పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గా మిట్టపల్లి ?

పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌కు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకూ వేడెక్కుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై కసరత్తు ప్రారంభించాయి. ప్రత్యేకించి ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో ఈసారి టికెట్ల కేటాయింపు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం కావడంతో ఈసారి ఆ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి రాష్ట్రంలోని దళిత జనాభాలో 75 శాతం మాదిగలే ఉండడంతో రిజర్వ్‌డ్ స్థానాల్లో జనాభా దమాషా ప్రకారం ఈసారి ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. వరంగల్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ సహా మాదిగలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాదిగలకే టికెట్లు ఇవ్వాలంటూ ప్రధాన పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకు పోటీ చేసేందుకు అవకాశం దక్కని ఉద్యమకారులు, కొత్త అభ్యర్థులకు ఎంపీ టికెట్లు ఇవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు. వరంగల్ నుంచి గుడిమల్ల రవికుమార్, సిద్ధిపేట నుంచి ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ వంటి వారికి టికెట్లు కేటాయించాలని గట్టిగా డిమాండ్ వినిపిస్తోంది. 

ఇటీవల జరిగిన 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సామాజిక వర్గాలకు సంబంధించిన సామాజిక సమీకరణాలు కూడా ఆలోచించలేదు. వాస్తవానికి ఎస్సీల్లో అత్యధిక ఓట్లు మాదిగలకు ఉన్నప్పటికీ వారిని కాదని మరీ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో మాలలకు టికెట్లు ఇచ్చింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల కారణంగా విపరీతంగా క్రాస్ ఓటింగ్ జరిగి అంతిమంగా కాంగ్రెస్‌కు లాభం చేకూరింది. అలా జరక్కపోయి ఉంటే కచ్చితంగా బీఆర్ఎస్ ఓట్ల శాతం అంతగా తగ్గేది కాదు. కనీసం ఈ పార్లమెంటు ఎన్నికల్లో అయినా అవకాశమున్న ప్రతి చోటా మాదిగలకు టికెట్లు ఇవ్వాలనీ.. అప్పుడే మాదిగల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్న తలనొప్పులు తగ్గుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల ఎన్నికల్లో విజయం దక్కించుకోవడంతో పాటు మాదిగ సామాజిక వర్గాన్ని కూడా గుర్తించినట్టు అవుతుందని అంటున్నారు.ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలన్నీ కొత్త ముఖాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఈసారి ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు మిట్టపల్లి సురేందర్‌ను బరిలోకి దించాలని బీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు మిట్టపల్లి సురేందర్ జన్మదినం సందర్భంగా ఈ చర్చ తెరమీదికి వచ్చింది. ఆయన అక్కడ విజయం సాధించేందుకు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు సహా అనేక సానుకూల అవకాశాలు ఉన్నాయి. దీంతో కచ్చితంగా ఆయన విజయం సాధించగలరనీ.. పార్టీకి కూడా కొత్త శక్తి వస్తుందని భావిస్తున్నారు. మిట్టపల్లికి ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని, బెల్లంపలి, మంచిర్యాల సహా అన్ని నియోజకవర్గాల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, రాజకీయంగా మంచి పట్టు ఉండడంతోపాటు సింగరేణి కార్మికలోకంలో కూడా మిట్టపల్లి అంటే అంతులేని అభిమానం ఉంది. గౌడ సామాజికవర్గానికి చెందిన ఆడబిడ్డను కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో.. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని గౌడ సామాజికవర్గంలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు పెద్దపల్లి లోక్‌సభ నియోజవర్గంలో ఆయన సొంత సామాజికవర్గం మాదిగల ఓట్లే అధికంగా ఉన్నందువల్ల ఇది కూడా ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దళితుల్లో మాదిగలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఇంత వరకు ఆ సామాజికవర్గానికి టికెట్లు దక్కలేదు. దీంతో ఈసారైనా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.   

బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు మిట్టపల్లి ఆ పార్టీలోనే కొనసాగారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఏనాడూ పార్టీకి దూరం జరగలేదు. ప్రత్యేకించి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కేటీఆర్, కవిత సహా ఆ పార్టీ నాయకత్వానికి అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అత్యంత చిత్తశుద్ధితో పనిచేసిన ఉద్యమకారుడుగా మిట్టపల్లికి మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ధూంధాం పాటలతో పల్లెపల్లెనా తిరిగి ఉద్యమాన్ని రగిల్చిన ఆధునిక వాగ్గేయకారుడు. బీఆర్ఎస్‌లో కొనసాగుతూనే.. ‘జై తెలంగాణ’ అని నినదించిన ప్రతి పార్టీతోనూ ఆయన పనిచేశారు. దీంతో పార్టీలు, కులమతాలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టకుని ఉన్నారు మిట్టపల్లి. ఇటీవల జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్నో పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినప్పటికీ ఆయన వెళ్లలేదు. ఇప్పటికీ వివిధ ప్రధాన పార్టీలు తమలో చేరాలంటూ అడుగుతున్నప్పటికీ వెళ్లేందుకు మాత్రం ఆయన అంగీకరించలేదు. ‘‘రాజకీయాల్లో స్థిరత్వం అనేది ముఖ్యం. ఒక్కసారి పార్టీ మారితే వ్యక్తిత్వం కోల్పోతాం. వ్యక్తిత్వం లేని నాడు మన దగ్గర ఏమీ మిగలదు…’’ అంటారాయన. ఆయన తాను నమ్మిన సిద్ధాంతానికి, రాజకీయ విలువలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో చెప్పడానికి ఈ మాట చాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *