వరంగల్ జిల్లా నర్సంపేట ఘటన విషాదాంతం

వరంగల్ జిల్లా నర్సంపేట ఘటన విషాదాంతం

డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

నర్సంపేట డిపో ప్రాంగణంలో జరిగిన దుర్ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.సుమారు 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ఆయనకు మొదట వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందించారు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అక్కడికి చేరుకున్న అనంతరం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనతో ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.కార్మికుల సమస్యల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.కార్మిక సంఘాల ఆరోపణల ప్రకారం, 32 డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను గత నాలుగు నెలలుగా అధికారులకు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు.ఈ నిర్లక్ష్యం కారణంగా కార్మికుల్లో అసంతృప్తి పెరిగి,సమ్మె పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.విప్లవ కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ,శంకర్ గౌడ్ మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి.అలాగే ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కార్మికులు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలకు పోకుండా,హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సింగరేణి గని కార్మిక సంఘం ఎస్ జి కె ఎస్ నాయకులు అంబాల మహేందర్, టియుసిఐ నాయకులు గోగర్ల శంకర్, ఏఐఎఫ్టీయు నాయకులు ఎం.పోశమల్లు,టియుసిఐ బెల్లంపల్లి బాధ్యులు అడ్డూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి

సమ్మె నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు – నర్సంపేట ఘటనపై ఆవేదన

ఏఐసిటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు మరిపెళ్లి మొగిలి

కేసముద్రం/ నేటి ధాత్రి

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారి డిమాండ్లను పరిష్కరించాలని ఎంసిపిఐ(యు) అనుబంధ కార్మిక సంఘం ఏఐసిటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు మరిపెళ్లి మొగిలి డిమాండ్ చేశారు. శుక్రవారం కేసముద్రంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు. నర్సంపేటలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరమని, ఇది కార్మికుల మానసిక ఒత్తిడికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే పే స్కేలు వర్తింప చేస్తామని ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. వేతన సవరణలు, ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిల చెల్లింపులు వంటి అంశాలు అత్యవసరంగా పరిష్కరించాల్సినవని తెలిపారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించాలని మొగిలి సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆర్టీసీ సేవలు ప్రజలకు అత్యంత కీలకమైనవని, వాటి సజావుగా నడవడం కోసం కార్మికుల సంక్షేమం ముఖ్యమని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదిస్తే సమ్మెను విరమించేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

మృతుడి కుటుంబానికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి

ఈ ఘటనపై నైతిక భాద్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

బిఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి:

ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా ప్రభుత్వ మొండివైఖరికి పట్ల మనస్థాపంతో నర్సంపేట ఆర్టీసీ బస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేస్తున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలోని ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేట మండలం ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళర్పించారు. మృతదేహాన్ని ఆర్టీసీ డిపోలో ఉంచి నివాళి అర్పించడానికి ఆర్టీసీ కార్మికులకు అవకాశం ఇవ్వాలని పోలీసు అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్ది మాట్లాడుతూ, ఆర్టీసీ డ్రైవర్ మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. మృతుడి కుటుంబానికి ఆర్టీసీ జెఏసి నాయకులు నివాళులు అర్పించకుండా ఎక్కడి అక్కడ పోలీస్ పహారతో అడ్డుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.ఈఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ విషాద ఘటన అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బిఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి నల్గొండ జిల్లా తీసుకెళ్లారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version