ఆటంకాలకు ఆంతమేనా..?

` సీనియర్లు నోరు మూసుకున్నట్లేనా?
` పీసీసీ ఛీఫ్‌ చెప్పినట్లు ఇకనైనా వింటారా?
` నాలుగు రోజులాగి మళ్ళీ మొదలుపెడతారా?
` మేము, మా అంతర్గత ప్రజాస్వామ్యం ఇంతేనంటారా?
` కలిసి సాగుతారా.. గెంటేస్తే పోదామకుంటున్నారా?
` టి-టెన్‌ కాషాయదారులౌతారట నిజమే.. నా!?
` మార్పు మంచిదే అనుకుంటున్నారా!
` పద్ధతి మార్చుకుంటారా..పార్టీ మారుతారా!?
` కార్యకర్తలు చీదరించుకుంటున్నారు…కనిపిస్తోందా!
` కాంగ్రెస్‌లో సీనియర్ల కల్లోలం

 

హైదరాబాద్‌ ,నేటిధాత్రి: కార్యకర్తలు ఛీ..ఛీ అంటున్నారు వినవడుతుందా? ఛీదరించుకుంటున్నారు…కనబడుతోందా? మీరు మారరు అని జనం తిట్టుకుంటున్నారు…కనీసం అదైనా తెలుస్తోందా? మారండి బాబు అంటూ కార్యకర్తలు కోరుతున్నారు…వేడుకుంటున్నారు…కాళ్లా, వేళ్లా పడి బ్రతిమిలాడుకుంటున్నారు. అయినా కనికరించలేరా? పార్టీ కోసం త్యాగాలు చేయలేరా? కొంత కాలం నోరు కట్టేసుకోలేరా?… లేదా…మాదారి మాదే… మా మాట మాదే…మా తీరంతే…మా వ్యవహారంతా ఇంతే అంటారా? సొంత పార్టీలో కవ్వింపులు ఆపుతారా? ఆరోపణలు తగ్గిస్తారా? అన్నది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి వాదుల అడుగులను నిశితంగా గమనిస్తున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క…ఇకపై ఒక లెక్క అన్నట్లు హై కమాండ్‌ ఓ ఆర్డరైతే పాస్‌ చేసింది. కాని అవి అసమ్మతి నేతలకు చెవిక్కుతుందా? అసమ్మతి రాగాల ముందు ఏ సూక్తులు పనిచేయవని మళ్లీ, మళ్లీ మైకుల ముందు రెచ్చిపోతారా? హోటళ్లలో సమావేశాలు పెట్టకుండా వుంటారా? రేవంత్‌ పిపిసి కావడానికి ముందు నుంచే ఈ నిత్య అసమ్మతి వాదుల అంతర్గత ప్రజాస్వామ్యం మరింత పెంచుకున్నారు.
ఈ సెగ ఇప్పటిది కాదు?: నిజానికి దుబ్బాక ఉప ఎన్నికలకు ముందే పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ అన్నారు. సీనియర్లు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాకుండానే చేసుకున్నారు. హుజూర్‌ నగర్‌ ఎన్నికల సమయానికి అప్పటికే వర్కింగ్‌ ప్రెసిడెంటుగా వున్న రేవంత్‌ ఏదో తెలిసో తెలియకో సమిష్టి నిర్ణయం వుంటుందన్నారు. ఆ రోజుల్లోనే అందరూ గయ్యిమని ఆయనపై ఒంటికాలుపై లేచారు. ఉత్తమ్‌ పద్మావతిని నిలబెట్టి మళ్లీ ఓడిపోయారు. కనీసం నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సమయంలోనే ఇక రేవంత్‌కే పగ్గాలన్న ప్రచారం మళ్లీ జరిగింది. ఇదంతా కొంత కాలం కాంగ్రెస్‌లో రెడ్డొచ్చే కథ మొదలాయే! అన్నట్లు సాగింది. ఆఖరుకు నాగార్జున సాగర్‌ నుంచి పోటీ చేసిన జానారెడ్డి అధిష్టానానికి లేఖరాసి, కొంత కాలం పిసిసి కొత్త కార్యవర్గం ఆపాలని సూచించారు. కారణం నాగార్జున సాగర్‌లో గెలవడం, పిసిపి పగ్గాలు తీసుకోవడం తరువాయి అన్నంత దురాలోచన చేశారు. ఏమైంది…బొమ్మ బొరుసైంది. సీనియర్‌ నేతను, తెలంగాణ వస్తే ముఖ్యమంత్రిని నేనే అని ఒకప్పుడన్నాడు. ఆఖరుకు తెలంగాణ ఇచ్చిన పార్టీలో స్టార్‌ వాల్‌ వంటి నాయకుడు ఓడిపోయాడు. ఇదే నేత గతంలో తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశాడు. కాని తెలంగాణ వచ్చాక గెలవడానికి ఆపసోపాలు పడ్డాడు. రెండుసార్లు వరసగా ఓడిపోయాడు.
నేనున్నా…నేనే సిఎం?: ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని నేనే అని జానారెడ్డి అంటారు. నేను కూడా రేస్‌లో వుంటానంటాడు. అందుకే కాంగ్రెస్‌ గురించి ఆలోచించడానికి ప్రజలు కూడా తీరక చేసుకోవడంలేదు. కాకపోతే పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అయ్యాడు. వద్దు వద్దంటుంటే పార్టీ ఎలా మా మాట కాదని రేవంత్‌ను తెచ్చిపెట్టారన్న కోపం కొంత మంది పెంచుకున్నారు. మాకంటే రేవంత్‌ పెద్ద నాయకుడా? అన్న అహం వారిలో నరనరం నిండిపోయింది. రేవంత్‌ పేరెత్తితే చాలు గయ్యిన మీడియా మీదకు కూడ లేవడం జరిగింది. కాని తాజాగా పరిణామాలతో సీనియర్లు దిక్కుతోచని పరిస్ధితిలో పడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే కుడితిలో పడ్డారు. నోరు తెరవలేరు. మూసుకొని వుండలేదు…
చెక్‌: రెక్కలు కర్తిరిస్తే గాని వినేలా లేరన్న సంగతి తెలుసుకొని కాంగ్రెస్‌పార్టీ జగ్గారెడ్డికి చెక్‌ పెట్టినంత పనిచేశారు. నిజానికి అలాంటి నేతలకే ముందు చుక్కలు చూపిస్తే తప్ప, మిగతావాళ్లు వినరు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా జ్ఞానోదయం అయ్యిందనే అనుకోవాలి. కాంగ్రెస్‌నేతలు గతం నుంచి ఇంకా బైటకు రావడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ముందు రోజులు కావు. అప్పటి పరిస్ధితులు నేడు లేవన్న సంగతి మర్చిపోతున్నారు. అప్పుడంటే ఎటు చూసినా కాంగ్రెస్‌ పార్టీయే వుండేది. ఎన్ని చీలికలు వచ్చినా అదే నాయకులు కనిపించేది. కాని ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. ప్రాంతీయ పార్టీలతో సమానమైపోయింది. ఆ స్వయం కృతాపరాధం ఇంకా మానుకోవడం లేదు. అదే పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది.


క్లారిటీ లేని సీనియర్లు?: ఇంతకీ సీనియర్లకు ఏం కావాలన్న దానిపై క్లారిటీ లేదు. ఎవరికి ఎవరికి సఖ్యత లేదు. ఐక్యత వారిలో ఎప్పుడూ లేదు. ఇప్పుడే సడెన్‌గా తెరమీదకు వచ్చింది. సహజంగా అసంతృప్తి అన్నది కాంగ్రెస్‌లో సహజం. కాకపోతే ఈసారి మాత్రం గతంలోకన్నా ఎక్కువగానే వుంది. కారణం పిపిసి. అధ్యక్షుడు మిగతావారికన్నా జూనియర్‌ కావడం. ఆయన ఏం చేస్తున్నారన్నది ఎవరికీ చెప్పకపోవడం. అంతే ఇంతకన్నా ఏమీ లేదు.
తన సహజదోరణిలో రేవంత్‌?: ఒక ఆశయంతో ముందుకు సాగేవారు ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొంటారు. కాని వారేం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అన్నది మాత్రం ఎవరి చెప్పరు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బైట పడరు. పైకి చాలా కూల్‌గా వుంటారు. సరిగ్గా ఇప్పుడు రేవంత్‌ రెడ్డికూడా అదే అనుసరిస్తున్నాడు. ఈ మొండి పట్టుదలలో పదవిపోయినా పోతుంది. కాని తన లక్ష్య సాధనలో వెనక్కి తిరిగిచూసుకోవద్దన్న కసితో ముందుకు సాగతున్నారు. అది అర్ధం చేసుకోలేని సీనియర్లు తెల్లారి లేస్తే రేవంత్‌ది ఒంటెద్దు పోకడ. ఏం చేయాలనుకుంటున్నాడో మాకు చెప్పడం లేదు. మా సూచనలు తీసుకోవడంలేదు. మా జిల్లాకు వచ్చినా మాకు సమాచారం లేదు. ప్రతీది మీడియాకు చెప్పి చేయడం కాంగ్రెస్‌ పార్టీలో గతంలో లేదు..! ఇవన్నీ సీనియర్ల కోపానికి, అలకలకు కారణం. కాలం మారింది. తరం మారింది. ఇప్పుడు సోషల్‌ మీడియా యుగం. ప్రతి వ్యక్తిచేతిలో ప్రపంచం వుంది. దాన్ని రెప్ప వాల్చకుండా చూస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది. గతంలోగా మంత్రాల బలం ఇప్పుడు అవసరం లేదు. తుప్పిళ్ల బలమే చాలు…ఏం చేయకపోయినా చేస్తున్నట్లు ప్రచారం కావాలి. అదే రేవంత్‌ చేస్తున్నాడు. సీనియర్ల కోసం ఎదరుచూస్తూ రోజులు గడపలేడు. వారి ఆశీస్సుల కోసమే సమయం వెచ్చించలేడు. నిత్యం వారి భజన చేస్తూ కూర్చుంటే పార్టీ సాగదు. ఆయన కోరిక నెరవేరదు. ఇప్పుడు గేలిచేసినోళ్లేతోనే కాలం కలిసొస్తే జేజేలు కొట్టొచ్చు. అందుకే సీనియర్లపై ఒక్క మాట ఆయన మాట్లాడడం లేదు. కాని ఇతరులతో మాట్లాడిస్తున్నాడా? లేదా అన్నది కూడా ఆయనకు తెలుసు? కాళ్లలో కట్టెలు పెట్టేవాడున్నప్పుడు ఎలా తప్పించుకొని వెళ్లాలో తెలుస్తుంది. వారిని దూరం పెట్టే అవకాశం కూడా దొరుకుతుంది. ఇదే రేవంత్‌ సరిగ్గా అమలు పర్చుతున్నాడు. సీనియర్లను అధిష్టానం ముందు దోషులను చేశాడు…ఇక్కడ మాత్రం ఎంతో కొంత తలనొప్పిని తగ్గించుకున్నాడు…చే జేతులా తమకు తాము పార్టీకి దూరమయ్యే అవకాశం రేవంత్‌కు ఇస్తున్నామన్న ఆలోచన మాత్రం సీనియర్లు చేయడం లేదు. ఇదే రేవంత్‌ బలం…వారికి అర్ధంకాని రాజకీయం…మరి రేపు..రేపు ఎలా వుంటుందో చూడాలి..!!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *