Sunitha Demands Probe on Jagan
జగన్ దంపతులను విచారించాల్సిన అవసరం ఉంది: వైఎస్ సునీత
తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ బాధ్యతగా విచారణ జరపడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో వైఎస్ సునీత విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ హత్య కేసులో కీలక నిందితులు చెప్పిందే వినడం తప్ప.. వారిని లోతుగా సీబీఐ విచారించ లేదన్నారు.
కడప, మార్చి 15: తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ బాధ్యతగా విచారణ జరపడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో వైఎస్ సునీత విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ హత్య కేసులో కీలక నిందితులు చెప్పింది వినడమే తప్ప.. వారిని లోతుగా సీబీఐ విచారించలేదన్నారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి సీబీఐ సీరియస్‌గా తీసుకొని విచారించడం లేదని ఆమె పెదవి విరిచారు. తన తండ్రి హత్య జరిగిన తరువాత నిందితులందరి మధ్య ఫోన్ సంభాషణలు, మేసేజ్‌లు అత్యధికంగా జరిగాయని ఆమె గుర్తు చేశారు.
ఇంకా ఏమైనా ఇతర ఆధారాలు ఉంటే ఇవ్వండని అడిగితే.. తన వద్దనున్న అదనపు ఆధారాలను సైతం కోర్టుతో పాటు సీబీఐకి సమర్పించానని చెప్పారు. వాటిపై సైతం లోతుగా విచారణ జరపలేదన్నారు. ఈ హత్య కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ఆయన భార్య వైఎస్ భారతిని సైతం విచారించాల్సి అవసరం ఉందని కుండబద్దలు కొట్టారు. కాని వారిని సీబీఐ విచారించలేదన్నారు. ఈ స్థాయిలో పోరాడుతున్నా తనకు చివరకు న్యాయం జరగలేదని చెప్పారు. మన దేశంలో వ్యవస్థలన్నీ ఇలానే ఉన్నాయని పేర్కొన్నారు. చాలా బాధగా ఉందని.. తన పోరాటం ఇంతటితో ఆగదని తెలిపారు. ఈ పోరాటం చివరి వరకు కొనసాగిస్తానంటూ వైఎస్ సునీత స్పష్టం చేశారు.
