సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి..
దహన సంస్కారాల కోసం ఇబ్బంది పడుతున్న కార్మికులు
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో రామప్ప,1000 క్వార్టర్స్, మాధవరావు పల్లి, బీసీ కాలనీలో స్మశాన వాటికలు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార దర్శి మాట్లాడుతూ.. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న అంశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ ,సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు గతంలోనే వివరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అట్లాగే సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి కి స్మశాన వాటికల విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది కార్మికుల నివాసం ఉంటున్నారని ఈ ప్రాంతానికి దహన సంస్కారాల కోసం స్మశాన వాటిక లేకపోవడం బాధాకర మన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 500 మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం స్మశాన వాటికలు ఉన్నాయని, 20వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు కార్మికులు కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్, జిఎం లు స్పందించి స్మశాన వాటికలు ఏర్పాటుచేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
