Medical Shops Bandh Peaceful in Shankarpally
శంకర్పల్లిలో శాంతియుతంగా కొనసాగిన మెడికల్ షాపుల బంద్
మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేత
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపుతో నిరసన
శంకర్పల్లి, నేటిధాత్రి :
దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం శంకర్పల్లిలో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఈ బంద్ కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. శంకర్పల్లి మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు యంసాని ప్రకాశ్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక మెడికల్ షాపుల యజమానులు, ఫార్మసీ వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల నియంత్రణ, ఫార్మసీ రంగ పరిరక్షణ వంటి డిమాండ్లతో ఈ బంద్ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బంద్ సందర్భంగా శంకర్పల్లి ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లోని మెడికల్ షాపులు పూర్తిగా మూసివేయబడ్డాయి. అయితే అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కొంతమంది అవసరమైన మందులను అందుబాటులో ఉంచినట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యంసాని ప్రకాశ్ గుప్తా మాట్లాడుతూ, ఫార్మసీ రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపారుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
