Ram Turns Director Soon?
డైరెక్టర్గా రామ్
దర్శకత్వం వైపు ఆసక్తి చూపిస్తున్న హీరోల జాబితా పెరుగుతూపోతోంది. విశ్వక్సేన్ ఇప్పటికే రెండు సినిమాలు తీశారు. మరో సినిమా సెట్స్ పై ఉంది. కిరణ్ అబ్బవరం కూడా మెగాఫోన్ పట్టబోతున్నారు. అడవిశేష్ కి ఈ అనుభవం ఇప్పటికే ఉంది. సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి కూడా పార్ట్ టైమ్ డైరెక్టర్లే. ఇప్పుడు రామ్ కూడా మెగాఫోన్ పట్టే ఆలోచనలో ఉన్నాడు.
‘ఆంధ్రా కింగ్ తాలుకా’ తరవాత రామ్ సినిమా ఏమిటన్న విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. కాకపోతే… రామ్ నిర్మాణ సంస్థని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. ఆయన అన్నయ్య చైతన్య కృష్ణ నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు రామ్ కథ అందిస్తుండడం మరో విశేషం. ఇప్పుడు ఆ కథని డైరెక్ట్ చేసేవాళ్లు కావాలి. అందుకోసం కొంతమంది పేర్లు పరిశీలించారు. కానీ వర్కవుట్ అవ్వడం లేదు. ‘ఈ సినిమాకి నేనే డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది’ అనే ఆలోచనలో ఉన్నారు రామ్. తన కథకు న్యాయం చేసే దర్శకుడు దొరికితే ఓకే, లేదంటే మాత్రం ఈ సినిమాతో రామ్ మెగా ఫోన్ పట్టే ఆలోచనలు పుష్కలంగా ఉన్నాయి. మే 15 రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈలోగా దర్శకుడు దొరుకుతాడా, లేదంటే ఆ బాధ్యత తానే తీసుకొంటారా అనేది చూడాలి.
