మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి…
మేడారం జాతర జరిగే మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించాలి.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్
కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర కాబట్టి పిల్లల సెలవులకై నిరీక్షణ
ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక కూడా
విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం
కేసముద్రం/ నేటి ధాత్రి
మేడారం జాతరకు సెలవులు మూడు రోజులు ప్రకటించాలని కోరుతూ టిపిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో కేసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాలలో , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు నేతృత్వంలో అర్పణపల్లి పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రపంచంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించారనీ, ఈ జాతరలో గత సంవత్సరాల గణాంకాల ప్రకారం లక్షలాది మంది భక్తులు తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా, గిరిజన సంప్రదాయాలకు ప్రధాన ప్రతీక అని, తెలంగాణ సంస్కృతికి మూల స్తంభం అని వివరించారు.
ఈ జాతర సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో దైవ దర్శనం చేసుకుంటారని అన్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు సమ్మక్క, సారక్క తల్లులు ఇద్దరు కొలువుదీరిన మరుసటి రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ వస్తున్నాయని, దీనివల్ల ఆరోజే అందరూ
మేడారం జాతరకు వస్తూ ఉండడం వలన లక్షలాది మంది ప్రజలు పాల్గొనే కారణంగా ట్రాఫిక్ సమస్యలు, కష్టతర ప్రయాణం , వసతి సౌకర్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, దర్శన సమయంలో కిక్కిరిసిన జనాభా వల్ల పిల్లలకు దర్శన భాగ్యం కూడా కలగట్లేదు అని అన్నారు. ఇది కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర అనీ, పిల్లలకు సెలవులు ఇవ్వందే వాళ్ళు జాతరకు వెళ్ళరని, వారి సెలవులకై వేచి చూసి, సెలవులు ఇచ్చాక మాత్రమే జాతరకు తరలి వెళ్తారని అన్నారు. మూడు రోజులు సెలవులు ఉంటే పబ్లిక్ ఇంత పోటెత్తరని, జాతరను కూడా ఎంజాయ్ చేస్తారని, ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం అని అన్నారు.
ఈ నెల 28న సారక్క తల్లి,29న సమ్మక్క తల్లి గద్దెల పైకి కొలువుదీరుతారని ,30న భక్తుల మొక్కులందుకొని తిరిగి 31న వన ప్రవేశం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు
కావున ప్రభుత్వం ప్రజా ఆకాంక్షను గౌరవించి మేడారం జాతర సందర్భంలో తల్లులు కొలువుదీరే ఈ మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు మరియు విద్యాసంస్థలకు అధికారికంగా సెలవులు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజు, నరసింహస్వామి, భూక్య శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
