అయినవోలు మండల కేంద్రంలో మెడికల్ షాపుల దందా – ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
ప్రాణాల కంటే లాభం గొప్పదా?
అధికారుల నిర్లక్ష్యం – ప్రజలకు శాపం కాకూడదు.
నేటి ధాత్రి అయినవోలు :-
అయినవోలు మండల కేంద్రంలో ప్రజల ఆరోగ్యమే పెట్టుబడిగా మారిపోయింది. వైద్య వృత్తి పవిత్రతను తుంగలో తొక్కుతూ, అర్హత లేని వ్యక్తుల చేతిలో మెడికల్ షాపులు, అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పీలు గ్రామీణ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు. ఒక క్రమబద్ధమైన దందా.
ఫార్మసీ డిగ్రీ, లైసెన్స్, అర్హత ఏమీ లేకుండానే మెడికల్ షాపులు నడుపుతున్న నకిలీ ఓనర్లు, మేమే డాక్టర్లు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆపద సమయాల్లో, అనారోగ్య కారణంగా నడవలేకున్నామన్నా మా ఇంటికే రండి, ఇంటికి వస్తేనే వైద్యం చేస్తాం” అంటూ హుకుం జారీ చేస్తున్న ఆర్.ఎం.పీల దుస్సాహసం రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య నియమాలు, మానవతా విలువలు అన్న మాటే లేకుండా డబ్బే పరమావధిగా మారింది. అర్హత లేని మెడికల్ షాప్ నిర్వాహకుల కారణంగా ఇటీవల కుటుంబ సభ్యులే సొంతంగా ఇచ్చిన వైద్యం తిని ఆస్పత్రిపాలైన సంఘటనలు కలవరపెడుతున్నాయి. అయినా సంబంధిత శాఖల కళ్లెందుకు మూసుకుపోయాయో అర్థం కాని పరిస్థితి. వృద్ధులు, నిరక్షరాస్యులు లక్ష్యంగా కొందరు ఆర్ఎంపీలు ఇంటింటికి తిరిగి సొంత మందుల సరఫరా చేస్తూ, అర్థ రూపాయి విలువైన గోలిమందుకు రూ.5 వసూలు చేస్తున్న దోపిడి పట్ట పగలు బహిరంగంగానే జరుగుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ షాప్ ఓనర్లు మందుల పేరుతో చేస్తున్న దందాకు అడ్డుకట్ట వేయాల్సిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లు, వైద్య శాఖ అధికారులు ఎక్కడున్నారు? సరైన అర్హత లేని వారు షాపులు నడుపుతుంటే, వారిచ్చే కమిషన్ల కోసం కొందరు చేస్తున్న నకిలీ వైద్యం కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థే మౌనంగా ఉంటే, ఈ దందాకు నైతిక బాధ్యత ఎవరిది? నకిలీ మెడికల్ షాప్ ఓనర్లు, అర్హత లేని ఆర్.ఎం.పీలపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికార యంత్రాంగం కూడా ఈ నేరానికి భాగస్వాములే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా జిల్లా వైద్యాధికారులు, డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు కళ్లుతెరవాలి. లైసెన్స్ లేని మెడికల్ షాపులను సీజ్ చేయాలి. అర్హత లేకుండా మందులు విక్రయించే వారిని వైద్యం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేదంటే ప్రజల ఆరోగ్యంతో జరుగుతున్న ఈ దందా మరిన్ని ప్రాణాలను బలి తీసుకోవడం ఖాయం.
