Textile Course Awareness Drive in Siricilla
సిరిసిల్లలో టెక్స్టైల్ కోర్సుపై అవగాహన కార్యక్రమం
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సుందరయ్య నగర్లో ఉదయం 11 గంటలకు IIHT టెక్స్టైల్ కోర్సుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BC హక్కుల సంఘం ఉద్యమ నాయకుడు రాపెల్లి రమేష్, పద్మశాలి జాతీయ సేవా దళం కన్వీనర్ రచ్చ కనకయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేనేత కళ అంతరించిపోకుండా దాని వారసత్వాన్ని కాపాడేందుకు విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. 10వ తరగతి అనంతరం టెక్స్టైల్ కోర్సును పూర్తి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం అభినందనీయమని తెలిపారు.
గతంలో ఈ కోర్సు చదవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని, దీనివల్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు భారీ ఆర్థిక భారం పడేదని గుర్తుచేశారు. ప్రస్తుతం స్థానికంగా ఈ అవకాశాలు అందుబాటులోకి రావడం వల్ల ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
టెక్స్టైల్ రంగంలో నూతన డిజైన్లు, మార్కెట్ స్కిల్స్, ఆధునిక పద్ధతులపై యువత శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా 23 సంవత్సరాల లోపు, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో పాస్ మరియు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ కోర్సు మంచి అవకాశమని తెలిపారు.
వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వస్త్ర పరిశ్రమ అని పేర్కొంటూ, చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. చేనేత సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు ముందుకు వచ్చి విద్యార్థులకు స్కాలర్షిప్ల రూపంలో ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని చేనేత జౌళి శాఖ కోఆర్డినేటర్ వేముల మార్కండేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. చేనేత కార్మికుల పిల్లలకు టెక్స్టైల్ కోర్సుపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం కొనసాగుతోందని తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీలో ఫెయిల్ అయి ఖాళీగా ఉన్న యువతకు ఇది సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు.
