ప్రమాదాలకు కారణామవుతున్న డివైడర్లు…

ప్రమాదాలకు కారణామవుతున్న డివైడర్లు

ప్రదేశాల మార్పుతో ప్రమాదాలు తగ్గే అవకాశాలు

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని రహదారులపై ఏర్పాటు చేసిన డివైడర్లు వాహనదారుల భద్రతకు విరుద్ధంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రణాళికాబద్ధత లోపంతో అమరిక జరగడంతో ట్రాఫిక్ నిర్వహణలో అంతరాయాలు తలెత్తుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఇరుకైన రహదారుల మధ్యలో ఈ నిర్మాణాలు ఉండటంతో వాహనాల సంచారం కష్టమవుతోంది.రద్దీ సమయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడి గతంలో ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సమాచారం.రహదారి విస్తీర్ణం తక్కువగా ఉన్న చోట్ల అమరిక జరగడం వల్ల లారీలు,డిసిఎం,రెండు చక్రాల వాహనాలు,ఆటోలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.సాఫీగా ప్రయాణించేందుకు వీలులేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందని స్థానికులు తెలిపారు.రాత్రి వేళల్లో స్పష్టత లేకపోవడం మరో సమస్యగా మారింది. ప్రతిబింబించే గుర్తులు లేకపోవడంతో డ్రైవర్లు ముందుగా అంచనా వేయలేక ఢీకొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ప్రధాన కూడళ్ల వద్ద సరైన అమరిక లేకపోవడం వల్ల మలుపులు తిరగడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.దీంతో కొన్ని సందర్భాల్లో వాహనాలు యూ టర్న్ తీసుకునేందుకు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రహదారి వెడల్పు,వాహన రద్దీ,మార్గాల అవసరాలను పరిశీలించి మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ తగిన సవరణలు చేయాలని కోరుతున్నారు.అదనంగా హెచ్చరిక బోర్డులు,ప్రతిబింబించే సూచనలు ఏర్పాటు చేస్తే రాత్రి సమయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.సంబంధిత శాఖలు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని అమరికపై సమీక్ష చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

యూటర్న్ వద్ద గుంతలను సరిచేయాలి

హెచ్చరిక సూచనలు ఏర్పాటు చేయాలి

పట్టణ పరిధిలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు ప్రమాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి.హుజురాబాద్ రోడ్డులోని పోచమ్మ దేవాలయం సమీపం,వెల్లంపల్లి రోడ్డులో ఉన్న కుంకుమేశ్వర దేవాలయం పరిసరాల్లో గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.ముఖ్యంగా సాయంత్రం,రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.హెచ్చరిక బోర్డులు,ప్రతిబింబించే గుర్తులు లేకపోవడం అదేవిధంగా యూ టర్న్ ఉన్న ప్రాంతాల్లో రహదారి దెబ్బతిన్న పరిస్థితి,గుంతలు ఉండటం కూడా ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది.ఎక్కడ చూసిన డివైదర్లు నాణ్యత లోపంతో డివైడర్లు కూలిపోయిన పరిస్థితి కనపడుతుంది,ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న ప్రదేశాల్లో తక్షణమే హెచ్చరిక బోర్డులు,రాత్రి వేళల్లో కనిపించే సూచికలు ఏర్పాటు చేయాలి ఆర్ అండ్ బి మున్సిపల్ శాఖలు స్పందించి రహదారి భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలి.

బొచ్చు కళ్యాణ్ ఎస్ఎఫ్ఐ నాయకులు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version