సింగరేణి కార్మికుల లాభాల వాటా పై యాజమాన్యం పునరాలోచించాలి
ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి వ్యాప్తంగా లాభాల వాటా ప్రకటనపై ప్రతి కార్మికుడికి అసంతృప్తి ఉందని, వాస్తవ లాభాలు ప్రకటించాలని ఏఐటీయూసీ గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తుందని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. లాభాల వాటా పై రకరకాల చర్చలు, కామెంట్లు వస్తున్న నేపధ్యంలో వాస్తవ లాభాలను ప్రకటించకుండా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం గోప్యతతో లాభాలను ప్రకటించడం కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా వాస్తవిక లాభాలను ప్రకటించాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తుందని అన్నారు. లాభాలను సింగరేణి ప్రాంతంలో అభివృద్ధికై కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వం,యాజమాన్యం సింగరేణి ప్రాంతాలలో ఏం అభివృద్ధి చేశారో తెలియచేయాలని అన్నారు. ప్రభుత్వం నుండి సింగరేణికి ఇప్పటికే 40 వేల కోట్ల బకాయిలు రావాల్సింది ఉందని గుర్తు చేశారు. లాభాలు ఎన్ని వచ్చాయో యాజమాన్యం ప్రకటించకుండా ఇన్ని రోజులు నాన్చుతూ వచ్చి చివరకు కేవలం 34% లాభాల వాటా మాత్రమే అందించడంతో కార్మిక లోకం తీవ్ర అసంతృప్తికి లోనైందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సైతం సరైన లాభాలు ప్రకటించకపోవడంతో వారు కూడా నిరాశ చెందుతున్నారని తెలిపారు. ఏఐటియుసి సంఘం తరఫున లాభాల వాటపై ప్రభుత్వం పై,యాజమాన్యం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రతి కార్మికుడికి చెందాల్సిందేనని డిమాండ్ చేశారు. లాభాల వాటాపై యాజమాన్యం పునరాలోచించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.