గర్భిణులకు రక్తహీనత పరీక్షలు
ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా వైద్య శిబిరం
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా బుధవారం నర్సంపేట ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గైనిక్ విభాగాధిపతి డాక్టర్ నిర్మల, ఐసీడీఎస్ ఏసీడీపీవో జ్యోతి మాట్లాడారు. కిశోర బాలికల నుంచే ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుంటే హెచ్‌బీ శాతం తెలుస్తుందని, రక్తహీనత రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణిగా నిర్ధారణ అయిన వెంటనే హెచ్‌బీ తక్కువగా ఉన్నవారు విటమిన్ ఎ, ఐరన్ ఎక్కువగా ఉండే మునగాకు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే రక్తహీనతను నివారించవచ్చని తెలిపారు. కృత్రిమంగా రక్తం ఎక్కించుకునే బదులు ఆహారంతోనే రక్తహీనతను అధిగమించాలని సూచించారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందని, అందుకే సమతుల ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలు, గుడ్డు, ఒకపూట భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ నిర్మల, ఏసీడీపీవో జ్యోతి, పర్యవేక్షకురాలు అరుణ, డాక్టర్ సింధూర, డాక్టర్ కళ్యాణి ఆర్‌ఎంవో, డాక్టర్ నవీన్ ఆర్‌ఎంవో, డాక్టర్ భార్గవ్, డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ అలేఖ్య, ఆరోగ్య పర్యవేక్షకురాలు సరోజన, నర్సింగ్ అధికారులు, ఏఎన్‌ఎంలు, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఐకేపీ సీఎల్‌ఆర్‌పీలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
