అధిష్టానం ముందు రే’వంతు’దే హవా!

-చెల్లుబాటంతా రేవంత్‌దే!

-మింగలేక, కక్కలేక సీనియర్లు.

-తమ ప్రాధాన్యత తగ్గిందని దిగులు.

-ప్రతిపక్షంలో వున్నప్పుడు సీనియర్లంతా హీరోలే

-అధికారంలోకి వచ్చాక పదవులు అనుభవిస్తున్న వారే!

-అయినా ఎక్కడో ఓ అసంతృప్తి.

-ఎవరి ఆశలు వాళ్లవే..

-అంతా లక్ష్యం లేని నాయకులే.

-ప్రతిపక్షంలో వున్నప్పుడు కొట్లాడిరది లేదు.

-పార్టీ పటిష్టతకు కృషి చేసింది లేదు.

-పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకమే లేదు.

-రేవంత్‌ రెడ్డి తోనే ఊపొచ్చిందనేది వాస్తవం.

-రేవంత్‌ వల్లనే బలమొచ్చిందనేది నిజం.

-యువత రేవంత్‌ వల్లనే ఆకర్షితులయ్యారు.

-అన్ని వర్గాలు కాంగ్రెస్‌ ను నమ్మారు.

-అందుకే కాంగ్రెస్‌ ను గెలిపించారు.

-ఎంపికలన్నీ రేవంత్‌ సూచనతోనే..

-సీనియర్లంతా నడవాల్సింది ఆయన బాటలోనే..

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా, కాంగ్రెస్‌ పార్టీలోనైనా ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వహానే కొనసాగుతోంది. ఒక రకంగా ఆయన ఏకచ్చత్రాధిప్యతమే నడుస్తోంది. పాలించే అవకాశం వచ్చినప్పుడు ఏ నాయకుడైనా సరే ఇతరల హవా కొనసాగాలని కోరుకోరు. ప్రతి సందర్భంలోనూ తానే వుండాలని కోరుకుంటారు. అప్పుడే స్ధిరమైన పాలన సాగుతుంది. లేకుంటే అతుకుల బొంతౌతుంది. పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని అందరితో కలుపుకుపోతున్నట్లు వుంటుందే గాని, అన్ని నిర్ణయాలు ఒక్కరే చేస్తుంటారు. అంతా అదిష్టానం కనుసన్నల్లోనే సాగుందని అనుకుంటారు గాని, పార్టీ నాయకుడు చెప్పిందే జరుగుతుంది. కాంగ్రెస్‌పార్టీలో ముఖ్యపాలకుడైన ఏ నాయకుడు తన పదవి పోవాలని కోరుకోడు. తన స్ధానంలోకి మరొకరు రావాలని అనుకోరు. వీలైనంత కాలం, ప్రజలు ఆశీర్వదించినంత కాలం కుర్చీలో వుండాలనే ఆశిస్తారు. మందు తరం పాలకులు రికార్డులను అధిగమించాలనే అనుకుంటారు. తన పదవి జారిపోయే పరిస్దితి కలలో కూడా తెచ్చుకోవడానికి ఇష్టపడరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో 2004 కు ముందు ఒక లెక్క… ఆ తర్వాత ఒక లెక్క అని అందుకే అంటారు. కాంగ్రెస్‌ పార్టీలో అలకలు, కుదుపులు లేకపోతే ఆ మాజానే వుండదంటారు. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి రావాలన్నా, ఓడిపోవాలన్నా ఆ పార్టీ నాయకులే తప్ప ఎవరూ ఓడిరచలేదు. ఎవరూ గెలపించలేరు. ఇది గతంలో అనేక సార్లు రుజువైంది. తరాలు మారినా కాంగ్రెస్‌ సంస్కృతి మారదు. కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అంటే కుమ్ములాటలు వుండేది. ఆదిపత్య రాజకీయాలు కనిపించేవి. కాని 2004 నుంచి అవి తగ్గిపోయాయి. అందుకు కారణం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి. అంతకు ముందు ఎంత పెద్ద నాయకుడైనా, ఎంతటి ప్రజాదరణ వున్న నాయకుడైనా సరే ముఖ్యమంత్రి కుర్చీలో ఎంత కాలం కూర్చుంటాడో అన్నదానికి లెక్క వుండేది కాదు. ఎప్పుడు పదవి నుంచి దిగిపోతాడో తెలిసేది కాదు. అందుకే అప్పటి ముఖ్యమంత్రులంతా రాజీనామా పత్రాన్ని ఎప్పుడూ జేబులో పెట్టుకునే వారని కూడా అంటారు. అదీ కాంగ్రెస్‌లో ఒకప్పటిరాజకీయం. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ తెచ్చి 1971 అధికారంలోకి తీసుకొచ్చిన పి.వి. నర్సింహారావు లాంటి నాయకుడు ఏడాదిన్న కూడా పాలించలేకపోయాడు. కాని దేశాన్ని ఆయన ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని దిగ్వియజంగా నడిపాడు. 

                                   దేశంలో ఆర్ధిక సంస్కరణలు తెచ్చి, నేటి ఆర్ధిక పురోగతికి బాటలువేశాడు. కాని ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలలో ఆయన నెగల్లెకపోయాడు. డిల్లీ రాజకీయాలకు పరిమితమయ్యారు. తర్వాత 1989లో ఒంటి చేత్తో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మర్రి చెన్నారెడ్డి పదమూడు నెలలు మాత్రమే పాలించాడు. తర్వాత పదవి పోగొట్టుకున్నాడు. ఆఖరుకు రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టకుండాపోయారు. డిల్లీ పెద్దల కనుసన్నల్లో ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలకు గవర్నర్‌గా పంపించి, ఉమ్మడిరాష్ట్ర రాజకీయాల వైపు చూడకుండాచేశారు. ఇదంతా గతం. అప్పటి చరిత్ర వేరు. ఇప్పటి చరిత్ర వేరు. అందుకు ఆద్యుడు వైఎస్‌. రాజశేఖరరెడ్డి అని చెప్పకతప్పదు. అయితే గతంలో ముఖ్యమంత్రులను మార్చేలా రాజకీయాలు చేసింది రాజశేఖరరెడ్డే. తన పదవి పోకుండా ఐదేళ్లపాటు జాగ్రత్తలు తీసుకున్నదికూడా రాజశేఖరరెడ్డే. రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నది రెండు దశాబ్ధాల కల. 1989లోనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. కాని కుదరలేదు. 1999లో అనుకున్నాడు. కాని కాలేదు. దాంతో ఆనాటి రాజకీయాలన్నీ తన చేతుల్లోకి తీసుకొని, అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేక పెరిగేందుకు, తనపై ప్రజలు నమ్మకం కలిగేందుకు వైఎస్‌. పాదయాత్ర చేశారు. ప్రజల మన్ననలు చూరగొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చారు. నిజం చెప్పాలంటే ఆనాడు రాజశేఖరెడ్డి పాదయాత్ర చేయకపోతే వైఎస్‌ అధికారంలోకి వచ్చేవారు కాదు. అయితే ఆయన ఎదుగుదలను కూడా అప్పటి సీనియర్లు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆయనపై అనేక ఆరోపణలు చేసేవారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వైఎస్సే అంటూ నిందలు కూడా వేశారు. ఆ రోజుల్లో పిసిసి. అధ్యక్షుడుగా వున్న వైఎస్‌ చేసిన నిర్ణయాలను సీనియర్లులో ఒకరైన వి. హనుమంతరావు పదే పదే ప్రశ్నించేవారు. వైఎస్‌ను నిత్యం దుమ్మొత్తిపోస్తుండేవారు. అలాంటి హనుమంతరావు కూడా వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత నోరు మెదపకుండా ఊరుకున్నారు. రాష్ట్ర రాజకీయాలలో వైఎస్‌ పాలనను కీర్తిస్తూ వచ్చారు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే పాత్రను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పోషిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని నేతగా మారారు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా! అన్నట్లు సీనియర్లందరినీ కాదని పిసిసి. అధ్యక్షుడయ్యారు. ఆ పెద్దలకు అవకాశం రాకుండా తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. సీనియర్ల నోరు మూయించారు. 

                                                          నిజానికి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నప్పుడే సీనియర్లు ఎంత మంది అడ్డుకున్నారు. వద్దని వారించారు. వాదించారు. కాని అధిష్టానం చేర్చుకున్నది. వస్తూనే ఆయనకు వర్కింగ్‌ ప్రెసిడెంటు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయనపై సొంత గూటిలోనే ఎదురుదాడి జరుగుతూనే వుంది. ఆ సమయంలో రేవంత్‌ ఏ వ్యాఖ్య చేసినా దానిపై ముందు కాంగ్రెస్‌ నుంచే కౌంటర్‌ వచ్చేది. అంతే కాకుండా రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడు కాకుండా సీనియర్లు శత విధాల ప్రయత్నించారు. అయిన తర్వాత కూడా ఆయనను ఒక రకంగా నిత్యం వేదిస్తూనే వచ్చారు. ఇదే రేవంత్‌కు మరింత బలంగా మారింది. ఆయనపై కాంగ్రెస్‌ నాయకులు వెల్లగక్కే అక్కసు కూడా రేవంత్‌రెడ్డికి కలిసి వచ్చింది. రేవంత్‌ రెడ్డి పిపిసి. అధ్యక్షుడు అయిన వెంటనే వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి బల్మూరి వెంకట్‌కు కేవలం 3వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతకు ముందు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌషిక్‌రెడ్డికి 60వేల ఓట్లు వచ్చాయి. దాంతో రేవంత్‌రెడ్డిపై సీనియర్ల విమర్శల జడివాన కురిపిస్తూ వచ్చారు. అయినా ఎంతో సహనంతో రేవంత్‌ రెడ్డి ఓర్చుకున్నారు. పిసిసి.పదవి కొనుక్కున్నాడని ఆరోపణలు చేశారు. తర్వాత వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్‌ ఓడిపోవడంతో రేవంత్‌ను దించేయాలని కూడా డిమాండ్‌ చేస్తూ వచ్చారు. నాడు రేవంత్‌రెడ్డి మెదక్‌ జిల్లా పర్యటన పెట్టుకుంటే తనకు తెలియజేయకుండా ఎలా ప్రకటిస్తావని జగ్గారెడ్డి నిలదీసిన సందర్భం వుంది. పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లాలో అడుగు పెట్టొద్దని కోమటి రెడ్డి సోదరులు హుకూం జారీ చేసిన సందర్భం కూడా వుంది. ఇలా అన్ని పరిస్ధితులను తట్టుకుంటూ, మరో వైపు కేసిఆర్‌ను ఎదిరిస్తూ రాటు దేలిపోయాడు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. ఆ సమయంలో షర్మిల కూడా పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అంటూ రేవంత్‌రెడ్డి పాదయాత్రపై విసుర్లు విసిరారు. ఎవరెన్ని మాటలన్నా ఆఖరుకు రేవంత్‌రెడ్డి కృషే గెలిచింది. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించింది. అయినా సీనియర్లు మేమంటే మేమే అంటూ సిఎం కావాలనుకున్నారు. కాని అధిష్టానం ముందే నిర్ణయించుకున్నట్లు రేవంత్‌ రెడ్డినే ముఖ్యమంత్రిని చేశారు. ఇక్కడ రేపటి తరం నాయకులు నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం వున్నాయి. నాయకుడికి ఒక లక్ష్యం వుండాలి. గాలి వాటం రాజకీయాలు చేసేవారు కొంత వరకు మాత్రమే ఎదుగుతారు. అయితే కొందరికి అనుకోని అదృష్టాలు కలిసివస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి లాంటి వారికి అలాంటి అవకాశాలువచ్చాయి. కాని రేవంత్‌ రెడ్డి అవకాశాలు సృష్టించుకున్నారు. నాయకుడిగా ప్రజల చేత మెప్పించుకున్నాడు. ప్రజలు రేవంత్‌ రెడ్డి నాయకత్వం కావాలని కోరుకునేలా చేశాడు. ఎక్కడికెళ్లినా యువత ఆయన కోసం ఎదరుచూసేలా చేసుకున్నాడు. యూత్‌కు ఐకాన్‌గా మారాడు. తాను ముఖ్యమంత్రి కావాలనే రాజకీయాల్లోకి వచ్చానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అలా తన నాయకత్వం మీద అచెంచలమైన విశ్వాసం వున్న ఏ నాయకుడైనా చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రకు తానొక సాక్ష్యంగా మారుతారు. చరిత్రకు కొత్త భాష్యం చెబుతారు. అందుకే అధిష్టానం కూడా అన్ని సందర్బాలలోనూ రేవంత్‌కే సై అంటోంది..సీనియర్లను పక్కన పెడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *