తెచ్చిన వాళ్లా…ఇచ్చిన వాళ్లా!?

ఈసారి ఎన్నికల్లో బలమైన ప్రత్యర్ధులెవరు?

ఇరు పార్టీల మధ్య పోటీనా?

మూడు ముక్కలాటనా?

బలంగా వున్న టిఆర్‌ఎస్‌

బలం పెంచుకుంటున్న కాంగ్రెస్‌

ఆటలో అరటిపండై బేజారయ్యేది బిజేపేనా?

క్షేత్రస్ధాయిలో యంత్రాంగమే లేని బిజేపి…

పాల పొంగు గెలుపులు ఎప్పటికీ తోడు రావు…

ఉప ఎన్నికలు వేరు…సార్వత్రిక ఎన్నికలు వేరు!

హస్తం డిక్లరేషన్‌లో వాస్తవమెంత?

జనం నమ్మేదెంత?

అధికారంలో వున్న రాష్ట్రాల్లో అమతౌతున్నదెంత?

కారుకు ప్రత్నామ్నాయం ఎవరు?

పంతం …నీదా…నాదా..సై! అన్నట్లే వుంది రాష్ట్ర రాజకీయాల పరిస్ధితి. ఇచ్చిన వాళ్లా…తెచ్చిన వాళ్లా అన్నట్లే సాగుతోంది. తెలంగాణలో బలమైన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రాంతీయ పార్టీ అయినా ఉద్యమ నేపథ్యం బలంగా వున్న పార్టీ. బలమైన క్షేత్రస్ధాయి యంత్రాంగం వున్న పార్టీ. అడుగడుగునా పార్టీకి అండగా వుండే నాయకులు మెండుగా వున్న పార్టీ. పద్నాళుగేళ్ల పోరాట చరిత్రలో రాటుదేలిన నాయకులున్న పార్టీ. ఎనమిది సంవత్సరాలుగా అధికారంలో వున్న పార్టీ. బలమైన నాయకుడు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సాగుతున్న పార్టీ. ఉద్యమ నాయకుడుగా కార్యరంగంలో అడుగు పెట్టి, తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన కేటిఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటుగా వున్న పార్టీ. పార్టీ కోసం అహర్నిషలు పాటుపడే కార్యకర్తలున్న పార్టీ. దేశంలోనే 60లక్షల మంది కార్యకర్తలున్న ప్రాంతీయ పార్టీ. ఇరవై రెండేళ్ల పార్టీ ప్రస్ధానంలో ఏనమిదేళ్ల తిరుగులేని ఎన్నికల విజయాలతో దూసుకెళ్తున్న పార్టీ. అలాంటి టిఆర్‌ఎస్‌కు, వరంగల్‌ లో జరిగిన కాంగ్రెస్‌ రైతు సంఘర్షణ సభ ఒక సవాలు లాంటిదే అని చెప్పక తప్పదు. అంత చిన్నగా తీసివేయాల్సిన సభకాదు. 

                    మండుటెండలో అంత మందిని సభకు తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ ప్రజలంతా మొత్తం తెలంగాణ నుంచి వచ్చిన వాళ్లు కాదు. కేవలం ఉమ్మడి వరంగల్‌ జిల్లా తోపాటు, పొరుగు రెండు, మూడు జిల్లాల సరిహద్దు కార్యకర్తలు మాతమ్రే…! ఇది తెరాస తెలుసుకోవాల్సిన విషయం. అంటే కాంగ్రెస్‌ బాగానే బలడుతోందన్న సంకేతాలు ఇచ్చినట్లే లెక్క. ఎంత బలమున్నా మన బలాన్ని మనం కూడా అప్పుడప్పుడూ చూసుకుంటుండాలి. చూపిస్తూ వుండాలి. అలా కూడా మనమెంత బలవంతులమో చూడా ప్రతిపక్షాలకు కనిపించాలి. అంత మంది ప్రజలు ఎలా కాంగ్రెస్‌ సభకు వెళ్లారన్నదానిపై టిఆర్‌ఎస్‌ లో లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం వుంది. బేషజాలకు పోవాల్సిన పనిలేదు. పార్టీకి కార్యకర్తలకు వున్న ఆలోచనలు తెలుసుకోవాలి. మండల, జిల్లా స్ధాయి నేతల సమావేశాలు జరగాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నదానిపై విసృతమైన చర్చ జరగాలి.

                           ఇంతగా కాంగ్రెస్‌ కార్యకర్తలను కూడేయడానికి దారి తీసిన పరస్ధితులు అంచనా వేయాలి. ఇదంతా తెరాసలో వేగంగా జరగాలి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో అమలు లేనన్ని అనేక సంక్షేమ పధకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. కళ్లముందు నీళ్లు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి. చెరువులు కళకళలాడుతున్నాయి. ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు రైతుకు అందుతోంది. పంటలు పుష్కలంగా పండుతున్నాయి. కళ్యాణ లక్ష్మి వంటి వినూత్నమైన పధకాలు దేశంలో ఎక్కడా లేవు. ఆసరా పధకం అమలు అన్నది గొప్పగా అమలౌతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే సాగు రంగమే, కాదు పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించిన రాష్ట్రం తెలంగాణ. అయినా ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత ఎదురౌతోందన్నదానిపై అంతర్మధనం అవసరం. అదీ కాక పార్టీ శ్రేణులను కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి ఎంతో వుంది. పార్టీకి పెట్టని గోడాలా వున్న కార్యకర్తలకు కూడా సంక్షేమ పధకాలు అందాలి. వారికి చేతి నిండా పని లేకపోతే పార్టీకి పనిచేయడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు సామాన్యులకు వచ్చినట్లే, పార్టీ కార్యకర్తలు కూడా ఇండ్లు తీసుకున్నారు. అలా పార్టీ పరమైన సేవలు కూడా పొందారు. మరి తెలంగాణలో పార్టీ కార్యకర్తలకు ఏం అందిందన్నది కూడా చూస్తారు? సహజంగా ఏ పార్టీలోనైనా కార్యకర్తల్లో కనిపించే నిస్తేజమే జనం గ్రహిస్తారు. కార్యకర్తలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూసి కూడా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధపడతారు. నిజానికి తెలంగాణ వచ్చేదాకా తెరాసకు పూర్తి స్ధాయిలో పార్టీ యంత్రాంగం లేదు. అప్పుడు ఉద్యమ కాలం. పార్టీ నుంచి కార్యకర్తలు ఆశించేదేమీ లేదు. తెలంగాణ వస్తే చాలనకున్నారు. కాని ఇప్పుడు పార్టీ అధికారంలో వుంది.. పార్టీనుంచి ఎంతో కొంత కార్యకర్తలు ఆశిస్తారు. అవి పదవులే కావొచ్చు…పనులే కావొచ్చు. ఎలాగో స్ధాయిని బట్టి నాయకులు, కార్యకర్తలు సంతోషంగా వుండడం అన్నది పార్టీకి ఎంతో శ్రేయస్కరం. 

                             నిన్నటిదాక రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఊపులేదు. ఆ జోరు లేదు. కమలంలో దరహాసం లేదు. చేతిలో ఐక్యత లేదు. కాని కొత్తగా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కార్యకర్తలో జోష్‌ నిండుతోంది. రాష్ట్రంలో గత ఎనమిదేళ్ల రాజకీయం వేరు, వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ సభ తర్వాత వేరు అనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇంత శక్తి వుందా? అన్నది మరోసారి రుజువు చేసుకున్నట్లైంది. మొన్నటికి మొన్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్‌ కూడా రాకుండాపోయిన కాంగ్రెస్‌ పార్టీ ఇంత పటిష్టంగా వుందా? అన్న సందేహాం కలగకమానదు. రేవంత్‌ రెడ్డి పీసిసి అధ్యక్షుడయ్యాక కొత్తలో కొంత ఉత్సాహం కనిపించింది. కాని హుజూరాబాద్‌ ఎన్నికలతో ఇక రేవంత్‌ పని అయిపోయందన్న చర్చ జోరుగా సాగింది. సీనియర్లకు మంచి పని దొరికింది. అడుగడుగునా రేవంత్‌ను ఉతికి ఆరేయడం మొదలుపెట్టారు. సందుదొరికితే చెడుగుడు ఆడుకున్నారు. ఉక్కిరి బిక్కిరి చేశారు. అడుగు తీసి అడుగేయాలంటే రేవంత్‌ ఆలోచనలో పడేలా చేశారు. ఒక దశలో ఇక రేవంత్‌ కాంగ్రెస్‌లో నెగలడం కష్టమే అన్న స్ధాయి దాకా తీసుకొచ్చారు. పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం సన్నాహక సమావేశాలు సికింద్రాబాద్‌లో జరిగినప్పుడు జిల్లాల సీనియర్‌నేతలు, రాష్ట్ర స్ధాయి నేతలు కలసి, ఆగమాగం చేశారు. అయినా రేవంత్‌ అన్ని దిగమింగుకుంటూ వచ్చాడు.

                          తన లక్ష్య సాధనలో ఇలాంటివి ఎదురౌతాయని ముందుగానే తెలిసి ధైర్యం కూడగట్టుకుంటున్నాడు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ, క్షేత్రస్ధాయి నుంచి మళ్లీ కాంగ్రెస్‌కు జీవం పోస్తూ వస్తున్నాడు. అయినా ఎక్కడిక్కడ అవాంతరాలు ఎదరౌతూనే వున్నాయి. సృష్టింబడుతూనే వున్నాయి. కాంగ్రెస్‌లో అవి ఆగేవికాదు. నాయకుల మధ్య ఐక్యత లేదు. సఖ్యత అంత కన్నా లేదు. మేము పిసిసి కాలేకపోయామన్న అసంతృప్తి ఒక వైపు, కొత్తగా వచ్చిన రేవంత్‌ రెడ్డి ఎలా అయ్యారన్న కోపం మరో వైపు. ఈ సంఘర్షణల మధ్యే సీనియర్లు సాగుతున్నారే తప్ప పార్టీ కోసం ఆలోచించడం లేదు. ఆ యావ కూడా వారిలో లేదు. ఇదే పార్టీకి ఇప్పటికే రెండు సార్లు తీరని నష్టం తెచ్చిపెట్టింది. తెలంగాణ వచ్చాక ఇచ్చింది మేమే.. మేమే అన్నది చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు చెప్పుకుంటున్నారు. కాని మాలో ఐక్యత లేదని పదే పదే నిరూపించుకుంటున్నారు. ప్రజల్లో నమ్మకం కల్పోతున్నారు. అందుకే ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కన్నా తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్లనే తెలంగాణ బాగు పడుతుందని ప్రజలు ఆశించారు. కేసిఆర్‌ తోనే తెలంగాణ పునర్మిర్మాణం జరుగుతుందని బలంగా నమ్మారు. ఒకటికి రెండుసార్లు తెలంగాణలో తెరాసను మరింత మెజార్టీ కట్టబెట్టి మరీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటారు. కాకపోతే కాంగ్రెస్‌ను కూడా ఎంతో కొంత గుండెల్లో పెట్టుకునే ప్రయత్నమే ప్రజలు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను మరీ పక్కన పెట్టలేదు. కాని పార్టీ ఎంపిక చేసిన నాయకులను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే వాళ్లు కారెక్కడాన్నే జనం చీదరించుకున్నారు. ఆ పార్టీని చీకొట్టేదాకా తెచ్చారు. 

                           ఇప్పటికీ నమ్మితే ఏం చేస్తారో ఆందోళనలో ప్రజల్లో సజీవంగానే వుంచుతున్నారు. కోవర్టులెవరో…అసలు కాంగ్రెస్‌ వాదులెవరో అందరికీ తెలుసు. కాని కాంగ్రెస్‌లోనే వుంటూ నిత్యం చిటపటలతో కాలం గడుపుతూ, పార్టీకి సెగపెడుతూ, పొగ పెడుతూనే వున్నారు. వాళ్లే పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. ఆ కష్టం నుంచి కాంగ్రెస్‌ను బైట పడుకుండా చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ఎదగకుండా చేస్తున్నారు. తమ వైఫల్యాలను, బలహీనతలను కప్పిపుచ్చుకుంటూ, తెరాస వల్లనే వీకవుతున్నామని అశక్తతను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలన్న తర్వాత రాజకీయాలే చేయాలి. అధికార తెరాస చేస్తున్న రాజకీయానికి దీటుగా రాజకీయం చేయలేనప్పుడు చేతిని ఒత్తేందుకే ఎవరైనా చూస్తారు… కాని చేయిచ్చి పైకి తెచ్చేందుకు ఎవరు సాయపడతారు? ఈ మాత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు తెలియక కాదు…కాకపోతే మాకన్నా ఎవరూ ముందుకు వెళ్లొద్దు…మాపై పెత్తనం చేసేవాళ్లు వుండొద్దు. ఇంతకు మించి ఏదీ లేదు. అసంతృప్తులతోపార్టీకి ఒరిగేదేమీ లేదు. పార్టీకి ఎప్పుడూ వాళ్లుతో నష్టమే…! ఇది పూర్తిగా తెలిసిన రాహుల్‌ గాంధీ వరంగల్‌ సభలో సూటిగానే కోవర్టులను హెచ్చరించారు. వుంటే వుండండి…లేకుంటే వెళ్లిపోండన్నారు? ఇది కాంగ్రెస్‌కు ఎంతో శుభయోగం…శుభకరం. వాళ్లు వెల్లిపోతే కొట్లాడేవారికి ఎదురుండదు. తలనొప్పి వుండదు. టిక్కెట్లు ఇచ్చి, గెలిపించునే బాధ్యత మరింత తీసుకుంటారు. లేకుంటే సీనియర్ల రాజకీయాలతోనే పుణ్యకాలం పోగొట్టుకుంటారు. 

                                  వరంగల్‌ జోష్‌తోనైనా కలిసి కట్టుగా వుంటారో లేదో అన్నది కాలమే సమాధానం చెప్పాలి. కాని రేవంత్‌కు కాంగ్రెస్‌ పార్టీలో ఎదరు లేదు, తిరుగు లేదన్నది మాత్రం వరంగల్‌ సభతో రుజువు చేసుకున్నాడు. తనకు ధీటైన నాయకుడు కాంగ్రెస్‌లో మరొకరు లేదన్నది నిరూపించుకున్నాడు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎటు వైపు నడుస్తారన్న దానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందనే అనుకోవాలి. ఇక వ్యూహాలు ఎలా వుంటాయి? వాటిని ఎలా చేధించుకుంటారు? ఇద్దరా, ముగ్గురా? అన్నది తేలితే గాని ద్వంద్వ యుద్ధమా? త్రిముఖ పోరా అన్నది తెలుతుంది. ఏది ఏమైనా అన్ని పార్టీలకు పరీక్షా కాలం మొదలైనట్లే…పరీక్షలకు సిద్ధం కావాల్సిందే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *