`నేటిధాత్రి వార్తకు 12 గంటల వ్యవధిలో కదిలిన యంత్రాంగం.
`వెంటనే ఎంక్వైరీకి ప్రభుత్వ ఆదేశాలు
`నేటిధాత్రి కథనంతో ఉలిక్కిపడిన పౌరసరఫరాల శాఖ.
`కమీషనర్ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు.
`సివిల్ సప్లయ్ అధికారులపై కలెక్టర్ సీరియస్.
`అధికారులలో మొదలైన ఆందోళన.
`గతంలో ఇచ్చిన రిపోర్ట్ కరక్టే అంటే ఓ తంటా!
`కొత్త రిపోర్ట్ ఇస్తే ఉద్యోగాలకు గుదిబండ!
`అడకత్తెరలో ఇరికిన ఉద్యోగులు.
`హుటాహుటిన రహస్యంగా గోదాం పరిశీలనకు రంగంలోకి దిగిన అధికారులు.
`నివేదిక ఎప్పుడు ఇస్తారు?
`ఎంత కాలంలో రిపోర్ట్ తయారు చేస్తారు!
`జాప్యం చేసి చేతులు దులుపుకుంటారా!
`ఈ సమస్య ఒక్క జిల్లాది కాదు.
`ఏ ఒక్క మిల్లర్ సుద్దపూస కాదు.
`ఇంత కాలం గుట్టుగా సాగింది.
`నేటిధాత్రి దృష్టికి రావడంలో వెలుగులోకి వచ్చింది.
`నేటిధాత్రి పరిశోధనలో విస్తుపోయే అంశాలున్నాయి.
`తెలంగాణ వ్యాప్తంగా కొన్నేళ్లుగా గుట్టుగా సాగిస్తున్నారు.
`ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు!
`ఈ వ్యవహారం అధికారులకు తెలియకుండా జరుగుతున్నది అసలే కాదు.
`అధికారుల పూర్తి సహాకారంతోనే జరుగుతున్న దోపిడీ.
`అదే శాఖ అధికారులతో ఎంక్వౌరీ అంటే దొంగల చేతికి తాళాలివ్వడమే.
`ఇంత కాలం మిల్లర్ల అక్రమ సంపాదనకు సహకరిస్తున్నదే అధికారులు.
`ప్రభుత్వం పూర్తి స్థాయి దృష్టి పెడితే తప్ప ప్రక్షాళన కాదు.
`ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు ఖజానాకు చేరవు.
`మిల్లర్లు చెబుతున్న మాటలు బూటకాలు.
`నష్టపోతున్నామన్న మాటలు నిజం కాదు.
`ప్రభుత్వం ఉదారతను అలుసుగా తీసుకున్నారు.
`దోపిడీకి ఎగబడి కోట్లు గడిస్తున్నారు.
`ప్రభుత్వానికి మాయమాటలు చెబుతున్నారు.
`అధికారుల సహకారంతో బియ్యం బుక్కేస్తున్నారు.
`లెక్కలకు సున్నా చుట్టేస్తున్నారు.
`రాష్ట్రవ్యాప్త మిల్లర్ల బాగోతాలు త్వరలో
రెండు రోజుల క్రితం నేటిధాత్రి దినపత్రికలో వచ్చిన గోదాం..గోల్ మాల్ కథనానికి పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించింది. రైస్ మిల్లర్లు సాగిస్తున్న అక్రమ దందాపై దృష్టి సారించింది. నేటిధాత్రిలో వచ్చిన కథనానికి ఒక్కసారిగా మిల్లర్ల వ్యవస్ధ ఉలిక్కిపడిరది. వార్తను చూసిన వెంటనే శాఖ కూడా స్పందించడంలో కొందరు మిల్లర్లకు పాలుపోలేని పరిస్దితి వచ్చేసింది. ఆ కథనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పౌరసరఫరాల కమీషనర్ వెంటనే వరంగల్ జిల్లాకు కలెక్టర్‌కు ఎంక్వౌరీకి ఆదేశాలు జారీ చేశారు. జరిగిన దానిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. రైస్ మిల్లులు సాగిస్తున్న అక్రమాలపై వెంటనే రిపోర్టు రూపొందించాలని కలెక్టర్ ఉద్యోగులు ఎంకౌరీ చేయాలని ఆదేశాలిచ్చారు. దాంతో పౌరసరఫరాల శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. కాకపోతే ఎవరికీ తెలియకుండా మళ్లీ గోదాం పరిశీలనకు వెళ్లినట్లు తెలిసింది. కాని దానిపై వివరాలు గోప్యంగా వుంచుతున్నారు. రైస్ మిల్లర్లు ఈ రకంగా కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఒకరి గోదాంలో వున్న వడ్ల బస్తాలను ఇతర మిల్లుల యజమానులు మావే అంటూ అదికారులకు చూపించడం జరగుతోంది. అదే నిజమని అదికారులు నమ్మి రిపోర్టు తయారు చేయడం జరగుతోంది. అసలు విషయమేమిటంటే జిల్లా పౌరసరఫరా అదికారులకు ఆ గోదాం ఎవరిదో తెలుసు.
ఏఏ మిల్లులు అదే గోదాం బస్తాల లెక్కలు కాగితాల మీద రాస్తున్నారని తెలుసు. పూర్తిగా పౌరసరఫరాల శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం గమనార్హం. ఇక్కడ ఎంక్వౌరీ అదికారుల కళ్లు గప్పడమనేది ఏదీ లేదు. అంతా బహిరంగ రహస్యమే. కాకపోతే నేటిధాత్రి వార్తను చూసి అధికారులు కూడా ముక్కున వేలేసుకుంటున్న నటిస్తున్నారు. మిల్లర్లంతా అదే గోదాంను చూపిస్తున్నా, అవే బస్తాలను లెక్కలోకి తీసుకుంటున్నారు. మిల్లర్లు ఇచ్చే సొమ్ముకు ఆశపడి ప్రభుత్వాన్ని పూర్తిగా మోసం చేస్తున్నారు. మిల్లర్లకు కోట్లు దోచిపెడుతున్నారు. అధికారుల లక్షలు కాజేస్తున్నారు? ఇదంతా ఏళ్ల తరబడి సాగుతున్న తంతే. కాని ఉన్నతాధికారుల దాకా ఈ విషయం పొక్కకుండా అతి జాగ్రత్తగా ఇంత కాలం మిల్లర్లు, అధికారులు మోసం చేస్తూ వస్తున్నారు. మిల్లర్ల పలుకుబడి ముందు అధికారులు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. రాజకీయాలతో సంబంధం వున్న మిల్లర్లు ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేస్తుంటారు. మిల్లర్ల అక్రమాలపై రిపోర్టులు తయారు చేయలేక, అదికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మిల్లర్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తమ కొలువులకు ఇబ్బందులు ఎదురౌతాయన్న భయంకూడా వారిలో వుంటుంది. కాకపోతే ఇప్పుడు మొదటికే మోసం వచ్చే పరిస్ధితిని అధికారులు కొని తెచ్చుకున్నారు. స్వయంకృతాపరాధంతో కొలువులకు ఎసరు తెచ్చుకున్నారు. ఒక్కసారి బయపడితే ఎల్ల కాలం భయపడాల్సివస్తుందన్న నిజాన్ని గ్రహించలేదు. తాత్కాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా మిల్లర్లకు వంత పాడుతూ వచ్చారు. వారు చెప్పింది రాసుకుంటూ పోయారు. ఇప్పుడు ఇరుక్కుపోయారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వుంది. రహస్యాలన్నీ దాచింది, మిల్లర్లను ప్రోత్సహించింది అధికారులే అన్నది తేటతెల్లమైంది.
ఇప్పుడు అదికారులు కూడా తప్పించుకోలేని పరిస్ధితి. సహజంగా పౌరసరఫరాల శాఖలో ఏం జరుగుతుందన్నది మూడో కంటికి తెలియకుండా జరిగిపోతుంది. అందుకే ఎన్ని అక్రమాలు చేసినా చెల్లుతుందని మిల్లర్లు భావిస్తుంటారు. శాఖ అదికారులు సహకరిస్తూ పోతుంటారు. కాకపోతే గుడితోపాటు, గుడిలో లింగాన్ని మింగేసే పరిస్ధితికొచ్చారు. అసలు మిల్లులే లేని వాళ్లకు కూడా అధికారులు సహకరించడం నేరం. వారికి సహకరించి అవినీతికి పాల్పడడం అంతకన్నా పెద్ద నేరం. అయితే ఇది ఒక్క వరంగల్ జిల్లాకే పరిమితమైన దందా కాదు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న దందా. అందుకే ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా వున్న అధికారుల్లో గుబులు మొదలైంది. వరంగల్‌లో గోదాం..గోల్ మాల్ పై అధికారులు మరోసారి తనీఖీలు నిర్వహించారని తెలుస్తోంది. అయితే ఆ నివేదిక తయారు చేసేందుకు ఎంత కాలం తీసుకుంటారనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నివేదిక తయారు చేసే అవకాశం లేదు. గతంలో తనిఖీ చేసిన అధికారులే మళ్లీ నివేదిక తయారు చేయాల్సి వుంటుంది. గతంలో గోదాంను సందర్శించి తనిఖీ నిర్వహించి, బస్తాలు లెక్కవేసి మరీ రిపోర్టు తయారు చేశారు. మరి ఇప్పుడు ఆ బస్తాలు సంబందిత మిల్లర్‌వి కాదని తేలిస్తే ఒక తంటా ఎదురౌతుంది. తమకు తప్పుడు సమాచారమిచ్చారని ఒక వేళ అధికారులు మభ్యపెట్టాలని చూసినా, మిల్లర్లు ఊరుకోరు. తప్పుడు నివేదిక అప్పుడు తయారు చేశామని అధికారులు అంగీకరించలేరు. అందుకే కొంత కాలయాపన జరిగే అవకాశం వుంది. పై స్ధాయి నుంచి కింది స్ధాయి వరకు మేనేజ్ చేసుకునే సమయం కూడా చిక్కుతుంది. నివేదిక తయారు కోసం ఎంత సమయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అటు కమీషనర్ గాని, ఇటు జిల్లా కలెక్టర్ ఒత్తిడి తేస్తే తప్ప నివేదిక వీలైంనంత తొందరగా పూర్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే గాని ఇలాంటి దందాలు ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయన్నదానిపై దృష్టి పెట్టొచ్చు. పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న ఈ వ్యవహారంపై అదే శాఖకు చెందిన అధికారుల చేత విచారణ జరిపిస్తే దొంగల చేతికి తాళాలిచ్చినట్లే అని ప్రజలు అంటున్నారు. ఆ శాఖలో జరగుతున్న అక్రమాలపై ప్రత్యేక నిఘా వ్యవస్ధను ఏర్పాటు చేయాలంటున్నారు. లేకుంటే ఈ అక్రమ దందాను ప్రోత్సహించినట్లే ప్రభుత్వం ప్రోత్సహించినట్లే అవుతుంది. పూర్తి స్ధాయిలో ప్రభుత్వం దృష్టి సారించి విచారణ జరిపిస్తే గాని మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు కావు. పెండిరగ్ బిల్లులకు మోక్షం రాదు.
ఇంత పెద్ద ఎత్తున తంతును నిర్వహిస్తూనే మిల్లర్లు ఎప్పుడూ నష్టపోతున్నామని పదే పదే చెబుతుంటారు. దాంతో ప్రభుత్వానికి మిల్లర్ల లోగుట్టు దందా తెలియక ప్రభుత్వం వారిపై ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం చేయదు. ప్రభుత్వాలు చూపే ఉదారతను అలుసుగా తీసుకున్న మిల్లర్లు ఇలా అక్రమ దందాకు తెరతీశారు. అక్రమ దోపిడీకి ఎగబడి ఏటా కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వాలు ఇచ్చినంత స్వేచ్ఛ ఏ రాష్ట్రంలో మిల్లర్ల లేవు. మిల్లర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లు తీసుకోవడం లేదు. కాని పొరుగు రాష్ట్రాలలో ఎక్కడైన మిల్లర్లకు తీసుకున్న వడ్లపై డిపాజిట్లు తీసుకుంటారు. కాని తెలంగాణలో మిల్లర్లకు డిపాజిట్లు లేని వెసులుబాటు కల్పించారు. దాంతో మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను ఇష్టానుసారం అమ్ముకుంటున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాలలో మిల్లింగ్‌లకు ఇచ్చే రాయల్టీ తెలంగాణలో ఇవ్వడం లేదన్న సాకుతో తాము చాల నష్టపోతున్నామని కుంటి సాకులు చెబుతూ ప్రభుత్వం మీద నెపం నెట్టేస్తుంటారు. సానుభూతి పొందుతుంటారు. కాని అసలు లోగుట్టు ప్రజలకు తెలియదు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో మిల్లర్లను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు వారికి డిపాజిట్లు లేని వెసులుబాటు కల్పించింది. అదే మిల్లర్లకు వరంగా మారింది. అక్రమ దందాలకు ఆస్కారం కల్పించినట్లైంది. ఏకంగా మిల్లులు లేకున్నా కొందరు మిల్లర్లుగా చెలామణి అయ్యేందుకు దోహదపడుతోంది. వారు కూడ మిల్లర్ల అవతారం ఎత్తేందుకు ఉపయోగపడిరది. అందుకే వారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వానికి తెలియకుండానే బియ్యం అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి మాయ మాటలు చెప్పి బకాయిలు ఎగ్గొడుతున్నారు. పూర్తిగా అధికారుల ఆశీస్సులతో ఎవరికి వారి అందిన కాడికి బియ్యం బుక్కేస్తున్నారు. అధికారులు లెక్కలకు సున్నా చుట్టి, మిల్లర్లకు మేలు చేస్తున్నారు.