ఛీ…ఛీ…మీరు మారరు!?

హస్తంలో ఆరని కుంపటి?

జనం ఆలోచనలకు ప్రతీకలు కాలేరు!

ఎవ్వరి స్వార్థం వారిదే!

పార్టీ కోసం పని చేయాలని ఎవరికీ లేదు?

 గెలవాలన్న కసి లేదు?

గెలిపిద్దామన్న ఐక్యత లేదు?

ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవడం తప్ప, మరేం లేదు?

ఇంత జరుగుతున్నా ఒక్కరిలోనూ అంకిత భావం లేదు?

వున్న వాళ్లను పంపిస్తున్నారు?

పోయే వాళ్లను బ్రతిమిలాడుతున్నారు?

అందరూ కలిసి పార్టీని ముంచేస్తున్నారు?

మునుగోడు తో ఇక లేవకుండా చేసుకుంటున్నారు?

జనం ఛీ కొడుతున్నారు? అయినా మీరు మారరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నేను రానుబాబో అంటూ ఎంపి కోమటి రెడ్డి వెంకటరెడ్డి భీష్మించుకుకూర్చున్నాడు. ఎలా బైటపడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఒక్కడివొస్తే చాలదు…అన్నా దమ్ములు ఇద్దరూ కలిసి వస్తేనే లెక్క…అని బిజేపి ఫిట్టింగ్‌ పెట్టి కూర్చున్నది. సరే…అంటూ కోమటిరెడ్డి సోదరులు తలూపినట్లు సమాచారం…కాని రాజగోపాల్‌ రెడ్డి ముందు పరిస్ధితి గమనించేందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే పదవికి రాం..రాం చెప్పాడు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు అంటాడు… ఓ ప్రతిపక్ష పార్టీ నుంచి మరో ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం పోరాటమా? పోరుబాటను ఎంచుకోవడం ఇదా అంటే అదంతా మాకు తెల్వదంటాడు…తాము ఎంచుకున్న మార్గం వేరు అంటారు…అన్నా దమ్ములం కలిసొస్తామని చెప్పినట్టు తెలుస్తున్నా…అబ్బే అదేం లేదంటారు…అసలు నిజం చెప్పలేరు…అబద్దం చెబుతూ కాలం గడపలేదు… ఆఖరుకు పార్టీని ముప్పు తిప్పలు పెట్టి అన్నాదమ్ములు కలిసి కాంగ్రెస్‌ పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అయినా సరే …రాజగోపాల్‌రెడ్డి పోయినా ఫరవాలేదు…మీరుండాలి అంటూ కాంగ్రెస్‌ పార్టీ వెంకటరెడ్డి కాళ్లా వేళ్లా పడుతోంది…గతంలో ఏ నాయకుడికి బ్రతిమిలాడనంత గౌరవంగా ఆయనను ప్రసన్నం చేసుకోవాలని పార్టీ చూస్తోంది…నిజానికి అక్కడ ఏం జరగాలి….పార్టీని వెంకటరెడ్డి బ్రతిమిలాడుకోవాలి….కాని అంతా రివర్స్‌ జరుగుతోంది. వెంకటరెడ్డి జారి పోకుండా చూడాలని కాంగ్రెస్‌ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అటు కాంగ్రెస్‌కు తెలుసు…ఇటు వెంకటరెడ్డికి తెలుసు…కాని జగన్నాటకమాడుతున్నారు…జనాలను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బిజేపిలోకి వెంకటరెడ్డి వెళ్లడం ఖాయమని విసృతంగా చర్చ జరుగుతోంది…కాని నేను వెళ్లను అంటూ వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల దాకా ఆగాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌లోనే వుంటూ కట్టప్ప పాత్ర పోషించాలని చూస్తున్నాడు. తమ్ముడిని గెలిపించుకొని అప్పుడు కాంగ్రెస్‌కు జెల్లకొడదామని చూస్తున్నాడు. ఇది కాంగ్రెస్‌కు కూడా తెలుసు. కాని ఏంచేయలేని నిస్సహాయక స్ధితి. ఇలాంటి పరిస్ధితి కాంగ్రెస్‌ ఏనాడు అనుభవించలేదు. ఒక నాయకుడి కోసం రాష్ట్ర పార్టీ మొత్తం మోకరిల్లడం కూడా ఆయన బిజేపిలోకి చేరడానికి మరింత బలంగా మారుతోంది. కాంగ్రెస్‌ మొత్తం వదులుకునేందుకు ఇష్టపడని నాయకుడు బిజేపిలో చేరితే బలమైన నాయకత్వంగా అవతరించొచ్చని అన్నా, దమ్ములు అనుకుంటున్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇది మాత్రం బిజేపికి అర్ధం కావడంలేదు. భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే, మిమ్ముల్ని నమ్మి కన్న తల్లి లాంటి కాంగ్రెస్‌ను వదిలేశానని మొసలి కన్నీరు కార్చొచ్చు…పార్టీ మొత్తం నన్ను వద్దన్నా వినకుండా బిజేపి పంచన చేరాని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడ ఇప్పుడు చేస్తున్నట్లే రాజకీయం చేయొచ్చు…ఇదిలా వుంటే వెంకటరెడ్డి ఎలా ఆడిస్తే కాంగ్రెస్‌ అలా ఆడుతుండడం కూడా ఆ పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు.

గత కొంత కాలంగా భువనగిరి ఎంపి. వెంకటరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నాడు. ఒక దశలో గాంధీ భవన్‌ మెట్లు కూడా ఎక్కనన్నాడు. రేవంత్‌ రెడ్డి పిపిసి. అధ్యక్షుడు కావడం నాకు ఇష్టం లేదని భహిరంగంగానే చెప్పేశాడు. రూ.50 కోట్లు ఖర్చు చేసిన పిపిసి కొనుక్కున్నాడని కూడా వెంకటరెడ్డి ఆరోపణలు చేశాడు. అయినా ఆయనను పార్టీ సముచితంగానే గౌరవిస్తోంది. తాజాగా చండూరు సభలో కోమటిరెడ్డి సోదరులపై అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలన్నాడు. పాపం రేవంత్‌ భేషరుతుగా క్షమాపణ చెప్పాడు. అద్దంకిని పార్టీనుంచి బైటకు పంపాలని వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎలాగో అద్దంకిని ఆ దిశగా కూడా పార్టీ భుజ్జగించే ప్రయత్నం చేసింది. ఇవన్నీ జరిగితే మునుగోడు ప్రచారానికి వస్తానన్నాడు. పార్టీ తరుపున ప్రచారం చేస్తానన్నాడు. మంగళవారం డిల్లీ నుంచి వచ్చిన వెంకటరెడ్డి మళ్లీ కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌ను మార్చాలంటున్నాడు. అంతే కాదు, సీనియర్లందరినీ మరోసారి సంప్రదించి, పిపిసిని కూడా మార్చాలంటున్నాడు. అప్పటిదాకా తాను పార్టీకి పనిచేయనని స్పష్టం చేశాడు. పనిలో పనిగా ఎవరు ఎంత కష్టపడినా సరే…మునుగోడులో కాంగ్రెస్‌ గెలవదని చెప్పేశారు. అంటే తాను పరోక్షంగా తమ్ముడికే మద్దతిస్తున్నానని మరోసారి చెప్పాడు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఆయనను నెత్తినెత్తుకొని ఊరేగేందుకు ప్రయత్నం చేస్తోంది. పార్టీ సీనియర్లందరూ వెంకటరెడ్డి మాటలు నిజం కావాలని కోరుకుంటున్నారు…ఇంత దౌర్భాగ్యం ఏ పార్టీలోనైనా వుంటుందా? 

జనం ఆలోచనలకు కాంగ్రెస్‌ నేతలు ప్రతీకలు కాలేకపోతున్నారు. చుండూరు సభను కార్యకర్తలు సక్సెస్‌ చేశారు. అంటే క్షేత్ర స్ధాయిలో కూడా బలంగానే వున్నామని కాంగ్రెస్‌ పార్టీకి సంకేతాలిచ్చారు. కాని కాంగ్రెస్‌ పెద్దలకు నమ్మకం లేదు. పార్టీ యంత్రాంగం వున్న కాంగ్రెస్‌లో మునుగోడు ఉప ఎన్నికపై నమ్మకం లేదు. కాని అసలు కార్యకర్తలే లేని బిజేపికి అతి విశ్వాసం ప్రదర్శిస్తోంది. అంటే నాయకుల్లో ఐక్యత అన్నది ఏ పార్టీకైనా ముఖ్యమన్నది కాంగ్రెస్‌ నేతలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారనేది ఇప్పటికీ వారిలో వారికే అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది. మొత్తంగా కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా ఆ పార్టీ నేతలే చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.అసలు పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని ఎందుకు భుజ్జగిస్తున్నట్లు. జగ్గారెడ్డి లాంటి నాయకులను ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు..కొత్తగా అసంతృప్తి వాదులతో గొంతు కలిపిన మర్రి శశిధర్‌రెడ్డి చెబితే ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్‌కు ఓటు పడుతుందా? అసలు సామాన్య ప్రజలు ఆయనను గుర్తుపడతారా? తనకంటూ సొంత ఇమేజ్‌ లేని మర్రి శశిధర్‌రెడ్డి లాంటి వారు కాంగ్రెస్‌ పార్టీ గాలిలో గెలిచిన వాళ్లే తప్ప, సొంతంగా క్యాడర్‌ వున్న వాళ్లు కాదు. జగ్గారెడ్డి కూడా అంతే…2004లో టిఆర్‌ఎస్‌ మూలంగా, 2009లో కాంగ్రెస్‌ మూలంగా గెలిచాడు. 2014లో తెలంగాణ గాలిలో కొట్టుకుపోయాడు…మళ్లీ 2018లో కాంగ్రెస్‌ ఓట్లతో గెలిచాడు. అలాంటి నాయకుడు కూడా సొంతంగా పార్టీ పెడతానని చెప్పుకుంటున్నాడు. ఆయన చెబితే తెలంగాణలో సంగారెడ్డిలో కాకుండా మరెక్కడైనా గెలిచే పరిస్దితి వుందా? కనీసం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరెక్కడినుంచి పోటీ చేసినా గెలవగలడా? కాంగ్రెస్‌ను కాదని తన స్వార్ధం కోసం బిజేపిలో చేరి, మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరిన నాయకుడు జగ్గారెడ్డి. ఆయన కూడా నీతి గురించి, పార్టీ మార్పు గురించి రేవంత్‌రెడ్డిపై మాట్లాడడం విడ్డూరం. ఎలాగైనా రేవంత్‌ను దించేయాలి…

ఇదొక్కటే సీనియర్ల ఎజెండా! ఎందుకు? అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. సరే రేవంత్‌ను పక్కన పెడితే జనారెడ్డిని పిపిసి చేస్తే కాంగ్రెస్‌ గెలుస్తుందా? వెంకటరెడ్డిని చేస్తే అధికారంలోకి వస్తుందా? అంతో ఇంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో వున్న పుల్‌ మాస్‌ లీడర్‌ అంటే కనిపించే ఏకైక పేరు రేవంత్‌రెడ్డి. ఆయన వుండడం సీనియర్లకు ఇష్టం లేదు…ఎందుకంటే ఇంత కాలం ఆడిరది ఆట, పాడిరది పాటగా రాజకీయాలు చేసిన, సీనియర్లకు రేవంత్‌ గిట్టడం లేదు. మరి రేవంత్‌లాగా వాళ్లు పార్టీకి జోష్‌ నింపగలరా? అదీ లేదు. పొన్నాల లక్ష్మయ్య పిపిసిగా వున్నంత కాలం ఆయనతో కోమటిరెడ్డి సోదరులకు పడలేదు…ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వున్నంత కాలం అంతే…ఈ ఇద్దరు అన్నదమ్ములకు పడలేదు…ఇప్పుడు రేవంత్‌ రెడ్డి వారికి అసలే నచ్చలేదు. అంటే మేం తప్ప మరొకరు పార్టీలో వుండొద్దన్నంత హార్డ్‌కోర్‌ కాంగ్రెస్‌ నాయకులా అంటే అదీ లేదు…తమ్ముడి బీజేపి తీర్ధం పుచ్చకున్నాడు…అన్న ఎలా తీర్ధం పుచ్చుకునేది అని ఎదురు చూస్తున్నాడు…వీళ్ల కోసమా? పార్టీ మెట్లు దిగేది…వీళ్లకోసమా..పార్టీ ఆత్మాభిమానం చంపుకునేది…ఒక్కసారి ఆలోచించండి!! నాయకుల ఆటిట్యూడ్‌ మార్చుకోండి…తర్వాత మీరు మారండి…పార్టీ కాదు సుమీ…క్యారెక్టర్లు మార్చుకోండి…కలిసి కట్టుగా సాగండి!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *