Protect Biodiversity for Future Generations
జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
నర్సంపేట, నేటిధాత్రి:
జీవ వైవిధ్యంతోనే మానవ జాతి మనుగడ సాధ్యమని, దాని పరిరక్షణకు సమాజంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా గురువారం నర్సంపేట స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ అటవీ క్షేత్రాధికారి కార్యాలయ ఆవరణలో జీవ వైవిధ్య పరిరక్షణ వాల్ పోస్టర్లను ఎఫ్ఆర్వో రవికిరణ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ, వాతావరణ కాలుష్యం వల్ల అనేక జీవరాశులు మనుగడ కోల్పోతున్నాయని, పర్యావరణం కలుషితమై భూగోళం వేడెక్కడంతో జీవ వైవిధ్యం దెబ్బతిని ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారని వివరించారు.సమాఖ్య అధ్యక్షుడు గిరగాని సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో మేలుచేసే కీటకాలు నశించి భూసారం తగ్గుతోందని, పక్షులు, కీటక జాతులను పరిరక్షించుకోవాలన్నారు.ఏఎస్ఆర్ సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో జీవజాతులు అంతరించిపోతున్నాయని, ప్లాస్టిక్‌ను విడనాడాలని సూచించారు. స్వయంకృషి సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ, భూమిపై 33 శాతం అడవులు ఉంటేనే జీవ వైవిధ్యం నిలుస్తుందని, మానవ, జంతు, కీటక, పక్షి జాతులు పరిరక్షించబడతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అటవీ శాతం పెంచాలని కోరారు.కార్యక్రమంలో ప్రతిభ సంస్థ ప్రతినిధి బోయిని వెంకటస్వామి, వాలంటీర్ కాసుల వెంకటాచారి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు సోమ్లానాయక్, ధర్మ, సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు.
