గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డా బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైదానం పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహూతులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా సింగరేణి, విద్యా, డిఆర్‌డీఓ, గృహ నిర్మాణ, సంక్షేమ, వ్యవసాయ, ఉద్యాన, వైద్య శాఖల అధికారులు స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేయాలని డిపిఆర్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఈ సందర్భంగా సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పి నరేష్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాల ప్రజా సమస్యల పై అవగాహన కలిగి ఉండాలని…

ప్రభుత్వ పథకాల ప్రజా సమస్యల పై అవగాహన కలిగి ఉండాలని

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

సోమవారం ఐడిఓసి కార్యాలయంలో శిక్షణా సివిల్ సర్వీసెస్ అధికారులు, విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల సంక్షేమ, డిఆర్డీఓ, ప్రణాళిక శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ శిక్షణా అధికారులు గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులపై ప్రత్యక్ష అనుభవం అవసరమని, అందుకోసం ఫీల్డ్ లెవల్ ఫంక్షనరీలతో సమన్వయం, గ్రామాలలోని ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ జరగాలని సూచించారు. సేవలు, సంక్షేమ పథకాల అమలు, సమస్యల గుర్తింపు, తక్షణ పరిష్కారంపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. పలిమెల, మహా ముత్తారం మండలాల్లో అధికారులతో కలిసి ప్రాంతాలను సందర్శించి మహిళా సంఘాలు, రైతులు, యువతతో ఇంటరాక్షన్ కావాలని సూచించారు. పలిమెల, మహా ముత్తారం మండలాలను నీతి ఆయోగ్ యాస్పిరేషన్ బ్లాకులుగా ప్రకటించిందని, ఐదు సెక్టారులుకు సంబంధించి 49 ఇండికేటర్లు, 81 పారామీటర్లు నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో 76 శాతం అడవులు విస్తరించి ఉన్నాయని వివరించారు. 12 మంది అధికారులు రెండు బృందాలుగా పలిమెల, మహా ముత్తారం మండలంలో పర్యటన చేయనున్నారని, ఇట్టి పర్యటనకు సంబంధించి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, అవసరాలను తెలుసుకుని ఆచరణలోకి తీసుకువెళ్లే విధంగా యంత్రాంగానికి సూచనలు చేయాలని సూచించారు. అధికారుల పర్యటనకు స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సర్వీసెస్ అధికారులు,
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వైద్యాధికారి డా మధుసూదన్,
డీఈఓ రాజేందర్, వ్యవసాయ అధికారి బాబూరావు, డిఆర్డీఓ బాల కృష్ణ, సీపీఓ బాబూరావు, సంక్షేమ అధికారి మల్లేశ్వరి
తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version