నిన్న- ఆగడు… దూకుడే! నేడు- నేను… ఒంటరే!!

`జ్ఞానోదయంలో తన్నుకొచ్చే కన్నీరే!!!

`తుంటరి మాటలు తెచ్చిన తంటా!

`నోటి దురుసుతో ఒంటరై…దూకుడెక్కువై….దారి కరువై…

` రేవంత్‌ ఒంటరే…అని మొదటి నుంచి చెబుతున్న నేటిధాత్రి…

`ప్రతి సందర్భంలోనూ రేవంత్‌ ను హెచ్చరిస్తూనే వస్తోంది నేటిధాత్రి…

`సీనియర్లుతో పెట్టుకుంటే సీన్‌ సితారే అని ఎప్పుడో చెప్పింది…

`చెప్పగా వినకపోతే చెడంగ చూడాలే…అనే సామెత నిజం చేసిన రేవంత్‌…

`ఐపిఎస్‌ అని హోం గార్డులాగా కంగారు పడుతున్న రేవంత్‌..

` ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగేవారేరీ…కలిసివచ్చేవారేరీ..

` సీనియర్లను కాదన్న నాడే కథ కంచికి చేరింది…

` వాళ్లను పక్కకు పెట్టిన నాడే పదవీ గండానికి బీజం పడిరది…

` తెగేదాకా లాగి ఇంత దూరం తెచ్చుకున్నది రేవంతే….

` చంద్రబాబుతో రాజకీయ సంకెళ్లు తెంచుకుంటేనే చాలు..

` చంద్రబాబు కబంద హస్తాలనుంచి బైట పడితే మేలు…

`నీ ఆటను చంద్రబాబు ఆడుతుంటే చూడకు…

`ఇప్పటికీ మించి పోలేదు…సీనియర్లును సిన్సియర్‌ గా గౌరవించు…

హైదరాబాద్‌,నేటిధాత్రి:

దిగితే గాని లోతు తెలియని పెద్దలు ఊరికే అనలేదు. పార్టీ నడపడం అంటే పార్టీలో చేరినంత సులువు కాదు. తాను గెలిచినంత మాత్రాన పార్టీని గెలిపించుడు అంత ఆషామాషీ వ్యవహారం అసలే కాదు. తాను అడుగేస్తే అందరూ వేసినట్లు కాదు..తానొక్కడు నడిస్తే దారి పడేది లేదు. ఆ బాట వెంట అందరూ రారు. రాజకీయమంటే బానిసత్వం కాదు…నాయకత్వమంటే పెత్తనం చేస్తే చాలదు. కుర్చీలో కూర్చుంటే అన్నీ జరిగిపోతాయనుకుంటే ఇలాగే వుంటుంది. రేవంత్‌కు అనుభవపూర్వకంగా తెలిస్తే గాని తత్వం బోధపడలేదు. అందుకే దిమ్మతిరిగి బొమ్మ కనిపించినంత పైనైనట్లుంది. నేనొక్కనే…నా దూకుడుకు ఎదురు లేదు…నేను మొదలుపెడితే ఆగేది లేదన్నది నిన్నటి మాట…ఎన్నికలంటే ఏమిటో…పార్టీని గెట్టెక్కించడం అంటే ఏమిటో…పార్టీ కోసం ప్రచారం చేయడం అంటే ఏమిటో…అన్ని బాధ్యతలు భుజాన వేసుకుంటే తెలిసొచ్చినట్లుంది. పార్టీలో అందరికంటే ముందునడవడం అంటే ఏమిటన్నది ఇంత జరిగితే తప్ప తెలిసి రాలేదు. అసలు రాజకీయం అంటే ఇలా వుంటుందా? అన్నది తెలిసిన తర్వాత ఆక్‌ పాక్‌ కరివేపాక్‌ అన్నది గుర్తుకొస్తున్నట్లుంది. హుజూరాబాద్‌ నాడు చేతులెత్తేసినా ఎవరూ ఏమనలేదు. ఎవరినీ సంప్రదించకుండా అభ్యర్ధిని నిర్ణయిస్తే ఎవరూ ప్రశ్నించలేదు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే కొత్తగా నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరికైనా కొంత ఇబ్బందికరమన్న భావన అందరిలో వుండడం మూలంగానే రేవంత్‌కు విమర్శలు ఎదురుకాలేదు. అక్కడ ఓడిపోయినా ఎవరూ వివాదం చేయలేదు. 60వేల ఓట్లు వచ్చిన దగ్గర 3వేల ఓట్లు వచ్చినా ఎవరూ పెద్దగా నిందించలేదు. ఇరుకున పెట్టలేదు. కాని ఇప్పుడే అసలు కథ మొదలైంది. గత ఏడాదికాలంగా రేవంత్‌రెడ్డిని సమయం చూసి, సీన్‌ సితార చేద్దామనుకుంటున్న సీనియర్లకు అవకాశం అందివచ్చింది. రేవంత్‌కు మునుగోడు ఉప ఎన్నికతో ముచ్చెమటలు పట్టే దశకు పరిస్దితి చేరింది. ఒక్కడినే…నేనొక్కడినే …నాకెదురేది…నాకుఎవరు ఎదురొచ్చినా, నేను ఎవరికి ఎదురెళ్లినా ప్రాబ్లం వారికే, ఇక నేను రంగంలోకి దిగిన రాజకీయమంతా దబిడి దిబిడే అనుకున్నాడు. కాని రేవంత్‌కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. రాత్రి ప్రచారసమయంలో కన్నీళ్లు వస్తున్నాయి. నన్ను ఒంటరి చేస్తున్నారన్న మాటలు రేవంత్‌ నోట ఇప్పుడిప్పుడు వినిపిస్తున్నాయి. తాను ఒక్కడినే అనుకున్నప్పుడు ఒంటరి తనం గుర్తుకురాలేదు. ఐపిఎస్‌లు వచ్చి ఎస్పీలైనట్లు, తాను పిపిసి అధ్యక్షుడినయ్యానంటూ, ఇతర సీనియర్లను హోంగార్డులతో పోల్చిన సంగతి గుర్తుకొచ్చి, తానేమిటో…తన పరిస్ధితి ఏమిటో తెలిసి కంటకన్నీరు ఒలికే దాకా వచ్చింది…కలిసి రండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చేదాకా వచ్చింది…ఇది ముందు నుంచే నేటిధాత్రి చెబుతూనే వుంది…హెచ్చరిస్తూనే వుంది. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలంటే అంత సులువు కాదు…సముద్రమైనా ఈదొచ్చేమోకాని కాంగ్రెస్‌లో నెగలగడం అన్నది అందరికీ సాధ్యం కాదు… ఒక్కసారి కాంగ్రెస్‌లో ఒదిగితే చాలు..ఏ పార్టీలోనైనా ఇమిడిపోవచ్చు. అదే కాంగ్రెస్‌లో ఇమడలేకపోతే కష్టం…ఇమిడితేనే అసలైన నాయకత్వం…

రేవంత్‌రెడ్డివి ఎప్పుడూ తంటరి మాటలే…నోరుంది కదా! అని ఏది పడితే అది మాట్లాడొద్దు. అందులోనూ సొంత పార్టీ నేతలను కెలుకొద్దు. వారికి మనస్తాపం కల్గించొద్దు. ఎంత పెద్ద నాయకుడైనా సరే..పార్టీయే సుప్రిం…మిగతా నాయకులంతా కలిస్తేనే నాయకత్వం అనుకోవాలి. అంతే కాని నేనే సుప్రిం…నేను చెప్పిందే వేదమని అనుకుంటే ఆ నాయకుడికి అదును చూసి చెక్‌ పడడం ఖాయం…తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్‌కే సొంత పార్టీలో పరాభవం. రేవంత్‌ ఎంత? ఆయన రాజకీయం ఎంత? ఎన్టీఆర్‌ రాజకీయంలో ఈకంత. అందులోనూ కాంగ్రెస్‌లో నిచ్చెన మీదకు ఎక్కించే వారు ఎవరూ వుండరు… నిచ్చెన ఎక్కేవారిని లాగేయడంలో అందరూ ముందుంటారు. ఎవరైనా జరుతుంటే పట్టుకునేవారు ఎవరూ వుండరు. ఈ విషయంపై పూర్తిగా రేవంత్‌కు అవగాహన లేకే ఇదంతా జరుగుతోంది. గతం నుంచి అందరూ అనుకుంటున్నట్లు కాంగ్రెస్‌లో కోవర్టులు..వారి వల్లనే పార్టీకి అదోగతి పాలు అన్నది వినీ, వినీ..రేవంత్‌ ఇక నాకు ఎదురు లేదు..కోవర్టులను నేను ఏరి వేస్తాను…పంపిచేస్తాను…పార్టీని ప్రక్షాళన చేస్తాను…నా మర్కు రాజకీయం చూపిస్తాను అని కలలు కన్నాడు. కాంగ్రెస్‌లో కలలు గన్న నాయకుడు అనుకున్న లక్ష్యాలు చేరుకున్నవారు ఎవరూ లేరు. సహజంగా జాతీయపార్టీలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరకీ తెలియదు. అందులోనూ కాంగ్రెస్‌ లాంటి పార్టీలో నాయకత్వం ఎంత మంది చేతుల్లో వుంటుందో… ఎంత మంది కృష్ణులు వచ్చిపోతారో? అన్నది ఎవరూ చెప్పలేరు. రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చెన్నారెడ్డికే పార్టీలో పెత్తనానికి దిక్కులేకుండాపోయింది. కాంగ్రెస్‌ చరిత్రలోనే ఉమ్మడిరాష్ట్రంలో మెజార్టీ తెచ్చిన పి.వి. నర్సింహారావు పట్టుమని పదహారు నెలలు ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగలేకపోయారు. ఇలా వుంటుంది కాంగ్రెస్‌ రాజకీయం…నేనేంటే…నేనే..అంతా నేనే అన్నది కాంగ్రెస్‌లో చెల్లదు. కాలం కలిసొస్తే కార్యకర్త కూడా కీలకమౌతాడు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రి పదవి నిర్వహించడం తన వల్ల కాదని చేతులెత్తేశాక, ఎంతో రాజకీయ అనుభవం వున్న, ఉత్తమ పార్లమెంటేరియన్‌ అన్న గుర్తింపు వున్న జయపాల్‌రెడ్డి సిఎం అనుకున్నారు. కాని రాత్రికి రాత్రి ఎలాంటి అనుభవం లేని కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అలా వుంటది కాంగ్రెస్‌ రాజకీయం…మొదటి నుంచి నేటిధాత్రి పత్రిక హెచ్చరిస్తూనే వుంది.

రేవంత్‌ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక ప్రత్యేక కథనాలు కూడా రాసింది. రేవంత్‌ తుంటరి మాటలు తగ్గించుకోవాలని నేటిధాత్రి సూచించింది. కాని రేవంత్‌ మానుకోలేదు. ఆ నోటి దురుసు కూడా ఇంత దాకా తెచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే కలుపుగోలు రాజకీయం.. అందులో అందరూ కలిసి రావొచ్చు…రాకపోవచ్చు..గ్రూపులు కట్టొచ్చు…ఏకంగా పిసిసినే దూరం పెట్టొచ్చు..అట్లుంటది కాంగ్రెస్‌రాజకీయం. అది తెలియక రేవంత్‌ సీనియర్లందరినీ స్క్రాప్‌ అనుకున్నాడు. వారిని ఏరి వేద్దామనకున్నాడు. సీనియర్ల గోల లేకుండా చూసుకుందామనుకున్నాడు. తన అనుచరులతో పార్టీని నింపేద్దామనుకున్నాడు. నియోజకవర్గాలలో కుంపట్లు రగిలించిడం మొదలుపెట్టాడు. వైరి వర్గాలు తయారయ్యేందు అవకాశం కల్పించాడు….మొత్తంగా రాజశేఖరెడ్డి ఆడిన రాజకీయం ఆడుదామనుకున్నాడు. కాని రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితమే కాంగ్రెస్‌లో మొదలైందన్న సంగతి రేవంత్‌ మర్చిపోయాడు… వైఎస్‌. ముఖ్యమంత్రిగా చెలాయించిన రాజకీయమే చూసి, కాంగ్రెస్‌లో పెత్తనం అలా చేయాలనుకున్నాడు. కాని రాజశేఖరెడ్డి ఎన్ని డక్కామొక్కీలు తిన్నాడో అన్నది తెలుసుకోకుండా కాంగ్రెస్‌ రాజకీయంలో వేలు పెట్టాడు… పుట్టలో వేలెడితే కుట్టనా అన్నట్లు మంట తగిలే సరికి , తత్వం బోధపడినట్లుంది. కనికరం లేకుండా కోవర్టులు అన్నవారి గురించి తెలిస్తే నిర్ధాక్ష్యిణ్యంగా పార్టీనుంచి పంపిస్తానన్న రేవంత్‌కు అదే కోవర్టులు చూపిస్తున్న చుక్కలను లెక్కబెట్టుకోలేక సతమతమౌతున్నాడు…గింగిరాలు తిరుగుతున్నాడు. మునుగోడులో రేవంత్‌ ఒక్కడే ప్రచారం చేయలేక, సీనియర్లను ఇప్పుడు పిలువలేక, వారిని భుజ్జగించేంత సమయంలేక, వారి వద్దకు వెళ్లలేక నలిగిపోతున్నాడు. రాహుల్‌ జోడో, మునుగోడు ఉప ఎన్నిక కోసం ద్విపాత్రాభియనం చేయలేకపోతున్నాడు. రాహుల్‌ జోడో పాదయాత్ర వెళ్లకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మునుగోడు ప్రచారాన్ని వదిలేస్తే పిసిపి పదవికే గండమొస్తుంది. అటు ప్రచారానికి పూర్తి సమయం కేటాయించలేక, జోడో యాత్రను సమన్వయం ఎలా చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాడు. తన పనైపోతుందా? అని నిర్ఘాంత పోతున్నాడు…నిట్టూర్పులో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *