ఓటు నీ ఆయుధం

దానిని అమ్మకానికి పెట్టకు…

నోటు కోసం ఎదురుచూడకు..

నోటు పట్టుకొచ్చేవాడిని చీకొట్టు…

ప్రలోభాలకు గురికాకు…

ఆగం‌ కాకు..

నిజాయితీ గా ఓటేసి గర్వపడు…

మనస్సాక్షి చెప్పిందే విను..

ఓటు పవిత్రమైనది…

మీ జీవితాలను మార్చేది.

ఒకనాడు ఎన్నికలంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఓటు వేసే సమయంలో మనస్సాక్షి, ఆత్మసాక్షితో వేసేవారు. కానీ ఇప్పుడు ప్రలోభాలకు గురై నాయకులు చెప్పిన మాటలకు తలొగ్గుతున్నారు. ఓటును అపహాస్యం చేస్తున్నారు. ఓటు ఎంతో పవిత్రమైనది. ఇప్పుడున్న కాలంలో నిస్వార్ధ నాయకులు లేరు. స్వార్థపరులు తప్ప నిజాయితీ పరులు కానరారు. ఈ డెబ్బై ఏళ్ల ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులను చెడగొడుతున్నారా? నాయకులు ప్రజలను ప్రలోభ పెట్టి ఎన్నికలలో గెలుస్తున్నారా? అన్న దానిపై ఎంత చర్చ జీడిపాకంలా సాగుతుందే తప్ప, ముగింపు గురించి ఆలోచించే వారు లేకపోతున్నారు. ఎన్నికలలో గెలిచి నాయకులు చేసేదేమీ లేదు. తమకు ఉపయోగపడేదేమీ లేదు. అందుకే ఓటుకు నోటు తీసుకుంటున్నామనేది కొందరి వాదన. ప్రజలు అడిగి మరీ తీసుకుంటుంటే పోటీ ప్రపంచంలో నోటు పంచక తప్పడం లేదంటున్నారు నాయకులు. ‌ఎవరు ఎవరికి ఈ జాఢ్యం అంటించారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ అపవాదును జనం మీదకు తోసేస్తున్నారు నాయకులు. ఓ ముప్పై ఏళ్ల క్రితం వరకు ఓటుకు నోటు పంచడం అన్నది లేదు. తెలియదు కూడా… అయితే అప్పుడు నాయకుడు కూడా ప్రజలకు పెద్దగా తెలియదు. పార్టీని చూసి ఓటు వేసేవారు. ఇప్పుడూ జనం అదే చేస్తున్నారు. కానీ నాయకుడు గురించి తెలుసుకుంటున్నారు. నాయకుడు ఎంత మంచివాడైనా నోటు పంచకపోతే ఓటు వేసే పరిస్థితి లేదు. అంతెందుకు తెలంగాణ ఉద్యమ కాలంలో సైతం నోటు పంచక తప్పని పరిస్థితి. ఇది ప్రజల బలహీనత అని మాత్రం అంటే తప్పవుతుంది. ప్రజలకు నాయకులే అలవాటు చేశారు. ఎన్నికలలో పోటీ నాయకులు ఖర్చు చేయాల్సిన దెంత? ఖర్చు చేస్తున్నదెంత? ప్రజలకిచ్చేవి లెక్కలోకి రాని ఖర్చు. గెలిచాక ఆ నాయకుడు సంపాదన అంతకు వందల రెట్లు. ఇది ప్రజలు గమనించడం లేదు. నోటు తీసుకున్నాక అడిగే హక్కు ఓటరు కోల్పోతున్నాడు. ఒకప్పుడు నాయకుడు ఎన్నికల సమయమైనా, మామూలు సమయమైనా ప్రజలంటే వంగి వంగి దండాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు జనం చేతనే దండాలు పెట్టించుకుంటున్నారు. దండలు వేయించుకుంటున్నారు. ఎన్నికలలో గెలిచాక దండం‌ పట్టుకొని వాయిస్తున్నారు. పన్నుల వడ్డింపులతో నడ్డి వాయగొడుతున్నారు. అయినా జనంలో మార్పు రావడం లేదు. ఎన్నికల నాడు జనానికి రూకలు పంచడం కోసం నాయకులు వ్యాపార మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రజాసేవ గాలికి వదిలేస్తున్నారు. అక్రమ సంపాదనకు ఎగబడుతున్నారు. గెలుపు గుర్రాలు కావడానికి చేయకూడని పనులన్నీ చేసి సంపాదిస్తున్నారు. ఎన్నికల నాడు మెతుకులు విదిల్చి ఓట్లు కొంటున్నారు. ప్రజలను ప్రలోభ పెట్టి, ఓటరు తనను తాను నిందించుకునే స్థితి తెచ్చిన నాయకుడి నోట నోటు అన్న పదం రానీయకుండా చేయండి. ఓటును కొనుక్కోవచ్చన్న దరిద్రపు ఆలోచన వున్న నాయకుడి భరతం పట్టండి. నోటు కాదు నగరం బాగు చేయండి అని చెప్పండి. ధరల మోత కాదు, సరసమైన ధరలుండేలా చూడమని నిలదీయండి. రోడ్లేయమని అడగండి. విద్య, వైద్యం ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేయండి. యువతకు ఉపాధి చూపించమని చెప్పండి. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ప్రభుత్వం ద్వారా సహకారం చేయమని సూచించండి. లేకపోతే నాయకుడి మాట నీళ్ల మూట అవుతుంది. డబ్బులు తీసుకొని ఓటేస్తే రాసిచ్చిన బాండ్ పేపర్లకు కూడా విలువుండదు. ఎన్నికల సమయంలో అలా రాసిచ్చే తప్పుడు వాగ్థానాలకు చట్ట బద్దత వుండదు. నైతికత అన్నది రాజకీయాలలో ఏనాడో కనుమరుగైంది. నీతి, న్యాయం మాటలకే పరిమితమైంది. అవినీతి రాజ్యమేలుతోంది. పేదోడి జీవితంతో రాజకీయం ఆటాడుకుంటోంది. అది మారాలి. సమాజంలో మార్పు రావాలి. అందుకు ముందు ఓటరు మారాలి. నోటు పట్టుకొని వచ్చి ఓటు కొనజూచిన వాళ్లను చెప్పుతో కొట్టాలి. ఆ పార్టీ ఇవ్వలేదు, ఈ పార్టీ ఇవ్వలేదని లెక్కలేసుకునేవి కాదు ఎన్నికలు. ప్రజల తలరాత మార్చేవి ఎన్నికలు. ప్రజా పరిపాలనలో ప్రజలు అమ్ముడుపోవద్దు. నాయకుడికి ఓటును కొనుగోలు చేసే అవకాశం ఇవ్వొద్దు. మనల్ని పాలిచేందుకు ముందుకొచ్చిన వారిలో మంచి నేతను ఎన్నుకునేందుకు ఓటు ఒక మార్గం. ఆ మార్గంలో అనేక ప్రలోభాలుంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. ఏయే పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న నాయకులు ఎలాంటివారు? వారి పరిస్ధితి ఏమిటి? వారు ఎంత వరకు మేలు చేయగలరు? ఎవరు ఎంత స్వార్ధపరులు.. ..నిస్వార్ధపరులు. ఎంతోకాలం నుంచి రాజకీయల్లో ఉన్నవారు ఎవరు? ఇంత కాలం ఏంచేశారు. ఎవరు ఎక్కవకాలం సామాజిక సేవ చేస్తున్నారు. ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసినవారు ఎవరు? ఇలా అన్ని రకాల విషయాలు పరిగణలోకి తీసుకొని ఓటు వేయడం అన్నది ప్రతి ఓటరు విధి. నాకు వీలు కాలేదు..నేను వెళ్లలేదు?

ఇలాంటి మాటలు చెప్పకండి. మరీ ఇబ్బంది పడి వెళ్లలేని పరిస్ధితి ఉన్నవారు తప్ప ఓటు వేయడానికి అనుకూలంగా,ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. ఎంత దూరంలో ఉన్నా వెళ్లి ఓటు వేయండి. అంతే కాదు మంచో చెడో గాని ఆయా గ్రామాలలో ఓటు ఉండి, దూరం ఉన్న వారిని పార్టీలు కూడా రప్పించేందుకు సహకరిస్తాయి. కనీసం అలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఒక్క పూట పనిపోతే, నష్టపోయేదేమీ ఉండదు. కాని ఆ ఒక్క రోజు సమాజం మీద ఎంతో ప్రభావం చూపే రోజు కూడా. ప్రజల తలరాతల్ని మార్చే రోజు కూడా…అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా విద్యావంతులు ఓటు హక్కుపై ప్రజలకు అవాహన కల్పించాలి. కొందరు మేధావులు ప్రజలకు చైతన్యం నేర్పేవారు కూడా ఓటు వేయని వారు వున్నారు. ఓటు వేయం అనడం నైతికత కాదు. ఓటు వేయొద్దని చెప్పడం నేరం. అయితే సమాజంలో కొన్ని వ్యవస్ధలు ఓటును భహిష్కరించడం వంటివి చేసేవారు. అది కూడా నిరసనలో ఒక భాగమన్న మాట చెప్పేవారు. కాని అది సరైంది కాదు. అందుకే ఎన్నికల సంఘం నోటా కూడా తెచ్చింది. దాంతో ఓటును భహిష్కరించడం తగదు. ఎవరూ నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి కూడా మార్గం వుంది. అందువల్ల ఓటు వేయండి. నిత్యం సోషల్‌ మీడియాలో సమాజం గురించి, దేశం గురించి చెప్పేవాళ్లు కూడా చాల మంది ఓటు వేయరు. నిజానికి వాళ్లే ముందు ఓటు వేయాలి. ఇక మరి కొందరు పెద్ద క్యూలైన్‌ వుందని, తర్వాత చూద్దామంటారు. ఆఖరుకు ఓటు వేసే సమయం పూర్తయ్యాక బయలుదేరుతుంటారు. ఓటు వేయకుండనే వెనక్కి వస్తుంటారు. మరి కొందరు తమ పోలీంగ్‌ బూత్‌ను ఎక్కడో అర్ధం కావడం లేదని తిరిగి వచ్చేవారు వున్నారు. ఇలా రకరకాల కారణాలతో ఓటు వేయకుండా వుండేవాళ్లు కూడా సమజంలో సగం మంది వుంటున్నారు. అందుకే నూటికి నూరు శాతం కాకపోయినా, కనీసం 90శాతం ఓటింగ్‌ కావాలి. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఎక్కడా మొత్తం ఓటింగ్‌ అయిన దాఖలాలు లేవు. కనీసం 70శాతం కూడా ఓటింగ్‌ నమోదు కాని సందర్భాలు అనేకం వున్నాయి. కొన్ని సార్లు మరీ ఘోరం. కనీసం 50శాతం కూడా పోలింగ్‌ కాని రోజులున్నాయి. ముపై ఐదుశాతం దాటని ఎన్నికలు కూడ వున్నాయి. ఇలాంటి పరిస్ధితులు వుంటాయని రాజ్యాంగ పెద్దలు ఊహించి వుండరు. అవగాహన లేకనో, అర్ధం కాకనో, ఓటు వేయడానికి రాని వారుంటారేమోగాని, ఓటు వేయడానికి బద్దకించి రాని వారు వుంటారని మన పెద్దలు అనుకోని వుండరు. ఈ తరం కన్నా…గత తరమే మిన్న గత ఇరవై ఏళ్ల క్రితం ఓటు పోతే, ఎన్నికల సంఘం తయారు చేసిన ఓటరు లిస్టులో పేరు లేకుంటే నానా హంగామా చేసేవారు. ఓటు లేకపోతే పోయినట్లే అని అనుకునేవారు. అంతగా ఓటును పవిత్రంగా చూసుకునేవారు. ఇప్పుడు ఓటు ఉండాలి. అంత వరకే. ఓటు వేయడానికి మాత్రం రావడానికి ఇష్టపడరు. ఆ రోజు సెలవైనా రారు. ఒక్కరోజు సెలవు దొరికిందని ఎంజాయ్‌ చేసే రకాలు కూడా ఉన్నారు. ఇక ఐటి రంగం పెరిగిన తర్వాత ఓటు అంటే మరీ లెక్కలేకుండా పోయింది. ఉద్యోగానికి మాత్రం ఓటరు కార్డు కావాలి. కాని ఓటు వేయడానికి మాత్రం రారు. ఇప్పటికీ ఓటు ఒక వేళ గళ్లంతైతే ఆగం చేసేది నిన్నటి తరమే కాని, నేటి తరం ఓటు వుందా? లేదా? గల్లంతైందా? ఎందుకైంది? అని కూడా చూసుకునే తీరిక లేదు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టు. ఓటును అందరూ పొందాలి. అందరూ ఓటు వేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మరింత ఫరిడమిల్లుతుంది. ప్రపంచంలోనే మనది అత్యంత పెద్ద రాజ్యాంగం. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం. 

 అందరికీ ఓటు కొట్లాడి సాధించుకున్నది

మనం ఈ తరంలో తెలంగాణ ఎలాగైతే కొట్లాడి సాధించుకున్నామో…అలాగే రాజ్యాంగ రచన కాలంలో, మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో బాబా సాహెబ్‌ అంబెద్కర్‌ కొట్లాడి మరీ సాధించిందే ఓటు. ఓటు ఎలా ఉండాలన్నదానిపై నాడు పెద్దఎత్తున చర్చ జరిగింది. చాలా వరకు సంపన్నులకు ఓటు ఉంటే చాలన్నారు. పురుషుల కు ఓటు ఉండాలన్నారు. కాని ఒక్క బాబాసాహెబ్‌ అంబెద్కర్‌ మాత్రమే అందరికీ ఓటు హక్కు వుండాలన్నారు. ధనిక, పేద, కులం, మతం, మగ, ఆడ అన్న తేడా లేకుండా యుక్త వయసు వచ్చిన ప్రతి ఒక్కరికీ, మన దేశంలో నివసిస్తున్న వారందరకీ ఓటుహక్కు ఉండాలని పట్టుపట్టి ఓటు హక్కు కల్పించారు. స్వేచ్ఛాయుత సమాజ నిర్మాణం గావించారు. సమాజంలో పాలన అందరి సొందరి సొత్తన్నాడు. అందరూ పాలనలో పాలు పంచుకోవాలన్నారు. బలహీన వర్గాలు పాలనలో పాలు పంచుకోవాలన్నారు. సమాజానికి దగ్గరగా వున్నా, మను షులకు, వారి మనసులకు దూరంగా వున్న వారు కూడా పాలనలో భాగస్వామ్యం కావాలని రిజర్వుడు స్ధానాలు కల్పించాడు. ఎస్సీ, ఎస్టీలను చట్టసభలకు పంపేందుకు మార్గం వేశాడు. సమజాంలో అధికంగా వున్న బలహీన వర్గాల ప్రాతినిధ్యం, ప్రాదాన్యం వుండాలని బలంగా కోరుకున్నాడు. నిండైన రాజ్యాంగాన్ని నిర్మించాడు. మనకు వరంగా ప్రసాదించాడు. ఆ రాజ్యంగఫలాలు అందరూ అందుకోవాలి. రాజకీయ పాలనా పరమైన ప్రజాస్వామ్య విధానంలో అందరూ భాగస్వామ్యం కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *