భూపాలపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం జడ్పి ఉన్నత పాఠశాల, హనుమాన్ నగర్‌లోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి సందర్శించి ఏర్పాట్లు, ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 52,726 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని తెలిపారు. వీరిలో 26,786 మంది పురుషులు, 25,936 మంది మహిళలు, ఇతరులు 4 మంది ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 30 వార్డులకు 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 104 మంది ప్రెసైడింగ్ అధికారులు, 104 మంది అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులు, 312 మంది ఇతర పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు.
అనంతరం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. 86 పోలింగ్ కేంద్రాల్లో 149 వెబ్‌కాస్టింగ్ యూనిట్ల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. కొన్ని కేంద్రాల్లో లోపల మరియు బయట రెండు చోట్లా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసు, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
