సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించి ప్రజల ఆరోగ్యం కాపాడాలి
ప్రజావాణిలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన స్వచ్ఛంద సంస్థల సమాఖ్య
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను అరికట్టి క్యాన్సర్ బారి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని నర్సంపేట డివిజన్ స్వచ్ఛంద సంస్థల సమాఖ్య కోరింది.సోమవారం నర్సంపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సమాఖ్య బాధ్యులు ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం అందజేశారు.అతి పలుచని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, బిర్యానీ కవర్లలో వేడి వేడి టీ, సాంబార్, ఆహార పదార్థాలు తినడం, తాగడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారని సమాఖ్య బాధ్యులు గిరిగాని సుదర్శన్, రాజశేఖర్ తెలిపారు. మండలాల్లోని ఫంక్షన్ హాళ్లు, టెంట్ హౌస్‌లలో సిరామిక్, స్టీల్ గ్లాసులు వాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.వినతికి స్పందించిన ఆర్డీఓ ఉమారాణి మాట్లాడుతూ, సంబంధిత మండలాల అధికారులతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండలాల సంబంధిత శాఖల అధికారులు, సేవా సంస్థ ఆర్గనైజర్ వెంకటాచారి పాల్గొన్నారు.
