మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి
మందమర్రి, నేటిధాత్రి:
– గుడికందుల రమేష్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుడికందుల రమేష్ డిమాండ్ చేశారు. మందమర్రిలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది మంది భక్తులు, గిరిజనులు పాల్గొనే ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన, సమానత్వ భావన, త్యాగ గాథలతో ముడిపడి ఉన్న మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా గిరిజన సంస్కృతికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వైవిధ్యానికి ప్రతిబింబమైన ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే, గిరిజనుల చరిత్రను దేశమంతా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అలాగే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని గుడికందుల రమేష్ విజ్ఞప్తి చేశారు.
