రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు