అందరికీ బతుకమ్మ పండుగ అయితే రైతులకు యూరియా బస్తాల పండుగ
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం రాష్ట్రం మొత్తంలో ఆడబిడ్డల పండుగ బతుకమ్మ రంగుల హరివిల్లులా మెరవగా రైతు ఇంట్లో మాత్రం నిశ్శబ్దం మబ్బులా అలుముకుని ఉందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి తీవ్ర వేదన వ్యక్తం చేశారు.
గత పది సంవత్సరాల పాలనలో రైతు ఒక్కసారైనా యూరియా కోసం సొసైటీల ఎదుట క్యూలో నిలబడలేదని గర్వంగా చెప్పుకున్న రోజులు ఇవేనా? ఇక ఇప్పుడు పరిస్థితి చూస్తే రాత్రి ఒకటి మూడు గంటలకు రైతు కడుపు మంటలు ఆపుకోలేని స్థితిలో ఎరువుల బస్తా కోసం కాచుకొని కూర్చోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది అని ఆయన ప్రశ్నించారు.
రైతు చెమటతో పాలు పిండే గడ్డిపండు వంటి భూమి ఎరువుల కోసం తహతహలాడుతున్న ఈ దృశ్యం చూసి పల్లెల గుండెల్లో రక్తం ఉడికిపోతోంది. ఇంకో రెండు మూడు నెలల్లో కోతకు వచ్చే పంట యూరియా లేక వాడిపోతుందేమోనన్న భయం రైతు కళ్లలో నిద్రను దోచేస్తోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బతుకమ్మ పూలు వర్ణరంజితంగా విరబూస్తున్నా రైతు హృదయంలో మాత్రం కన్నీటి బిందువులే తొణుకుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పాటల్లో ఆనందం వినిపిస్తోంది కానీ రైతు ఊపిరిలో మాత్రం ఒకటే అనాధ విలపన యూరియా యూరియా అని కరుణాకర్ రెడ్డి హృదయ పూర్వకంగా వ్యాఖ్యానించారు