అమాంతం పెరిగిపోతుంది. లక్షలు ఎమ్మార్వో చేతిలో పెడితే చాలు కోట్ల రూపాయల విలువైన భూమి దక్కుతుందనే ఆశతో ఎన్వోసిలు తెచ్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. నిర్మాణాలు యధేచ్చగా కొనసాగిస్తున్నారు. రాత్రికి రాత్రే నిర్మాణాలు జరిగిపోతూనే వున్నాయి. అయినా పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు. సదరు భూములకు సంబంధించిన పిర్యాదులు కోర్టు పరిధిలో వున్నాయి. డబ్లుసి.నెం. 11178/12 కేసు కోర్టులో పెండిరగ్‌లో వుంది. అయినా ఎమ్మార్వో యదేచ్చగా కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నాడు. ఇదే కాకుండా దేవాదాయ శాఖ జిల్లా కోర్టు సెక్షన్‌.22 %A% ప్రకారం ఆ భూముల క్రయ విక్రయాలకు ఆస్కారం లేదంటూ తీర్పు కూడా ఇచ్చింది. దోచుకోవడానికి దొడ్డి దారులెంచుకునే వారు వుంటారు. ఆ భూములను ఆనుకొని అవే సర్వే నెంబర్లలలో మరో 30 ఎకరాల ప్రభుత్వ స్థలం వుంది. దానిని రియల్‌ వ్యాపారులు ఎప్పుడో మింగేశారు. ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు. మూడు నాలుగు అంతస్తుల ఇండ్లు కూడా కట్టుకున్న వాళ్లున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలున్నాయి. వాటిని అమలు చేయని రెవెన్యూ అధికారులు మిగిలిన భూమిని కూడా కాజేస్తున్న వారికి సహకరిస్తున్నారు. ఆక్రమణ దారులతో కలిసి రెవెన్యూ అధికారులు పహానీలే మార్చినట్లు ఆధారాలు కూడా వున్నాయి. ఈ విషయంపై కొంతమంది పోరాటం చేస్తున్నా ప్రస్తుత ఎమ్మార్వో పట్టించుకోవడం లేదు. పైగా కబ్జాదారులకు సహరిస్తున్నారు. దాంతో ఎమ్మార్వో నిర్వాకంపై జమ్మికుంటకు చెందిన కొందరు సిసిఎల్‌ హైదరాబాదు లో పిర్యాదు చేశారు. జారీ చేసిన ఎన్వోసిలను సమర్పించారు. అంతే కాకుండా గతంలో వున్న పహాణీలను, ఇప్పుడు మార్చిన పహాణీలను సిసిఎల్‌కు సమర్పించారు. అంటే అధికారులు తలుచుకుంటే గ్రామ, పట్టణ నక్షలను కూడా ఎలా తారుమారు చేయగలరో తెలుసుకోవచ్చు. మొత్తానికి గుడి మాన్యాన్ని మింగే వారు విశ్వేశ్వర స్వామికే శఠగోపం! పెట్టేస్తున్నారు. జమ్మికుంటలో దేవుని మాన్యానికే దిక్కులేకుండా చేస్తున్నారు. ఈ భూముల గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ముందు చెప్పుకోవాలి. జమ్మికుంటలో వున్న సర్వేశ్వర స్వామి ఆలయానికి కొండూరి వంశస్థులు 1939లో సర్వే నెం. 661, 662, 663 లలో 3 ఎకరాల 3 గుంటలు మాణ్యం కింద ఇచ్చారు. అదే జమ్మికుంటలో దేవుని కోసం 420, 421, 422 సర్వే నెంబర్లలో 5 ఎకరాల 37 గుంటలిచ్చారు. అప్పటి నుంచి ఆ భూమి దేవుని మాన్యంగా వుంది. ఎప్పుడైతే భూముల ధరలు పెరగడం, జమ్మికుంట పట్టణం విస్తరించడం మొదలైందో అప్పటి నుంచి ఆ భూముల మీద కొంత మంది కన్ను పడిరది. అయితే పై సర్వే నెంబర్లలోనే మరో 30 ఎకరాల 12 గుంటల భూమి వుంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకుల కన్ను ఆ భూముల మీద పడిరది. అప్పటి నుంచి ఆక్రమణ పర్వం కొనసాగుతూనే వుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఎమ్మార్వో మాజా జాలంపై సర్వత్రా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అండగా ఎమ్మార్వో సాగిస్తున్న నిర్వాకంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన కుర్చీలో కూర్చున్న ఎమ్మార్వో ఇలా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్న వారికి సహకరించడంపై పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరుగుతున్నాయి. అయినా ఎమ్మార్వో వ్యవహారంలో మార్పు రావడం లేదు. దాంతో జమ్మికుంటకు చెందిన కొంత మంది ఎమ్మార్వో నిర్వాకంపై సిసిఎల్‌లో పిర్యాదు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాలను యధేచ్చగా దిక్కరిస్తూ ఎన్‌వోసిలు ఎలా జారీ చేస్తున్నారో ఆధారాలు సమర్పించడం జరిగింది. ఎన్‌వోసిల అంశం పై స్థాయి అధికారులకు సమాచారం వున్నప్పటికీ వాళ్లు కూడా మౌనం వహిస్తున్నారు. ఏకంగా తమకు సమాచారం లేదంటున్నారు. జరుగుతున్న తంతు గురించి నేటిధాత్రి ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే వివరాలు పంపమంటూ నేటిధాత్రిని ఆర్డీవో కోరడం విచిత్రంగా వుంది. కానీ అన్నీ తెలిసినా తెలియదంటున్న ఆర్డీవోపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వివరాలు ఆర్డీవోకు తెలుసంటూ ప్రజలు చెబుతున్నారు. ఎవరి వాటా వాళ్లు పంచుకుంటూ తమకేమీ తెలియదన్నట్లు నటిస్తున్నట్లు అర్థమౌతోంది. ఇక ఇదిలా వుంటే సర్వేశ్వర స్వామి ఆలయ ఈవో మాటలు మరో విధంగా వున్నారు. పైగా ఆయన నోటి నుంచి నిట్టూర్పు మాటలు వినబడుతున్నాయి. అసలు దేవాలయ భూమి ఎలాంటి ఆక్రమణలకు గురి కాలేదంటున్నారు. మరో వైపు అక్కడ వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై సమాచారం లేదంటున్నారు. అసలు ఎన్‌వోసిల జారీ సమాచారం లేదంటూ సమాధానం దాటవేస్తున్నారు. గుడి స్థలంలో నిర్మాణాలెలా సాగుతున్నాయంటే సమాధానం చెప్పలేక దేవాలయ ఈవో నీళ్లు నములుతున్నాడు. పైగా ఈ గొడవ నాకెందుకన్నట్లు నాలుగు రోజులు కొలువు చేసుకొని వెళ్లే వాడినంటూ ఈవో వేదాంతం చెబుతున్నాడు. తన బాధ్యతను విస్మరించి తన చేతగాని తనం వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఆయనకు తెలియకుండా ఏదీ జరగడం లేదని ప్రజలు అంటున్నారు. వాటాలు పంచుకోవడంలో అతని హస్తం కూడా వుంటుందంటున్నారు. మొత్తం మీద జమ్మికుంటలో హట్‌ కేకులాంటి భూములను కట్‌ చేసి పంచుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారు. ఇక్కడ మరో దుర్మార్గమైన విషయమేమిటంటే జమ్మికుంటలో వున్న శ్మశాన స్థలాలను కూడా కబ్జాదారులు వదలడం లేదు. వారికి సహరించకుండా రెవెన్యూ అధికారులు వుండడం లేదు. పూర్తిగా రెవెన్యూ అధికారుల అండదండలతోనే శ్మశాన స్థలాలు కూడా ఆక్రమణలకు గురౌతున్నాయి. మరోవైపు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల సమాధానం మరో విచిత్రం. ప్రభుత్వ స్థలాలను ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని ప్రశ్నిస్తే , ఎమ్మార్వో ఎన్వోసిలిచ్చాక మేమేం చేయాలంటున్నారు. అందరూ కలిసి విశ్వేశ్వర స్వామికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. దేవాలయ భూముల అప్పనంగా కొట్టేస్తున్నారు. లంచాలకు అలవాటు పడి అయినవి కానివి చేయడానికి రెవెన్యూ అధికారులు వెనుకాడడం లేదు. రెవెన్యూ అధికారులే సహకరిస్తున్నప్పుడు కబ్జాలకు ఎదురేముందని అక్రమదారులు పాగా వేస్తున్నారు. ఇక దేవాదాయ శాఖ ఇప్పటికైనా కళ్లు తెరుస్తుందో చూడాలి. ఇంతగా అవినీతికి తెగబడ్డ తహసీల్దారుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఎమ్మార్వో అక్రమ వ్యవహారాలు ఇంకా వున్నాయి. మరో కథనంలో మరిన్ని తెలుసుకుందాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!