అధికారులే కారుకు పోటీదారులు?


అవకాశమిస్తే కారెక్కుతాం?
కాదంటే చేయందుకుంటాం?


అక్కడా హాండిస్తే…పువ్వుతో దోస్తీ చేస్తాం?
ఎనుగైనా సరే…చీపురిచ్చినా సరే…?
ఎప్పుడంటే అప్పుడు పోటీకి రెడీ?
మరి ఇంత సంపాదన అధికారులకు ఎక్కడినుంచి వచ్చింది?
ఉద్యోగులు కోట్లెలా కూడేసుకున్నారు?
ఎన్నికలంటే ఉత్త మాట…కోట్ల మూటలు కావాలి?
ఎవరిని ముంచితే వచ్చాయి…ఎంత మంది పొట్టగొడితే అన్ని కోట్లు కూడాయి?
ఇలాంటి అధికారులను ప్రోత్సహించింది ఎవరు?
ఇప్పుడు తలలు పట్టుకుంటుందెవరు?
ప్రతిపక్షాలకు సహకరిస్తూ, అధికార పార్టీని తిప్పలు పెడుతున్న అధికారులెవరు?
అవినీతి అధికారులను ఉపేక్షిస్తున్నదెవరు?
ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నదెవరు?
అధికారుల ఆగడాలే కోట్లు కూడబెట్టుకునేందుకు వేసుకున్న దారులు?
టిఆర్‌ఎస్‌పై కూడా పోటీకి రెడీ అంటున్నారు?


పెంచి పోషిస్తే కొట్లాటకు సై అంటున్నారు?
తెలంగాణలో కొంత అధికారులు ప్రజా ప్రతినిధులు చెప్పినట్లు వినడం లేదు. వారు చెప్పిన పని చేయడం లేదు. వారు ఏ పని చెప్పినా సరే అంటున్నారు? కాని చేయడంలేదు. గట్టిగా చెప్పలేక, పరువు అనుచరుల ముందు పరువు పోగొట్టుకోలేక టిఆర్‌ఎస్‌కు చెందిన ఎంతో మంది నాయకులు లోలోన కుమిలిపోతున్నారు. మాట చెల్లుబాటు కానంత పరిస్ధితి ఎందుకొచ్చిందని మధనపడుతున్నారు. ప్రెండ్లీ ఉద్యోగులు అంటే పని చేయమని కాని, విచ్చలవిడి తనానికి పరాకాష్ట కాదు. ఏ ప్రెండ్లీ గవర్నమెంటు అని టిఆర్‌ఎస్‌ పెద్దలు అనుకున్నారో అదే ఇప్పుడు వారికి రివర్స్‌ అవుతోంది. ఎక్కడా అధికారులు టిఆర్‌ఎస్‌ పెద్దలు చెబుతున్న మాట వినడం లేదు. నిత్యం పుంఖాను పుంఖాలుగా అవినీతికి పాల్పడిన అధికారుల బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ శాఖలో చూసినా ఇదే తంతు..? ఎవరిని కదిలించినా మా శాఖలోనే జరుగుతుందా…ఫలానా శాఖలో జరిగినంత జరుగుతుందా? అని ఎదరు ప్రశ్నిస్తున్నారే గాని, మానుకుంటామని అనడంలేదు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన అధికారులే మీడియా మీద విరుచుకుపడుతున్న సందర్భాలు చూస్తున్నాం.
నాయకత్వం బలహీనులైనప్పుడే అధికారులు దోపిడీ పరాకాష్టకు చేరుకుంటుంది. విచ్చలవిడి తనాన్ని పెంచుతుంది. గతంలో రాజు లోలుడో, లాలస పరుడో, చేతగాని వాడో అయితే అధికారులు తమ ఇష్టారాజ్యం చేసేవారని చరిత్ర చదువుకున్నవారికి తెలుసు. ఇప్పుడూ అదే జరుగుతోందని చెప్పడానికి అనేక సాక్ష్యాలున్నాయి. తెలంగాణలో కనీసం రోజుకు ఒక్కటైనా అవినీతి అధికారి పట్టుబడిన వార్త రాకుండా వుండడం లేదు. జనాన్ని జలగల్లా పీల్చుకుంటుంటుంటే పాలకులు పట్టించుకోకపోతే, వారితో కొందరు నాయకులు కుమ్మక్కైతే పరిస్ధితి ఇలాగే వుంటుంది. కాని అంతిమంగా ప్రభుత్వానికి, అధికార పార్టీకి చెడ్డపేరు వస్తుంది. రాష్ట్రంలో అవినీతి అధికారుల మూలంగా, ప్రభుత్వం అపవాదుల పాలౌతోందని సాక్ష్యాత్తు రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్‌ మధనపడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ జరుగుతుందో ఇప్పటికైనా గుర్తించకపోతే, జనాన్ని పీడిరచుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోకపోతే పార్టీకే తీరని నష్టం. ఇక అధికారులు బాధితుల్లో టిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు కూడా వుంటే, ఇక పార్టీని కాపాడేదెవరు? ఇలా అడ్డగోలు సంపాదనతో రేపటి తరం రాజకీయాల్లో కలుషితం చేసేందుకు నాయకుల అవతారాలెత్తేందుకు కొందరు అధికారులు ప్రజల ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో అనేక మంది ఉన్నత స్ధాయి ఉద్యోగులు నోట నుంచి వస్తున్న మాట. ఇప్పటికే కొంత మంది తమ మాటల ద్వారా తమ మనసులో ఆలోచనలు బైట పెట్టుకున్న మాట. కొందరు ప్రజా సేవ పేరుతో ప్రచారం విసృతం చేసుకుంటున్నారు. ఫలాన జిల్లాలో ఫలాన అధికారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్న విషయాలపైనే చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ అంటే కొంత మంది అధికారులు మేం రెడీ అంటున్నారట. ఇది కొన్ని దశాబ్ధాలుగా రాజకీయాలు చేస్తున్నవాళ్లు, ప్రజా ప్రతినిధులుగా వున్న వారు కూడా ఆశ్చర్యపోతున్నారట. గతంలో రాజకీయాల్లో ఎదగాలంటే గ్రామీణ స్ధాయి నుంచి కార్యకర్తగా, నాయకుడిగా ఒక్కొ మెట్టు ఎక్కుతూ పైకొచ్చేవారు. ఇప్పుడు అదేమీ అవసరం లేదు. గెలుపు గుర్రాల పేరిట కోట్లు ఖర్చు చేసే శక్తి వుంటే చాలు…అంతకు మించి క్లారిటీ అవసరం లేదు. పార్టీ కోసం వారి త్యాగమెంత? అవసరం లేదు. జనానికి డబ్బు పంచాలి. ఓట్లు కొనుగోలు చేసే శక్తి వుండాలి. రియలెస్టేట్‌ చేసి సంపాదించిన వాళ్లు కూడా కష్ట పడి పైసా పైసా కూడేసుకొని, తినీ తినక, దాచుకున్న సొమ్ము రాజకీయాలపేరుతో ఖర్చు చేయడానికి వెనకాడుతున్నారు. కాని కొందరు ఉన్నతాధికారులు మాత్రం ఎంత ఖర్చుకైనా మేం రెడీ అంటున్నారట. గతంలో ఓసారి తటస్థులను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అప్పుడు మా వల్ల కాదన్నారు. అప్పుడు అంతా మేం చూసుకుంటామని పార్టీలు భరోసా ఇచ్చి తీసుకొచ్చారు. కాని ఇప్పుడు తటస్థుల కోటలో సీటు సంపాదించుకొని నాయకులకు కావాలనుకుంటున్నవారు. పార్టీని పోషించేందుకు కూడా ముందుకొస్తున్నారు.
తెలంగాణలో ప్రజా చైతన్యం ఎంత వున్నా, చాలా మందిలో రాజకీయాలపై ఆసక్తి పెద్దగా వుండేది కాదు. కాని ఇప్పుడు అన్ని వర్గాలలో పదవీ వ్యామోహం, కాంక్షలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. నాయకుల హవా, హోదా కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకే అధికారులు కొందరు ఆ దారి వెతుక్కుంటున్నారట. అయితే కారెక్కుతాం…ఇస్తామంటే టిక్కెట్టు తీసుకుంటాం…ఎన్నికల్లో పోటీ చేస్తాం… ఎంత ఖర్చైనా పెట్టుకుంటాం… అంటున్నారట. ఒక వేళ కారులో చోటు లేదని చెబితే చేయ్యి పార్టీకి హస్తం అందిస్తాం. ఆ టిక్కెట్టు అయినా సరే పోటీ చేస్తాం. అక్కడా కూడా హండిచ్చే పరిస్ధితి వస్తే, పువ్వుతో దోస్తీకి కూడా రెడీ అంటున్నారట. వాళ్లకు కావాల్సింది పదవి. ఉద్యోగం లేని నాడు నాలుగు మెతుకుల కోసం ఆరాటం. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత సంపాదనతో రాజకీయాలపై ఉభలాటం. పదవులపై పెంచుకుంటున్న మమకారం. రాజకీయాలపై పెంచుకుంటున్న ఇష్టం. కష్టపడకుండా అందిన కాడికి దోచుకొని దాచుకున్న సొమ్ముతో, విశ్రాంతి కాలమంతా కాలుమీద కాలేసుకొని, పెత్తనం చేయాలి. పెద్ద మనిషిగా చెలామణి కావాలి.అంటే రాజకీయాల్లో చేరాలి. పదవులు సంపాదించాలి.
మేమేం…తక్కువ…మాకేం తక్కువ. మేం మీ మాట వినాలా? వినకపోతే ఏం చేస్తారు? మహా అయితే ఉద్యోగం పీకేస్తారు? అంతకన్నా ఏం చేస్తారు? పోతే పోయింది ఉద్యోగం. ఇప్పటిదాకా సంపాదించింది మస్తుంది. రాజకీయాల్లోకి అవకాశాల కోసం చూస్తున్నామని చెబుతున్న వాళ్లు ఎంతో మంది వున్నారు. అందులో గ్రూప్‌ వన్‌ క్యాడర్‌తోపాటు, పై స్ధాయి అధికారుల్లో ఇలాంటి వారు వచ్చే ఎన్నికల్లో చాలా మంది ప్రజల ముందకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బాగా చదివి ఉద్యోగం సంపాదించుకోవాలి. లైఫ్‌ సెటిల్‌ చేసుకోవాలి. ఇది యువత ఆలోచన. ఉద్యోగంలో చేరాక…బాగా సంపాదించుకోవాలి. దండిగా వెనకేసుకోవాలి. ఇది కొందరి ఆచరణ. రిటైర్డ్‌ అయ్యే లోపు అందరికన్నా సంపన్నుడైపోవాలి. పదవీ విరమణ ముందే అవకాశం వచ్చినా, తర్వాతైనా వెంటనే రాజకీయల్లో చేరిపోవాలి. అందుకు ఓ ఐదేళ్ల ముందునుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. ఊరు మరిచి దశాబ్ధాలు గడిచినా, మళ్లీ పల్లె బాట పట్టాలి. ఊరులో వున్న సంతోషం ఎక్కడా లేదనాలి. ఊరు ప్రజలతో మమేకం కావాలి. ఊరందరి నోట్లో నాలుక కావాలి. ఎప్పుడంటే అప్పుడు ఊరికి పోవాలి. వెళ్లిన ప్రతీసారి ఓ పది మందికి నాలుగు రూపాయలు ఖర్చు చేయాలి. సేవ చేస్తున్నట్లు కనిపించాలి. ఊరి వాళ్లెవరైనా అనారోగ్య సమస్యతో వస్తే ఆసుపత్రి వర్గాలతో మాట్లాడాలి. ఓ రెండు రూపాయలు తక్కువ చేయించాలి. సారు గొప్పోడనిపించుకోవాలి. తమ నియోజకవర్గ పరిధిలో శుభకార్యాలకు హజరు కావాలి. వారికి దగ్గరవ్వాలి. ఆపద సమయాల్లో చేయూతనిందించాలి. వారికి దేవుడిలా కనిపించాలి. పేద వాళ్ల పెళ్లికి పుస్తె మట్టెలు చేయించి, అనుచరులతో అందిస్తుండాలి. సార్‌ శాన మంచోడనిపించుకోవాలి. వాళ్ల నోటితోనే చేత జై కొట్టించుకోవాలి. ఆయన గురించే పది మాట్లాడుకునేలా చేయాలి. జేజేలు పలించుకోవాలి. ఇప్పుడే ఇంత సేవ చేస్తున్నాడంటే, ఎమ్మెల్యే అయితే మస్తు సేవ చేస్తాడనిపించుకోవాలి. ఆఖరుకు టిక్కెట్టు ఇచ్చేందుకు నినాదాలు చేయించుకునేంత అనుచర గణం తయారు చేసుకోవాలి. వారి మంచి చెడులు చూసుకుంటుండాలి. ఖర్చులు భరిస్తుండాలి. ఇది కొంత మంది అధికారులు వచ్చే ఎన్నికల కోసం వేస్తున్న అడుగులు…ఎత్తు గడలు…
జనానికి పప్పు బెల్లాల్లా సాయం పేరుతో సంపద పంచుతూ జేజేలు కొట్టించుకుంకున్న అధికారులకు ఇంత సంపాదన ఎక్కడినుంచి వచ్చింది? ఇది మాత్రం ఎవరికీ అక్కర్లేదు. ఎంత మంది రక్తం తాగి సంపాదించి, అందులో కొంత సాయం పేరుతో స్వార్ధం చూసుకుంటుంటే ఎవరు గుర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *