Bio Covers Distributed in Narsampet
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో కవర్లు
టిఫిన్ సెంటర్లో పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రామానంద్, కమిషనర్
నర్సంపేట, నేటిధాత్రి:
ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యానికి హాని చేయని బయో కవర్లను వినియోగించాలని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రామానంద్ సూచించారు.ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఉన్న టిఫిన్ సెంటర్లో బయోడిగ్రేడబుల్ కవర్లను ఆమె, కమిషనర్ కాటం భాస్కర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో కొంత మార్పు వచ్చిందన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు బయో కవర్లు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్లాస్టిక్ రహిత నర్సంపేటగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లలో వేడి ఆహారం తింటే అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బయో కవర్లు వాడుతూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు.ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్, కౌన్సిలర్ మనీషా, హోటల్ యజమాని శ్రీనివాస్, కస్టమర్లు పాల్గొన్నారు.
