Call to Make Singareni Strike Successful
ఏప్రిల్ లో జరిగే సమ్మెను విజయవంతం చేయాలి
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
కార్మిక సమస్యల పరిష్కారం కోసం సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలి ఏప్రిల్‌లో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయండి: కొరిమి రాజ్‌కుమార్, జనరల్ సెక్రటరీ కొమురయ్య భవన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడారు. కార్మిక వర్గం ఐక్య పోరాటాలతో తిరిగి సాధించుకున్న మెడికల్ బోర్డు నిర్వహణను గత సంవత్సరం ఏసీబీ కేసు నమోదైందని సాకుగా చూపుతూ నిలిపివేయడం తీవ్రంగా ఖండనీయమని ఆయన పేర్కొన్నారు.
సుమారు పది నెలలుగా అనారోగ్య కారణాలతో డ్యూటీలు చేయలేక మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను పిలవకపోవడం, పైగా వారిపై నిబంధనల పేరుతో చర్యలు తీసుకోవడం దుర్మార్గ చర్య అని అన్నారు. గుర్తింపు సంఘంగా ఈ సమస్యను ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు పాత పద్ధతిలో మెడికల్ బోర్డును కొనసాగిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని తెలిపారు.
ప్రస్తుతం మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల డిపెండెంట్లు ట్రైనింగ్‌కు సిద్ధంగా ఉన్నవారు సింగరేణి వ్యాప్తంగా సుమారు 300 మంది ఉన్నారని, వారి కుటుంబాలను ఆర్థికంగా మరియు మానసికంగా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన తెలిపారు.
ఎఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో యాజమాన్యం ఒప్పుకున్న ఒప్పందాలను అమలు చేయకపోవడం, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం, కమిటీల పేరుతో కాలయాపన చేయడం జరుగుతోందని విమర్శించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త గనులు ప్రారంభం కాకపోవడం, పాత గనులు మూతపడటం, అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన ₹50 వేల కోట్ల బకాయిలు రాకపోవడం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని పేర్కొన్నారు.
ప్రారంభించాల్సిన బొగ్గు గనులను ప్రారంభించకుండా కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని సాకుతో యాజమాన్యం చేతులెత్తేయడం సమంజసం కాదని రాజ్‌కుమార్ అన్నారు.
అలాగే సింగరేణి వ్యాప్తంగా జే ఎం ఈ టి ఎస్ గా పనిచేస్తున్న వారికి ఓవర్‌మెన్ ప్రమోషన్లు కల్పించాలని, ఎస్ ఎన్ పిసి పిఓఏ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్స్ తదితర విభాగాలలో ఖాళీలను అంతర్గత ఉద్యోగులతోనే భర్తీ చేయాలని, అన్ని క్యాడర్ స్కీములను సవరించాలని డిమాండ్ చేశారు. సాధారణ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు మరియు హైపవర్ కమిటీ నిర్ణయించిన జీతాలు అమలు చేయాలని కోరారు.
సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా జరిగిన కుంభకోణాలు, అవినీతి టెండర్లు, ఉత్పత్తి అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్లానింగ్ లోపాల వల్ల జరిగిన కోట్లాది రూపాయల నష్టంపై మరియు నైనీ బ్లాక్ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
కార్మిక సమస్యల పరిష్కారం కోసం మార్చి 17న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులలో ధర్నాలు, నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే మార్చి 18న శ్రీరాంపూర్ ఏరియా నుండి ప్రారంభమయ్యే “సేవ్ సింగరేణి జాతా” ద్వారా అన్ని ఏరియాలలో కార్మికులను చైతన్యపరుస్తూ మార్చి 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద జరిగే జాతా ముగింపు సభను జయప్రదం చేయాలని కోరారు. అదే విధంగా ఏప్రిల్ నెలలో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో భూపాలపల్లి బ్రాంచ్ సెక్రటరీ మోట పలుకుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు జి. సుధాకర్ రెడ్డి, ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
