చీటింగ్‌లో చిట్‌ఫండ్స్‌ చమక్కు! ఎపిసోడ్‌-1

https://epaper.netidhatri.com/view/381/netidhathri-e-paper-19th-september-2024/2

-హైడ్రా రాకముందే అన్ని అమ్మేసుకుందాం

-కొన్ని చిట్‌ ఫండ్‌ సంస్థలు కొనుగోలు చేసిన స్థలాలన్నీ చెరువు శిఖాలే!అసైన్డ్‌ భూములే!

-హైడ్రా నోటీసులొచ్చే లోపు ఆనవాలు లేకుండా చూసుకోవడమే!

-తెలంగాణ వ్యాప్తంగా చిట్‌ ఫండ్స్‌ నయా మోసం!

-అగ్గువగా ఫ్లాట్లిస్తాం..ఆలోచించిన ఆశాభంగం!

-బురిడీ కొట్టిచ్చి..ప్లాట్లు అంటగట్టేస్తాం!

-డబ్బులు లేవని చెప్పేద్దాం..కావాలంటే ఫ్లాట్లు రాసిస్తాం!

-చిట్‌ ఎత్తినా నెలల తరబడి తిప్పించుకుంటాం..ఇది పాత మాట.

-చిట్టేసిన వాళ్లకు ఫ్లాట్లే ఇస్తాం..ఇది కొత్త మాట.

-ఇలా కూడా చీట్‌ చేస్తాం!

-హైడ్రా నుంచి తప్పించుకునేందుకు నయా వ్యాపారం!

-అమాయక కస్టమర్లను ఇలా కూడా ముంచేస్తాం.

-కస్టమర్లకు అమ్మేసి చేతులు దులిపేసుకుందాం.

-కేసుల నుంచి తప్పించుకుందాం..

-చిట్‌ అమౌంట్‌ ఇవ్వలేం…

-కావాలంటే ఫ్లాట్లు ఇస్తాం..

-చిట్‌ ఫండ్‌ వెంచర్‌ ఫ్లాట్లు అంటకడతాం?

-ఆలోచించుకోండి…మీ ఇష్టం!

-ఎలాగైనా వదిలించుకునేందుకు కొత్త ఎత్తుగడలు.

-అడ్డికి పావుసేరుకైనా అంటగట్టడమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా దెబ్బకు కొన్ని చిట్‌ఫండ్‌ కంపనీలు విలవిలలాడిపోతున్నాయి. చిట్‌ ఫండ్‌ సంస్ధల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైడ్రాకు చిట్‌పండ్‌ కంపనీలకు సంబంధం ఏమిటా? అన్న అనుమానం కల్గుతోందా? ఇక్కడే వుంది అసలు తిరకాసు. హైడ్రా తెరమీదకు రావడంతో చిట్‌ఫండ్‌ సంస్ధల మోసాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో చాల వరకు చిట్‌ ఫండ్‌ కంపనీలు రియల్‌ వ్యాపారం పెద్దఎత్తున చేశాయి. కొన్ని సంస్ధలు సంయుక్తంగా చేస్తే, కొన్ని పెద్ద సంస్ధలు సొంతంగా పెద్దఎత్తున రియల్‌ వ్యాపారం సాగించాయి. అయితే చిట్‌ ఫండ్‌ సంస్థలు పెట్టిన పెట్టుబడి మొత్తం చిట్‌ దారుల నుంచి వసూలు చేసిన డబ్బులే కావడం గమనార్హం. అయితే లోగుట్టులో కొన్ని ఆసక్తికరమైన అంశాలుంటాయి. గతంలో చిట్‌ఫండ్‌లు చిట్‌ వేసిన వారికాల పరిమిత పూర్తయిన తర్వాత వచ్చే ఎక మొత్తం సొమ్మును వారికి ఇవ్వకుండా వారిని ఒప్పించి, మెప్పించి, లేని పోని ఆశలు కల్పించి, అధిక వడ్డీ ఎర వేసి, ఆ సొమ్మును డిపాజిట్లు తిరిగి అవే సంస్ధలు తీసుకునేవి. చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ అనే లెక్కతో చిట్లు వేసిన వారిని పెద్దఎత్తున ప్రజల సొమ్మును డిపాజిట్లుగా మల్చుకునేవారు. అయితే కాల క్రమేనా ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి డిపాజిట్లకు అంగీకరించడం మానుకున్నారు. చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ల పేరుతో డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ తప్పుపట్టింది. వాటికి ఆ అర్హత లేదని తేల్చిచెప్పింది. దాంతో చిట్స్‌ కంపనీలు రియల్‌ వ్యాపారం బాట పట్టాయి. ఒక వేళ చిట్స్‌ నిబందనలు అతిక్రమిస్తే క్రిమినల్‌ చర్యలుంటాయని హెచ్చరించింది. దాంతో కొత్త మార్గం వెతుకున్నారు. ఇంతలో తెలంగాణలోనే దేశ వ్యాప్తంగా రియల్‌ వ్యాపారం పెరిగింది. ఒక దశలో ఉచ్చ దశకు చేరుకున్నది. ఆ సందర్భంలో ఇదే చిట్టి దారుల నుంచి చిట్స్‌కు చేరే సొమ్ముతో నగర శివారుల్లో వుండే రైతుల భూములను తక్కువ ధరకు పెద్దఎత్తున సేకరించుకొని పెట్టుకున్నారు. ప్రజల సొమ్మంతా అక్కడ పెట్టుబడి పెట్టారు. భూమి మీద పెడితే ఎప్పటికైనా మేలుతోపాటు, మరింత లాభమే తప్ప నష్టం వుండదు. రూపాయికి వేయి రూపాయలు లాభం వస్తుందన్న బలమైన నమ్మకం కూడా వుంది. అందుకే తెలంగాణలో అసలు సాగుకు కూడా పనికి రావనుకున్న భూమలన్నీ నివాస యోగ్యాలుగా మార్చే వ్యాపారం పెద్దఎత్తున మొదలైంది. దాంతో అత్యాశకు పోయిన కొన్ని చిట్‌ ఫండ్‌ కంపనీలు భూములు కొనుగోలు చేయడం, ఖాతాదారులకు సొమ్ము ఇవ్వకుండా, స్ధిరాస్ధుల పేరుతో వారి వెంచర్లలో ప్లాట్లు అంటగట్టడం మొదలు పెట్టారు. డబ్బులు అత్యవసరమైన వాళ్లు తప్ప, మిగతా వాళ్లంతా ప్లాట్లకు చిట్స్‌నుంచి వచ్చే సొమ్ముకు అదనంగా మరింత జత చేసి మరీ ప్లాట్లు కొన్నవాళ్లు కొన్ని లక్షల మంది వున్నారు. అలా మూడు చిట్లు, ఆరు ప్లాట్లుగా సాగుతున్న వ్యాపారాన్ని మరింత మరింత విస్తరించుకోవాలన్న ఆశతో చిట్స్‌ కంపనీలు విచ్చలవిడిగా భూములు కొనుగోలు చేశారు. అందులో చెరువు భూములున్నాయి. శిఖం భూములున్నాయి. అసైండ్‌ భూములు కూడ వున్నాయి. చిట్స్‌ కంపనీలు రైతులనుంచి నేరుగా సేకరించిన భూములతోపాటు వాటికి ఆనుకొని వున్న అసైండ్‌ భూములు, శిఖం భూములును కూడా మింగేశారు. రెవిన్యూ అధికారులతో కలిసి, రిజిస్ట్రార్ల్‌ను మేనేజ్‌ చేసుకొని ఎకరాల కొద్ది భూములను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్లాట్లు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. అయితే ఇలా అమ్మగా చిట్స్‌ ఆస్ధులుగా భవిష్యత్తులో కూడా ఖాతాదారులు ముడిపెట్టేందుకు ఇంకా కొన్ని వేల ఎకరాల భూములు చిట్స్‌ కంపనీల చేతుల్లో వున్నాయి.

