Revanth Reddy Rally in Bhupalpally
సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో సోమవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని రైతులు, మహిళలు, యువత, కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు వివరించనున్నారని తెలిపారు. నస్తూరుపల్లిలో జరిగే సభకు సుమారు లక్షమంది హాజరవుతారని అంచనా వేశామని పేర్కొన్నారు. సభలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ కావ్య తదితరులు పాల్గొంటారని చెప్పారు. రైతు భరోసా నిధులను సభ వేదికగా విడుదల చేసి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి చేరుతుండటాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండిపడ్డారు. తుమ్మిడి హెట్టి వద్ద డ్యామ్ నిర్మించాలని నిపుణులు సూచించినప్పటికీ, కేసీఆర్ నిర్ణయంతో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించారని ఆరోపించారు.
రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన పనులను డిజైన్ మార్చి దాదాపు లక్ష కోట్లకు పెంచి మేడిగడ్డ వద్ద కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టుల డిజైన్ మార్చి రైతులకు అన్యాయం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారు అని వారు ఆరోపించారు
ప్రజా ప్రభుత్వం రైతాంగానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చివరిగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు దేవన్ ,పిసిసి సభ్యులు మధు, కౌన్సిలర్లు సహదేవ్ , రాధ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్ కురిమిళ్ళ శ్రీనివాస్ ఆకుల మహేందర్, తోట రంజిత్ పుల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
