భూములు కోల్పోతే.. మా బతుకులు ఆగం.. ఆగం
“ఆర్ఆర్ఆర్ కు.. మేము భూములు ఇవ్వం”
బాలానగర్ /నేటి ధాత్రి
బాలానగర్ మండలంలోని చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి, గౌతాపూర్, వనమోనిగూడ, పెద్దాయపల్లి తదితర గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ఇటీవలే సర్వే నిర్వహించారు. రోడ్డు నిర్మాణానికి ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేయడంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాలానగర్ తాహాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ.. తహాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో భూములు ఇవ్వబోమని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాము సన్న కారు రైతులమని, తమ జీవనాధారం వ్యవసాయ పొలమేనని, భూములను కోల్పోతే తాము ఉపాధిని కోల్పోతామన్నారు. నిరక్షరాసులైన తాము వ్యవసాయం తప్ప మరో పని చేయలేమన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి మరో ప్రాంతం నుంచి ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రచించాలన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.