తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి
* సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి
చేవెళ్ల, నేటిధాత్రి:
ఈనెల 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగిన సాయిధ రైతాంగం తిరుగుబాటు చేశారని అన్నారు. ఈ పోరాటంలో దాదాపు 4500 మంది తెలంగాణ రైతులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఈ పోరాటం ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యవస్థకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. నిజాం పాలనను అంతం చేసి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఈ పోరాటం దారితీసిందని, భూస్వాముల దోపిడీని నిలిపి రైతుల హక్కుల పరిరక్షణకు ఈ పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చిందనిఅన్నారు. ఈ స్ఫూర్తితోనే ఈనెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాదులోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ముగింపు సభ ఉంటుందని ఈ సభకు పార్టీ శ్రేణులు గ్రామ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ, ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు పాల్గొన్నారు.