గులాబీ నలిగిపోయింది!

https://epaper.netidhatri.com/view/285/netidhathri-e-paper-5th-june-2024%09/2

`పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటి సారి ఘోరంగా వాడిపోయింది.

`బీఆర్‌ఎస్‌ మార్పుతో గులాబీ బతుకు బస్టాండైంది.

`తెలంగాణ ఆత్మలేని బిఆర్‌ఎస్‌కు కర్రువాతే మిగిలింది.

`తెలంగాణ రాజకీయాలకు కేసిఆర్‌ పనికి ‘రావు’ పొమ్మన్నారు.

`కేసీఆర్‌ జనంలోకి వచ్చినా నమ్మలేదు.

`కేసీఆర్‌ మొసలి కన్నీరు కనిపెట్టారు.

`బస్సు యాత్రను తుస్సు చేశారు.

`కేసీఆర్‌ యాత్రను తేలికగా తీసుకున్నారు.

`జనమొచ్చి నమ్మించి మళ్ళీ బిఆర్‌ఎస్‌ను ముంచారు.

`బస్సు యాత్ర కొచ్చిన వాళ్లు కూడా ఓట్లేయలేదు.

`కేంద్ర రాజకీయాలకు కేసిఆర్‌ పనికి రాడని తేల్చేశారు.

`మొత్తంగా ఐదేళ్ల తర్వాత చూద్దాం…పో పంపించేశారు.

`తెలంగాణ పార్లమెంటు ఎన్నికల సైతం బిఆర్‌ఎస్‌ను పాతాళానికి తొక్కేశారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అవును…గులాబీ నలిగిపోయింది. జనం నలిచి నలిచి వదిలేశారు. పైగా బిఆర్‌ఎస్‌ పార్టీయే చేజేతులా నలిపేసుకుంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ పార్టీకి వుండకపోవచ్చు. తనను తాను ఆత్మ వంచన చేసుకునే పార్టీ ప్రపంచంలో ఎక్కడా వుండదు. కాని ఎన్నుకున్న ప్రజలను మర్చిపోయే పార్టీ అధినేత కేసిఆర్‌ తప్ప మరొకరు వుండరేమో! ఆదరించిన వారికి దూరంగా బహుషా కేసిఆర్‌ తప్ప మరొకరు దూరంగా వుండరేమో!! ఇది బిఆర్‌ఎస్‌ పెద్దలు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇది నిజం..పచ్చి నిజం. లేకుంటే ప్రజలు ఎందుకింత చీ కొడతారు..ఎందుకింత దూరం పెడతారు. టిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాటి నుంచి ఇంతటి ఘోరమైన పరాభవం ఆ పార్టీకి ఏనాడు లేదు. ఉద్యమ కాలంలో ఆపార్టీకి వున్న ఊపు మరొక పార్టీకి లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీని ఆదిరించినంతగా తెలంగాణ ప్రజలు మరో పార్టీని ఆదరించలేదు. కాని దాన్ని కేసిఆర్‌ నిలుపుకోలేకపోయారు. అధికారంలో వున్నంత కాలం మంత్రులను ముఖ్యమంత్రి కలవకపోయినా వాళ్లు కడుపులోపెట్టుకున్నారు. ఎమ్మెల్యేలను కలవకపోయినా వాళ్లు మనసులో పెట్టుకున్నారు. ఒక దశలో ప్రజల దగ్గరకు రాకపోయినా గుండెల్లో పెట్టుకున్నారు. కాని అదే రాను రాను మరింత కేసిఆర్‌ను ప్రజలకు దూరం చేసేదాకా తెచ్చుకున్నది. ఇది ముమ్మాటికీ స్వయం కృతాపరాధమే. ఇక బిఆర్‌ఎస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదు. రాదు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ మాట వినే పరిస్దితి వుండదు. ఆయన మాటలు నమ్మే పరిస్దితి అసలే వుండదు. ఎందుకంటే టిఆర్‌ఎస్‌కు బిఆర్‌ఎస్‌ పేరు మార్పుతోనే బతుకు బస్టాండైంది. పార్టీ పేరు మార్చే క్రమంలో, జాతీయ రాజకీయాలంటే కేసిఆర్‌ సొల్లు చెప్పిన ప్రతి సందర్భంలో తెలంగాణ సమాజం హెచ్చరిస్తూనే వుంది. మేదావులు మేలుకొలిపే ప్రయత్నం చేసింది. మీడియా కూడా జనం నాడిని రాస్తూనే వచ్చింది. బిఆర్‌ఎస్‌లో తెలంగాన ఆత్మ లేదని అందరూ అన్నారు. అయినా కేసిఆర్‌ ఎవరి మాట వినలేదు. అంతా నా ఇష్టం అనుకున్నాడు. అదే ఇప్పుడు కొంపముంచింది. అయితే దాంతో మునిగేది ఆయన ఒక్కడే కాదు. ఆ పార్టీని నమ్ముకొని రెండున్నర దశాబ్దాలుగా రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు కూడా అడియాసలు చేశాడు. ఉద్యమ సమయంలో కనీసం పార్టీకి చెందిన సంస్ధాగత నిర్మాణం బలంగా వుండేది. కాని పదేళ్లపాటు అధికారంలో వున్నా పార్టీ సంస్ధాగత నిర్మాణం చేసే తీరక లేకుండాపోయింది.. గ్రామీణ ప్రాంతం నుంచి, రాష్ట్ర స్ధాయి దాకా పార్టీ పదవులు పంచేందుకు కూడా ఇష్టపడలేదు. పైగా పదేళ్లపాటు అదికారంలో వున్నా, పార్టీకోసం పనిచేసిన,తెలంగాణ ఉద్యమంలో కీలమైన వారికి కనీసం నామినేటెడ్‌ పదవులు కూడా పూర్తి స్ధాయిలో పంచలేదు. ఇలా నమ్మిన వారిని నట్టెట ఎంత ముంచినా పట్టుకొని వేళాడారు. ఇప్పుడు వారంతా దూరమై, జెండా పీకే దాకా వచ్చే కాలమే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కేసిఆర్‌ ఎవరికీ అక్కరకు రాని వ్యక్తి. నాయకుడు అని కూడా అనలేని పరిస్ధితి. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి శత్రువు. కేంద్రంలో బిజేపికి శత్రువు. రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువుగా వుంటూ, పార్టీని నడపడం కేసిఆర్‌ వల్ల కాదు. కేసిఆర్‌ జనంలోకి రాడు. కూర్చున్న చోట గుర్రాలు మలుపుతా అంటే ఎవరూ ఇప్పుడు అంగీకరించరు. తెలంగాణ ఉద్యమ కాలంలోనైనా నడిచింది.కాని ఇప్పుడు నడవదు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణసమాజమంతా ఏకమైన పోరాటం చేసింది. ఆఖరున వచ్చిన మమ అనిపించడం అలవాటు చేసుకొన్న రోజులు కావివి.

పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసిఆర్‌ ఇక నీవు రాజకీయాలకు, ప్రజా సేవకు పనికిరావు పో అన్నంత పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించినా, బలమైన ప్రతిపక్షంగా వుండాలని కోరుకున్నారు. జాతీయ రాజకీయాలకు కేసిఆర్‌ అవసరమే లేదన్నంతగా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారు. నల్లగొండ సభలో నాకు మరోసారి అవకాశమిస్తే డిల్లీలో అగ్గి పెట్టేవాణ్ణి అని గొప్పలు చెప్పుకున్నాడు. ఇటీవల తెలంగాణ భవన్‌లో ప్రదాని రేసులో వున్నానని ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు కనీసం ఒక్కసీటు కూడా గెల్చుకోలేక చతికిలపడ్డాడు. కనీసం కామారెడ్డిలో ఓడిపోయానన్న సోయి కూడా కేసిఆర్‌కు లేకుండాపోయింది. ఇప్పుడు తన సొంత జిల్లాలోనే పార్లమెంటు చే జారింది. సరిగ్గా ఎన్నికల ముందుకు ప్రజల్లోకి రావడం మాయ మాటలు నాలుగు చెప్పి మోసం చేయడం అలవాటు చేసుకున్న కేసిఆర్‌కు పార్లమెంటు ఎన్నికల్లో మంచిగానే కర్రుకాల్చి వాటపెట్టారు. కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. ఎన్నికల ప్రచారంలో బస్సుయాత్ర అంటూ వచ్చి పదమూడు రోజులు పాటు ప్రజల్లో తిరిగితే సరిపోతుందనుకున్నాడు. అందుకే కేసిఆర్‌ జనంలోకి వచ్చినా ఎవరూ నమ్మలేదు. హైదరాబాద్‌ ప్రజలు నమ్ములేదు. ఉత్తర తెలంగాణ ప్రజలు ఆదరించలేదు. దక్షిణ తెలంగాణ మాత్రం అసలు కేసిఆర్‌ను గుర్తించినట్లే లేరు. ఖమ్మం, నల్లగొండలో కాంగ్రెస్‌ మెజార్టీలు చూస్తే కేసిఆర్‌ దిమ్మ తిరగాల్సిందే. అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకుముందు జనంలోకి వచ్చి మెసలి కన్నీరు కార్చితే నమ్ముతారునుకున్నాడు. కాని ప్రజలు కేసిఆర్‌ను విశ్వసించలేదు. బిజేపి వైపు చూశారు. గత పదిహేనేళ్లుగా చెప్పిందే చెప్పి, ప్రజలను కేసిఆర్‌ విసిగిస్తూ వచ్చాడు. ఎక్కడికెళ్లినా నేను తెలంగాణ కోసం కొట్లాట మొదలు పెట్టిన నాడు అంటూ చెప్పడం ఒక్కటే అలవాటు చేసుకున్నాడు. పదేళ్ల పాటు పరిపాలనచేసిన నాయకుడు తాను చేసి చూపించిన అధ్భుతాలను చెప్పాలి. నా జీవితంలో తెలంగాణ సాధించడం కాన్న గొప్పవిషయం ఏమి వుండదని ఉద్యమ కాలంలో చెప్పాడు. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ సాదించిన విజయం చాలు. నా జీవితం ధన్యం అన్నాడు. తెలంగాణ అభివృద్దికి కాపాల కుక్కలా వుంటానన్నాడు. కాని పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటన చేశాడు. గెలవగానే సిఎం కుర్చీలో కూర్చున్నాడు.

పదేళ్ల పాటు పాలన చేసి చెప్పుకోవడానికి ఏం చేశావంటే చూపించడానికి ఏమీ లేదు. కాళేశ్వరం కథ కంచికి చేరింది. అది ఎప్పుడో కూలిపోయింది. లక్షకోట్లు నీళ్లపాలు చేసి, తెలంగాణ సొమ్ము దిగమింగి, కాంట్రక్టర్లను బతికించి, తన ఆస్దులు పెంచుకొవడం తప్ప కేసిఆర్‌ చేసిందేముందనేది తెలంగాణ సమాజమే ప్రశ్నిస్తోంది. కాళేశ్వరం కట్టినన్ని రోజులైనా నీళ్లివ్వలేదు. రెండో ఏడాదే పంపు హౌజులు మునిగిపోయాయి. బాహుబలి మోటార్లు కాస్త చెడిపోయాయి. మరో ఏడాదికే కాళేశ్వరానికే బుంగలు పడ్డాయి. ఇంకా కేసిఆర్‌ గొప్పలు చెబుతుంటే జనం ఓట్లేయకుండా సమయం చూసి చీకొట్టారు. ఓడిరచారు. కాళేశ్వరం ఎలా కడుతున్నామంటే ప్రపంచంలోనే అంత అధ్భుతమైన ప్రాజెక్టు లేదన్నంతగా గొప్పలు చెప్పుకున్నాడు. భూకంపాలను సైతం తట్టుకుంటుందని గొప్పలు చెప్పాడు. చెమట చుక్కలురంగరించి కట్టాన్నాడు. రీడిజైన్‌ తానే స్వయంగా చేసి, రక్తం దారపోశానన్నాడు. ఇంతింత లేకి మాటలు మాట్లాడుతున్నప్పుడే జనం నిర్ణయం తీసుకున్నారు. ఇక కేసిఆర్‌ను పక్కన పెట్టడమే మంచిదని గట్టిగా ఫిక్స్‌ అయ్యారు. ఏ పల్లె పేరు చెప్పి తెలంగాణ సొమ్మంతా దుబారా చేశాడో అదే పల్లె జనం ఓడిరచారు. మళ్లీ అదే పల్లెజనం ఏడుస్తున్నారంటూ కొత్త కథ..పిట్ట కథలు చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లాడు. పంటలు ఎండిపోయాయన్నాడు. తాను అధికారంలో వున్ననాడే నీళ్లు లేవని, కాళేశ్వరం ఇవ్వలేదని తెలిసే వరి వేస్తే ఉరే అంటూ రైతులను బెరించాడు. అవన్నీ ప్రజలు మనసులో పెట్టుకున్నారు. కేసిఆర్‌ చేసేదేమీ లేదు. జనాన్ని ఉద్దరించేదేమీ లేదని గ్రహించారు. శాసన సభ ఎన్నికల్లో పల్లెలనుంచి బిఆర్‌ఎస్‌ను తరమికొట్టారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఎర్రగా కర్రు కాల్చి వాత పెట్టారు. కుయ్యో..మోర్రో అనేలా చేశారు…ఇక నీ రాజకీయాలు చాలని గట్టిగా ఓటు గుద్ది మరీ చెప్పారు. బైబై కేసిఆర్‌ అని తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌కు వీడుకోలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *