ఆధిపత్య రాజకీయాలు!

` పొటేళ్ల పోట్లాట

` తెలంగాణలో రెండు పార్టీలు.

`ఎదురులేకుండా చూసుకునేందుకు టిఆర్‌ఎస్‌.

`కలబడి నిలబడతామని బిజేపి.

`ఎక్కడున్నదో తెలియని కాంగ్రెస్‌.

`ఐటి, ఈడి దాడులతో టిఆర్‌ఎస్‌ లో గందరగోళం.

`ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో బిజేపిలో కలవరం.

`ఆసక్తిగా గమనిస్తున్న విశ్లేషకులు.

` రాష్ట్రంలో బిజేపి రాకుండా టిఆర్‌ఎస్‌ కు ఎర్రసైన్యం తోడు.

`బిజేపి ఒంటరిపోరు.

`బెదిరించి లొంగదీసుకునే ఎత్తులో బిజేపి.

`ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం సాహేతుకం కాదు.

`ఎన్నికలలో గెలిస్తే అది నిజమైన విజయం.

`లోపాలు ఎత్తి చూసుకోవడం గొంగడిలో భోజనం చేయడమే.

` ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది అంతుచిక్కని వైనం.

`ఈ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయో అన్నది ఆసక్తికరం.

 హైదరాబద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష బిజేపి లు పొటేళ్ల పోట్లాటలా రాజకీయాలలో నువ్వా, నేనా అనే దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం వుంది. అయినా ఇప్పటికే రాజకీయాలు రంజుగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే గత రెండేళ్లగా పోట్లాట సాగుతూనే వుంది. అసలు గత ఎన్నికలలో బిజేపి గెల్చిన సీటు ఒక్కటి. దానిని అక్కడికే పరిమితం చేయాల్సి వుండేది. కానీ టిఆర్‌ఎస్‌ పార్టీ చేసిన రాజకీయ తప్పిదం మూలంగా బిజేపి ఎదిగింది. బిజేపికి తెలంగాణలో ఎలాంటి సీన్‌ వుండదన్న అతి నమ్మకం చేసిన మోసమే ఇది. టిఆర్‌ఎస్‌ కు ఎప్పటికైనా కాంగ్రెస్‌ తో తిప్పలనుకున్నారే గాని, బిజేపితో ఎదురౌతుందని టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా ఊహించలేకపోయారు. బిజేపితో భవిష్యత్తులో పేచీ వస్తుందని కూడా అనుకోలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయి సహకారం అందించింది. కాని బిజేపి దానిని నిలుపుకోలేదు. పైగా తాము బలడుతున్నామన్న భావన బిజేపిలో కూడా బలపడిరది. ప్రజలు తమ మాటలు కూడా విశ్వసిస్తున్నారని తెలిసిపోయింది. దాంతో జిహెచ్‌ఎంసి. ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్నది. ఇదొక్కటే బిజేపి సొంతంగా సాధించుకున్న విజయమని చెప్పొచ్చు. దుబ్బాక రూపంలో మరోసారి బిజేపి కలిసొచ్చింది. రఘునందన్‌ రావు గెలుపు ఆ పార్టీకి వరమైంది. నిజానికి అది కేవలం రఘునందన్‌ రావు గెలుపు మాత్రమే. అయినా దానిని బిజేపి తన ఖాతాలో వేసుకున్నది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో బిజేపిలో మరింత జోష్‌ పెరిగింది. ఈ రెండు ఉప ఎన్నికలలో అవి రఘునందన్‌ రావు, ఈటెల రాజేందర్‌ వ్యక్తి గత విజయాలే…కారణాలు ఏవైనా కావొచ్చు పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపడంలో బిజేపి సూపర్‌ సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. ఎనమిదేళ్లుగా అధికారంలో వుండి, అనేక అవకాశాలు పొందుతున్న టిఆర్‌ఎస్‌ నాయకులకంటే బిజేపి నేతలు ఎన్నో రెట్లు మేలనే అనాలి. వాళ్లు పదవుల కోసం ఆలోచించరు. పరపతి కోరుకోరు. తమకు ప్రత్యేక పీట కావాలనరు. అంకిత భావంతో పని చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు ముందు ఇది తెలుసుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో గెలుపుకోసం ఇప్పటి నుంచే రాజకీయాలు మొదలుపెట్టాయి.  

ఎదురులేకుండా చూసుకునేందుకు టిఆర్‌ఎస్‌.

 మొదటి నుంచి టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న ఈ విధానం పూర్తి సత్పలితాలనిచ్చిందనే చెప్పాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలలో గెలిచిన టిఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి ప్రతిపక్షాలకు రాష్ట్ర రాజకీయాలలో స్థానం లేకుండా చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజకీయ చాణక్యం ఎంతో పనిచేసింది. కాంగ్రెస్‌ కకావికలమైపోయింది. కాంగ్రెస్‌ లో హేమాహేమీలు చెల్లాచెదురైపోయారు. చాలా మంది టిఆర్‌ఎస్‌ లో జాయిన్‌ అయ్యారు. ఇక్కడే టిఆర్‌ఎస్‌ పొరపాటు కూడా వుంది. బిజేపికి బలం లేదు, బలగం లేదు. కానీ టిఆర్‌ఎస్‌ నిర్లిప్తత కూడా బిజేపికి అనుకూలంగా మారింది. 

కలబడి నిపబడతామని బిజేపి అంటోంది.

 అసలు స్వంతంగా ఒక్క ఎమ్మెల్యే సీట్ల కూడా అదనంగా సాధించలేదు. బలమైన అభ్యర్థుల మూలంగా గెలిచిన సీట్లు. కాకపోతే పార్లమెంటు ఎన్నికలలో బిజేపి నాలుగు సీట్లు సంపాదించడంతో ఆ పార్టీకి కొండంత ఉత్సాహంగా చేకూరింది. తర్వాత బోనస్‌ గా లభించిన రెండు అసెంబ్లీ సీట్లు, జిహెచ్‌ఎంసి కార్పోరేటర్లు అదనపు బలంగా మారింది. 

 ఇదే కాంగ్రెస్‌ ఎక్కడున్నదో కూడా తెలియకుండా పోయింది.

 ఓ వైపు వరుస ఓటములు. మరో వైపు గెలిచిన వాళ్లు కారెక్కడం. ఇదే తరుణంలో రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడం ఆ పార్టీకి ఆశనిపాతంలా మారింది. ప్రజల్లో కాంగ్రెస్‌ మీద నమ్మకం లేదు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీద నాయకులకు విశ్వాసం లేదు. ఏ ముహూర్తాన రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాడో గాని పార్టీ ఖాళీ అవుతోంది. అదే సమయంలో దాని స్థానాన్ని బిజేపి భర్తీ చేస్తోంది. రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ వుంటే బిజేపికి ఆ అవకాశం వుండేది కాదు. తెలంగాణ లో టిఆర్‌ఎస్‌ బలమైన పార్టీ. ఆ పార్టీని ఎదుర్కొనే శక్తి యుక్తులు ఎవరికీ లేవు. అలా అని బలమైన ప్రతిపక్షం కూడా లేదు. మొదట్లో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏది చెప్పినా విన్న ప్రజలు, ఇటీవల కాలంలో బిజేపి రాజకీయాలను కూడా ఆసక్తిగా గమనిస్తున్నారన్నది తెలిసిపోతోంది. 

టిఆర్‌ఎస్‌ను నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక బిజేపి కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకొని టిఆర్‌ఎస్‌ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తోందన్నది వినిపిస్తున్న మాట.ఐటి, ఈడి దాడులతో టిఆర్‌ఎస్‌ లో గందరగోళం నెలకొనేలా రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నారు. వరుస దాడులతో టిఆర్‌ఎస్‌ నాయకులను బెంబేలెత్తిపోయేలా చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.

ఇదిలా ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో బిజేపిలో కలవరం మొదలైంది.

 దేశ వ్యాప్తంగా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎక్కడా తగ్గడం లేదు. ఎంత దూరమైనా వెళ్లేందుకు రెడీగానే వున్నాడు. అదే బిజేపి పెద్దలకు మింగుడు పడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్థిరపర్చే కుయుక్తులకు బిజేపి తెరతీసిందనేది ప్రధానంగా సాగుతున్న చర్చ. దేశంలో అనేక చోట్ల బిజేపి ఇదే తరహా ప్రభుత్వాల ఏర్పాటు చేపడుతూవస్తోంది. డిల్లీలో కూడా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలు ఆప్‌ ప్రభుత్వం పసిగట్టింది. జాగ్రత్త పడిరది. బిజేపి చేస్తున్నది తప్పని చెప్పింది. అనైతిక రాజకీయాలతో బిజేపి పాలన సాగించాలని చూస్తోందని ఆప్‌ దుమ్మెత్తిపోసింది. తెలంగాణ విషయంలో ఏకంగా రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయారు. మింగలేక, కక్కలేక చతికిల పడ్డారు. ఆనాటి నుంచి బిజేపి నేతలు రకరకాల విన్యాసాలు వేస్తూ వస్తున్నారు. అయినా ప్రజలు నమ్మడం లేదు. దుర్మార్గం, దౌర్జన్యం ఎల్ల కాలం సాగదని ఇంకా బిజేపి నేతలు తెలుసుకోలేకపోతున్నారు.

రాష్ట్రంలో బిజేపి రాకుండా టిఆర్‌ఎస్‌ కు ఎర్రసైన్యం తోడయ్యింది.

 తెలంగాణలో వామపక్షాల బలం పూర్తిగా తీసిపారేయాల్సిన అంశం కాదు. క్షేత్ర స్థాయిలో బిజేపి కన్నా బలంగా వామపక్షాలున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో వామపక్షాల ప్రభావం చాలా వుండేది. తెలంగాణ ఉద్యమం మూలంగా రెండు కమ్యూనిస్టు పార్టీలకు ఎడం పెరిగింది. బలం తగ్గింది. జై తెలంగాణ అనని పార్టీలు తెలంగాణలో లేకుండా పోయాయి. తెలంగాణ నినాదం ఎత్తుకున్న పార్టీలే మనుగడ సాగించాయి. అయితే సిపిఐ జై తెలంగాణ అన్నది. కానీ సిపిఎం నై తెలంగాణ అన్నది. దాంతో సిపిఎం క్షేత్ర స్థాయిలో వున్నా ప్రజల మద్దతు లేకుండా పోయింది. అంతే కాకుండా వామపక్షాలు ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలంగాణ అమలౌతున్న అనేక సంక్షేమ పథకాల అమలుతో వామపక్షాలకు ప్రశ్నించే అవసరం రాలేదు. కాలం గిర్రున తిరిగింది. దేశంలో కూడా వామపక్షాల జాడ కనపడనంతగా మారిపోతోంది. ఎలాగైనా బిజేపిని నిలువరిస్తే తప్ప, వామపక్షాల రాజకీయాలకు ప్రజా క్షేత్రంలో చోటు దొరకదు. అందుకే టిఆర్‌ఎస్‌ అక్కున చేర్చుకుంటామనగానే మళ్ళీ వామపక్షాలకు ఊపిరొచ్చింది. టిఆర్‌ఎస్‌ తో కలిసి బిజేపిని ఎదుర్కొనేందుకు వామపక్షాలు నడుంబించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *