కబ్జాలు కానిచ్చి..కోట్లు మింగి!
‘‘మంత్రి’’ కళ్ళు కప్పి ట్రాన్స్ఫర్లు పూర్తి చేశారు! ఇప్పుడు ‘‘అక్రమ రిజిస్ట్రేషన్లు’’ కాని చేస్తున్నారు!
`తొండుపల్లిలో 500 కోట్ల భూమి!రాయదుర్గంలో 600 కోట్ల జాగ!
`అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు!
`కబ్జాలకు కట్టడి లేదు..అక్రమ రిజిస్ట్రేషన్లు ఆగింది లేదు!
`తొండపల్లిలో ఆరు ఎకరాలు ఎలా కజ్జా జరిగింది?
`‘‘500 కోట్ల’’ భూమి ఎలా మాయమైంది?
`రాయదుర్గం పరిధిలో ‘‘600 కోట్ల’’ భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు?
`డిఆర్‌కు తెలియకుండానే ఇదంతా జరిగిందా?
`‘‘డిఆర్’’ను తప్పించి ఇతర సిబ్బందిని అరెస్టు చేశారా!
`తిమింగలాలు తప్పించుకుంటున్నాయా!
`లెక్కల కోసం చిన్న వాళ్లను ఇరికిస్తున్నారా!
`అడ్డగోలు సంపాదనలో రిజిస్ట్రార్లు! కనిపించిందల్లా కబ్జా చేస్తున్న రియల్టరు!!
`ఆక్రమణ దారులకు అండగా రిజిస్ట్రార్లు!
`ప్రభుత్వ ఆదేశాలకు లెక్కే చేయడం లేదు!
`భయమన్నది ఎవరిలోనూ కనిపించడం లేదు!
`కొలువు పోయినా ఫరవాలేదని తెగిస్తున్న అధికారులు.
`మళ్ళీ ఎలాగైనా కొలువు తెచ్చుకోవచ్చన్న ధీమాలో వున్నారు!
`బహిరంగంగానే భరితెగిస్తున్నారు?
`కాపాడే కుర్చీలో కూర్చున్న వారు రాసిచ్చేస్తున్నారు?
`అక్రమార్కులతో కలిసి పంచుకుతింటున్నారు?
`ప్రభుత్వ భూములు కాపాడడం మాటలకే పరిమితం!
`హైడ్రా వచ్చినా ఆగని ఆక్రమణలు!
`చీకు చింతా లేకుండా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు!
`అడ్డూ అదుపు లేకుండా సంపాదనలకు ఎగబడుతున్న అధికారులు.
`అక్రమార్కులకు రిజిస్ట్రార్ల అభయాలు.
`చాక్లెట్ తిన్నంత సులువుగా కబ్జాలు చేస్తున్నారు.
`చెరువులు కూడా ఆక్రమిస్తూనే వున్నారు.
`వెంచర్లు వెలుస్తూనే వున్నాయి?
`ఆక్రమణలు ఎక్కడా ఆగడం లేదు!
`అక్రమ రిజిస్ట్రేషన్లు ఆగిన ధాఖలాలు లేవు.
`ఆన్ డ్యూటీ పేరుతో అక్రమాలు కానిచ్చేస్తున్నారు!
`గ్రూపు ట్రాన్స్‌ఫర్లతో దుకాణాలు తెరిచేస్తున్నారు.
`దోపిడీకి అలవాటు పడిపోయి రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు!
`ట్రాన్స్‌ఫర్లు నచ్చని వాళ్లంతా పాత స్థలాలకు చేరుకుంటున్నారు?
హైదరాబాద్,నేటిధాత్రి:
కంచె చేను మేస్తుంటే ఎంత కాలం ఉపేక్షిస్తుంటారు? పాలకులు మారినా వ్యవస్ధల్లో మార్పు రాదా? ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు జరుగుతాయని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్టు అడుగులు పడుతున్నా ఎక్కడో లోపం జరగుతోంది. ఆక్రమణ దారుల విషయంలో కఠినంగా వుంటామని ప్రభుత్వం ప్రతీసారి హెచ్చరిస్తూనే వున్నా, జరగాల్సిన దారుణాలు జరుగుతూనే వున్నాయి. ఓ వైపు అవినీతి అధికారులను ఏరివేసే చర్యలు జరుగుతున్నా, లంచాలు తీసుకుంటూ పట్టుబడుతూనే వున్నా మిగతా వారికి భయం ఎందుకు కలగడం లేదు. ఎక్కడికక్కడ అవినీతి అధికారులు భరితెగిస్తూనే వున్నారు. విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూనే వున్నారు. దొరికిన వాళ్లు మాత్రమే దొంగలుగా కనిపిస్తున్నారు. దొరకని వాళ్లు ఇంకా ఎంతో మంది నిత్యం తప్పించుకుంటూనే వున్నారు. అవినీతి మాత్రం ఎక్కడా ఆగడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. ధరణి విషయంలో గతంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న వార్తలు వినీ వినీ ప్రజలకు విసుగు వచ్చింది. బాధితులకు తీవ్రంగా అన్యాయం జరగింది. అందుకే ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. కాని అవినీతి మాత్రం ఆగడం లేదు. అధికారుల వసూళ్లు ఆగడం లేదు. అక్రమార్కుల భూ కబ్జాలకు కళ్లెమే లేదు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వందల మంది అవినీతి అధికారులు ఏసిబికి చిక్కారు. రెడ్ హండెడ్‌గా లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అయినా అవినీతి అన్నది ఎక్కడా ఆగడం లేదు. అవినీతి చేసి జైలుకు వెళ్లిన వారు బెయిల్‌పై వచ్చిన వారున్నారు. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారున్నారు. కొలువుల్లో చేరిన వారు కూడా వున్నారు. ఇలా అయితే అవినీతి అధికారులకు భయం ఎందుకు వుంటుంది. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భాదెందుకు వుంటుంది? అవినీతి అదికారుల మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. పాలకులంతా ఆ తాను ముక్కలే అన్న అపవాదు ఎదుర్కొవాల్సి వస్తోంది. అవినీతి చేసి పట్టుబడితే సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తుంది..దోషిగా నిలబడాల్సి వస్తుంది..నేరస్థులమైన జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందన్న భయం అధికారుల్లో ఎందుకు లేకపోతోంది. అవినీతి చేస్తూ పట్టుబడిన వెంటనే ఉద్యోగం పోతుందన్న భయం లేకపోవడం మూలంగానే ఇదంతా జరుగుతోంది. ఏసిబి అధికారుల పట్టుకున్న తర్వాత కూడా వారితో కూడా లావాదేవీలు నడిపించుకునే వెసులుబాటు కూడా దొరుకుందన్న వార్తలు చూస్తుంటే అవినీతిని అంతం చేయడం ఏ పాలకుల వల్ల కాదా? అన్న అనుమానం కల్గుతోంది. ఉద్యోగం పోతే తమ కుటుంబం వీధినపడుతుంది. తాను జీవితాంతం జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందన్న భయం అధికారుల్లో వుండాలి. కాని అది లేకపోవడం వల్లనే అన్ని వ్యవస్ధలు అవినీతి కంపులో కూరుకుపోతున్నాయి. కుళ్లిపోయిన సమాజాన్ని వెక్కిరిస్తున్నాయి. అవినీతి చేసి జైలుకెళ్లి వచ్చిన వారు మళ్లీ అదే కొలువుల్లో ఎలా చేరుతున్నారు. పైగా ప్రమోషన్లు కూడా వాళ్లే పొందుతున్నారు. ఏ కార్యాయంలో అవినీతితో పట్టుబడుతున్నారో అదే కార్యాలయంలో మళ్లీ కొలువులో ప్రత్యక్ష్యమౌతున్నారు. అలాంటి తిమింగలాలు రిజిస్రేషన్ శాఖలో పేట్రేగిపోతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే వాళ్లలో కోట్లకు పడగలెత్తిన వాళ్లే తప్ప జీతాల మీద కుటుంబాలు గుడుపుతున్న వారు ఒక్కరు కూడా లేరంటే అవినీతి ఎంత జడలు విప్పిందో అర్ధం చేసుకోవచ్చు. అవినీతి పరులైన అధికారులే ప్రభుత్వానికి సవాలు విసురుతున్నంత పని చేస్తున్నారు. ఓ వైపు హైడ్రా రంగంలోకి దిగినా సరే అక్రమ రిజిస్ట్రేషన్లు ఆగడంలేదు. కబ్జాల పర్వం ఆగింది లేదు. రిజిస్ట్రార్ల సహాకారంతో విచ్చలవిడి ఆక్రణలు సాగుతూనే వున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందలకోట్ల విలువైన భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరుతూనే వున్నాయి. ఎక్కడిక్కడ భూముల ఆక్రమణలు జరగుతుంటే, ఆ వెంటనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతూనే వున్నాయి. మరునాడే వెంచర్లు వెలుస్తూనే వున్నాయి. గతంలో గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయే అక్రమ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు భహిరంగంగానే సాగుతున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్ల వివరాలు బైటకు పొక్కుతున్నా పట్టించుకుంటున్నవారు లేరు. ప్రభుత్వ పెద్దలకు తీరిక లేదు. సంబంధిత శాఖ పెద్దలకు చిత్తశుద్ది లేదు. అక్రమ రిజిస్ట్రేషన్లను ఆపాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే కింది స్ధాయిలో ఏం జరుగుతుందో పై స్ధాయికి తెలియకుండా జరగదు. అందుకు రిజిస్ట్రార్లు చెలరేగిపోతున్నారని అంటున్నారు. అందుకు తాజాగా బైటకు పొక్కిన రెండు రిజిస్ట్రేషన్లే సాక్ష్యాలు. రిజిస్ట్రార్లు కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారు. కోట్ల రూపాయాల వాటాలకు అలవాటు పడ్డారు. భూములను కాపాడాల్సిన రిజిస్ట్రార్లే అక్రమార్కులకు వంత పాడుతున్నారు. సహకరిస్తున్నారు. కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం గ్రామపరిధిలో వున్న 12.09 ఎకరాలను కొందరు రియల్టర్లు అక్రమంగా ఆక్రమించుకున్నారు. రిజిస్ట్రేషన్ల తంతు పూర్తి చేసుకున్నారు. ఆ భూమి విలువ కనీసం రూ.600 కోట్లు వుంటుంది. గ్రీక్ బిల్డర్స్ అనే రియల్ సంస్ధ నకిలీ పత్రాలు సృష్టించుకునేందుకు దారులు చెప్పి, మరీ రిజిస్ట్రేషన్ చేశారు. నిషేదిత ఆస్ధుల జాబితాలో వున్న ఇంత పెద్ద వ్యవహరం జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియకుండానే జరిగిపోతుందా? పెద్దమొత్తంలో విలువ చేసే భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాలు పై స్దాయికి తెలియకుండా ఎట్టిపరిస్ధితుల్లో చేయలేరు. కాని ఇక్కడ జరిగిపోయేలా చేశారు. ఈనెల 11న ఫైజుల్లా వారసులను సృష్టించారు. గ్రీక్ బిల్లర్స్ ఎల్‌ఎల్‌పి మధ్య డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ తోపాటు జనరల్ పవర్ అటార్నీ కానిచ్చారు. ఇలా రిజిస్ట్రేషన్ అధికారులే నిశేధిత స్ధలాలకు నకిలీ వారసులను సృష్టించి, రియల్లర్లుకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీని వెనకు రిజిస్ట్రేషన్‌శాఖ పెద్దలున్నారన్న సంగతి తెలిసిందే. డిఆర్ పరోక్ష సహకారంతో అంతా జరిగిందనేది బహిరంగ రహస్యమే. అయినా ఆయనను వదిలేశారు. ఇతర ఉద్యోగులను అరెస్టు చేసి మమ అనిపించారు. ఈ స్ధలం రాయదుర్గంలో 1,45,20 సర్వేల్లో వుంది. ఈ భూమి తెలంగాణ లెదర్ ఇండ్రస్ట్రీస్ ప్రమోషన్ కార్పోరేషన్ (లిడ్‌క్యాప్) ఆధీనంలోనే వున్నాయి. అయినా లేని వారసులను సృష్టించి రిజిస్ట్రేషన్‌చేయించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన డిఆర్‌లే ఇంతటి విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి కోట్లు దండుకుంటున్నారు. ఇదిలా వుంటే శంషాబాద్ ఎయిర్‌ఫోర్టుకు అతి సమీపంలో వున్న భూమిని ఇదే విధంగా రిజిస్ట్రేషన్ అధికారులు అక్రమంగా కట్టబెట్టారు. ఆ భూమి విలువ సుమారు రూ.500కోట్లపై మాటే. ఇక్కడ మరీ విచిత్రమేమిటంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. వెంచర్లు కూడా వెలుస్తున్నాయి. అయినా అధికారులు కళ్లు తెరవడం లేదు. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ పరిధిలో వున్న సర్వే నెంబర్ 109లో 2.23 ఎకరాలు కొందరు రియల్ వ్యాపారులు ఆక్రమించుకున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో వున్న సర్వే నెంబర్ 108లో సుమారు 40.07 ఎకరాలను ప్రభుత్వ భూములుగా గుర్తించారు. ఆ జాబితాలో చేర్చారు. అందులో నుంచి రెండున్నర ఎకరాల ఆక్రమించి వెంచర్ చేశారు. ఫామ్ హౌజ్‌లు నిర్మాణం చేస్తున్నారు. ప్రహారి కూడ కట్టేశారు. ఇక జిల్లాల పరిధిలో ఎలా రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయో అర్దం చేసుకోవచ్చు. రిజిస్ట్రార్లు అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డారు. ఉన్నతాధికారులు ప్రసన్నం చేసుకోవడం వారికి వాటాలను నెలనెలా పంపిస్తూ, అక్రమ రిజిస్ట్రేషన్లుకు తెరతీస్తున్నారు. ఆక్రమణ దారులకు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను రిజిస్ట్రార్లు లెక్కే చేయడంలేదు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భయపడే పరిస్దితే లేకుండాపోయింది. అడ్డంగా దొరికినా కొలువులు పోవన్న నమ్మకమే వారిని ఇలా అడ్డదారి పట్టేలా చేస్తోంది. ఎందుకంటే పట్టుబడిన మూడు నెలలకే మళ్లీ అదే కొలువులు చేస్తున్నవారు అనేక మంది ఉద్యోగులున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ ఆదేశాలు ఎందుకు అమలు చేస్తారు? అవినీతి చేయకుండా ఎందుకు వుంటారు? కోట్లు కూడబెట్టుకోవడం ఎందుకు ఆపేస్తారు? రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి రూపుమాపడం ఏ పాలకుల వల్ల సాధ్యం కాదా? అన్న ప్రశ్న ఎప్పుడూ వింటూనే వుంటాం..అంతే…