ఇప్పుడు అనుకోకుండా హైడ్రా వచ్చి పడిరది. ఏం చేయాలో పాలుపోని చిట్స్‌ కంపనీలు ఆ భూములను ఎలాగైనా వదిలించుకొని,ఖాతాదారులకు కట్టబెడుతున్నారు. ఒకప్పుడు రూపాయి కూడా తక్కువ ఇచ్చేది లేదంటూ చిట్స్‌ సొమ్ముకు తోడు లక్షలకు లక్షలు వసూలు చేసిన కంపనీలు ఇప్పుడు ఆ ప్లాట్లను అడ్డికిపావుసేరుకు అమ్మకాలు సాగిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగాలు సాగిస్తున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత నిజానికి రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని అందరూ అనుకున్నారు. కాని రిజిస్ట్రేషన్లు ఆగిపోలేదు. కారణం అమాయకులైన ప్రజలను ఇలా చిట్స్‌ కంపనీలు మోసం చేస్తున్నాయి. సహజంగా చిట్టి ఎత్తుకున్న తర్వాత ఏ ఖాతాదారుడికైన కంపనీలు మూడు నెలలలోపు ఆ సొమ్ము ఇవ్వదు. కొన్ని కంపనీలైతే అన్ని సక్రమంగా వున్నా ఆరు నెలలకు కూడా సొమ్ములు ఇవ్వవు. ఇలాంటి సమయంలో చిట్స్‌ కంపనీలు ఖాతాదారులను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తాదు. అందులో ప్లాట్ల దందా ఒకటి. అయితే ఇటీవల చిట్టిలు ఎత్తుకున్న వారికి సొమ్ము ఇవ్వడం కుదరని కంపనీలు తెల్చి చెబుతున్నాయి. కంపనీల్లో సొమ్ములేదని, ఆసొమ్మంతా ఖాతాదారుల మేలు కోసమే భూమి మీద పెట్టుబడి పెట్టామని నమ్మిస్తున్నారు. చిట్టిని బట్టి భూమిని కేటాయిస్తామే తప్ప, సొమ్ములు చేతుల్లో లేవని తేల్చిచెబుతున్నారు. దాంతో ఖాతాదారులు తప్పని పరిస్దితుల్లో ప్లాట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఆ భూములన్నీ అన్ని సక్రమంగానే వున్నట్లు మాయ చేస్తున్నారు. ఖాతాదారులను మభ్యపెడుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అలా చకచకా సాగుతున్న రిజిస్ట్రేషన్లలో అన్నీ ఇలాంటివే అన్న నిజాలు వెలుగు చూస్తున్నాయి. కంపనీల్లో సొమ్ము లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి! అని తెల్చి చెబుతుండడంతో, దిక్కు తోచక ఖాతాదారులు ప్లాట్లు తీసుకుంటున్నారు. కాని కొంత కాలానికి తాము పూర్తిగా మోసపోయామని తెలిస్తే వారి పరిస్ధితి ఏమిటన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఏటా కొన్ని వందల చిట్‌ కంపనీలు బోర్డులు తిప్పేస్తూనే వున్నా, ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని కొత్త కొత్త కంపనీలు పుట్టుకొస్తూనే వున్నాయి. వ్యాపారం విస్తరించుకుంటూనే వున్నాయి. ఖాతాదారులు సొమ్ముతో రియల్‌ వ్యాపారం సాగిస్తూనే వున్నాయి. అయితే గతం వేరు. ఇప్పుడు వేరు. గతంలో ఖాతాదారులకు చిట్స్‌ కంపనీలు అంట గట్టిన ప్లాట్లలో కూడా ఏవి నిజమైనవి? ఏవి చెరువుల్లో వున్నవి అన్నవి కూడా కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇప్పటికే మోసపోయిన వాళ్లు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది వున్నారు. ఇంత జరుగుతున్నా చిట్స్‌ కంపనీలు ఇంకా మోసం చేస్తూనే వున్నాయి. ప్రభుత్వం వెంటనే మేలుకొని ఇలాంటి మోసాలపై ప్రజలను అప్రమత్తంగా వుండాలని హెచ్చరించాల్సిన అవసరం వుంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత వుంది. లేకుంటే ప్రజలు ఇంకా నష్టపోవాల్సివుంటుంది. తర్వాత బుల్లోజర్లు వచ్చి, ప్లాట్లు స్వాదీనం చేసుకుంటే ప్రజలు లబోదిబోమనక తప్పదు. అయితే వున్న భూములను ఇప్పుడే అమ్మేస్తే తమకు చేతులకు మట్టి అంట కుండా వుంటుంది. కేసుల బారిన పడుకుండా జాగ్రత్తపడొచ్చని చిట్స్‌ కంపనీలు ఈ ఎత్తుగడ వేశాయి. ఒక వేళ హైడ్రా ఆ భూములను ఇప్పుడే స్వాధీనం చేసుకుంటే చిట్స్‌ వ్యాపారాలు కుప్పకూలిపోతాయి.

పైగా భూమ్మీద పెట్టిన సొమ్ముంతా చెరువు పాలౌతుంది. ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ములేదని చేతులెత్తేయాల్సి వస్తుంది. అయితే ప్రజల సొమ్ముతో అక్రమ వ్యాపారం చేసినందుకు కేసులు ఎదుర్కొవాల్సి వస్తుంది. చిట్స్‌ వ్యాపారంలో మోసపోయామంటే చెల్లుతుంది. కాని ఖాతాదారుల అనుమతి లేకుండా వారి సొమ్ము వారికి తెలియకుండా భూ వ్యాపారం చేసి లాభాలు గడిరచి, ఇప్పుడు నష్టపోయామని చెబితే చట్టం నమ్మదు. న్యాయస్ధానం ఒప్పుకోదు. ఇలాంటి కేసుల్లో ఐపి పెట్టడానికి కూడా అవకాశం వుండదు. అక్రమంగా అసైండ్‌ భూములు కొనుగోలు చేయడం నేరమని తెలిసి ఎలా కొనుగోలు చేశారన్నది తెరమీదకు వస్తుంది. ఏ రకంగా చూసినా చిట్స్‌ వ్యాపారులకు ముందునుయ్యి, వెనకు గొయ్యిగా మారుతుంది. ఆ ఉప ద్రవం నుంచి తప్పించుకోవడానికి గుట్టు చప్పుడు కాకుండా, అమాయకులైన ఖాతాదారులకు చిట్స్‌ కంపనీలు కుచ్చు టోపి పెడుతున్నారు. హైడ్రా వచ్చినప్పుడు వాళ్లే ఎదురుతిరుగుతారు. అంతే కాకుండా హైడ్రాకు ఎదురు తిరిగితే కేసులు నమోదు చేస్తారని భయపడి సైలెంటుగా వుంటారు. ఏది జరిగినా మళ్లీ చిట్‌ కంపనీలకే లాభం… అందుకే చిట్స్‌ కంపనీలు ఈ దురాగతానికి ఒడిగట్టాయి. ప్రజలారా..తొందరపడి చిట్‌ కంపనీలు అగ్గువకు ప్లాట్లు ఇస్తున్నారని మోసం పోకండి. వాటిని తీసుకోకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *